సమన్వయ సాధకులు ఆదిశంకరాచార్య

 
ఆదిశంకరాచార్య జన్మించేనాటికి దేశంలో వివిధ భారతీయ మతాల మధ్య సంఘర్షణలు జరుగుతూ ఉండేవి. అదే సమయంలో బౌద్ధం విశృంఖలంగా మారి, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నది. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించటం అనే ఒక చారిత్రక అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని ఆదిశంకరాచార్యుల వారు పూరించారు. ప్రారంభంలో బౌద్ధం మినహా మిగతా సాంప్రదాయాలు, మతాల మధ్య సామరస్యం సాధించేందుకు ప్రయత్నించారు. ఆ తదుపరి బౌద్ధం సనాతన ధర్మంలో ఒక భాగమే అనే విషయాన్ని బౌద్ధులకు అర్థమయ్యేటట్లు చేసి సనాతన ధర్మాన్ని తిరిగి నిలబెట్టినవారు ఆదిశంకరాచార్య.  
 
ఈ దేశంలో సాంస్కృతిక, సామాజిక సమైక్యతను సాధించినవారు, భగవాన్ శ్రీ కృష్ణుని తరువాత సనాతన భారతీయ సంప్రదాయాల మధ్య సమన్వయం సాధించిన ఖ్యాతి ఆదిశంకరాచార్యుల వారికే దక్కుతుంది. ఈ రోజుకు కూడా వారు చూపిన మార్గంలోనే మనం నడుస్తున్నాం. 
 
ఆది శంకరాచార్యుల వారే ఈ దేశానికి మొట్టమొదటి సమగ్రతావాది, జాతీయవాది. ఈ ఆధునిక ప్రజాస్వామ్య భావనలు వేళ్ళూనక ముందే క్రీ.శ.750 ప్రాంతంలోనే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ దేశాన్ని సమగ్రంగా అఖండంగా ఉంచేందుకు అతి చిన్నవయస్సులోనే ప్రయాణ సౌకర్యాలేవీ లేని ఆ రోజులలో ఆసేతు హిమాచలం కాలినడకన ప్రయాణించి ఈ దేశం సమగ్రతకు చిహ్నంగా నాలుగు వైపుల నాలుగు చరామ్నాయ పీఠాలను స్థాపించారు. తూర్పున పూరీలో పూర్వామ్నాయ గోవర్ధనపీఠం, పశ్చిమాన ద్వారకలో పశ్చిమ్నాయ శారదాపీఠం, ఉత్తరాన బదరీలో ఉత్తరామ్నాయ జ్యోతిర్మయపీఠం, దక్షిణాన శృంగేరిలో దక్షిణామ్నాయ శారదాపీఠం స్థాపించి యావత్భారతజాతిలో ఒకేవిధమైన ఆధ్యాత్మిక పరంపర కొనసాగుటకు కృషి చేశారు. 
 
అలాగే ఈ దేశంలో వివిధ ఆరాధనా పద్ధతులతో శైవము, వీరశైవము, వైష్ణవము, శాక్తేయము, గాణపత్యము (గణపతి ఆరాధన) సూర్యోపాసన వంటి విభిన్న పోకడలు తలెత్తి సనాతన హిందూ ధర్మం ప్రమాదంలో పడినప్పుడు హిందూమత పునరుత్థానానికి పైన తెలిపిన అన్ని ఆరాధనా పద్ధతులను సమన్వయ పరుస్తూ 'పంచాయతన' ఆరాధన పద్ధతిని ప్రారంభించారు. ఈనాటికి ఆ సాంప్రదాయమే భారతదేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పీఠాలు, మఠాలు, మందిరాలలోనూ, చివరకు వ్యక్తిగతంగా గృహ ఆరాధనా పద్ధతులలోనూ కొనసాగుతున్నది. కనుక ఈ దేశ ఆధ్యాత్మిక సంస్కృతిని, సాంప్రదాయాలను ఏకతాటిపై నడిపించినవారు శ్రీ ఆదిశంకరులే.  అటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతిని మనం ఈ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి అనగా 4.5.2014 ఆదివారం జరుపుకున్నాము.
 
ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో  ఏసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, బుద్ధుడు, బసవేశ్వరుడు వంటి వివిధ మతాల ప్రవక్తల జన్మదినాలకు, వర్ధంతులకు ప్రభుత్వ సెలవు దినాలు ప్రకటించిన మన ప్రభుత్వాలు వీరికంటే పూర్వుడు ఈ దేశంలో మొట్టమొదటి మత సంస్కర్త అయిన ఆదిశంకరాచార్యులవారి జయంతిని విస్మరించటం శోచనీయం. చివరకు పంచాంగకర్తలు, సిద్దాంతులు కూడా 'వైశాఖ శుద్ధ పంచమి'ని శంకర జయంతిగా క్యాలెండర్లలోనూ, పండుగల జాబితాలోనూ పేర్కొనడం లేదూ అంటే ఆలోచించవలసిన విషయమే. మొదట ప్రభుత్వం ఈ వైపు దృష్టి సారిస్తే, పంచాంగ కర్తలు కూడా ఆ విషయాన్ని గుర్తిస్తారనడంలో అతిశయోక్తి లేదు. కనుక ప్రభుత్వం ఈ విషయంలో చొరవను కనబరచాలి. 
 
- పతికి