నా జీవన స్వప్నం చెల్లాచెదరైంది

హితవచనం

మహాత్మా గాంధీజీ

గాంధీజీ చివరిక్షణం వరకు దేశ విభజనను నివారించేందుకే ప్రయత్నించారు. అయితే తనదైన విలక్షణమైన పద్ధతిలో ప్రయత్నించారు. విభజన ప్రతిపాదనతో మౌంట్ బాటన్ గాంధీజీ వద్దకు వచ్చినప్పుడు ఆయన తాను విభజనకు వ్యతిరేకినని చెప్పారు. విభజనకు అంగీకరించకపోతే దేశంలో అంతర్యుద్ధం చెలరేగుతుందని మౌంట్ బాటన్ హెచ్చరించినప్పుడు గాంధీజీ విభజనను నివారించేందుకు తన నూతన సూత్రాన్ని మౌంట్ బాటన్ ముందు పెట్టారు. ప్రస్తుతం ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, దాని స్థానంలో మొత్తం భారతదేశపు పరిపాలనను మహమ్మదాలీ జిన్నా చేతుల్లో పెట్టడమే ఆ సూత్ర సారాంశం. 

ఈ విషయంలో నెహ్రూను ఒప్పించేందుకు గాంధీజీ అనేక పర్యాయాలు ఆయనతో చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. జిన్నా ముందు ఈ ప్రతిపాదన ఉంచినపుడు అతడు దానిని మోసపూరితమైనదని కొట్టిపారేశారు. ఇక తను నిర్వహించవలసిన పాత్ర ఏమీ లేదని గ్రహించిన గాంధీజీ 'నా జీవన స్వప్నం చెల్లాచెదరైపోయింది' అని వ్యధ చెందుతూ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.