అవినీతి - జాతి భద్రతకు క్యాన్సర్

డా.సుబ్రహ్మణ్య స్వామి 


"జాతీయ భద్రత అనేది అనేక కోణాలలోఉంటుంది. వ్యక్తులకు రక్షణ, దేశ అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రత మొదలైనవి. ఇది ఒక సామాజిక భద్రత. రక్షణ దళాలు, రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి" అని జనతాపార్టీ అధ్యక్షులు డా.సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

ఆగష్టు 31న భాగ్యనగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన డా.జనమంచి గౌరీశంకర్ స్మారకోపన్యాస కార్యక్రమంలో డా.సుబ్రహ్మణ్యస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎ.బి.వి.పి.) ను తీర్చిదిద్దిన డా.జనమంచి గౌరీశంకర్ కు నివాళిగా ఈ స్మారకోపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో డా.స్వామి 'జాతీయ భద్రత' అనే అంశంపై ప్రసంగించారు.

డా.సుబ్రహ్మణ్యస్వామి సందేశం క్లుప్తంగా.. 

జాతీయ భద్రత అనే దానిని కేవలం చర్చల ద్వారా సాధించలేము. ఒక స్పష్టమైన నిర్ణయం ఉండాలి. ఎటువంటి చర్యకైనా వెనుకాడగూడదు. దానికి శక్తివంతమైన ఆయుధశక్తి కూడా మనం కలిగి ఉండాలి. అంటే దాడులు చేసేందుకు మాత్రమే కాదు, దాడులకు మేము సిద్ధం, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా మాకు ఉన్నది అని స్ఫష్టం చేయాలి. దానికి 5% జిడిపి బడ్జెట్ కావాలి. కాని మన కేంద్రప్రభుత్వం 2% మాత్రమే కేటాయిస్తున్నది. దీనిలో భాగమే ఆయుధాలను కొనటం. ఆయుధాలు కొనటంలో ఎంతో డబ్బు కమిషన్ల రూపంలో మన నాయకులకు చేరుతోంది. ఇటలీ నుండి, ఫ్రాన్స్ నుండి హెలికాప్టర్లు కొన్నందుకు ఎంతో కమిషన్ మనవాళ్ల చేతులలో పడింది. దీనిని ప్రశ్నించే పరిస్థితులలో లేదు మన ప్రభుత్వం.

ఈ రోజున దేశం అనేక తీవ్రవాదాలను, ఉగ్రవాదాలను ఎదుర్కొంటున్నది. ఇస్లాం ఉగ్రవాదం, నక్సల్ ఉగ్రవాదం, క్రైస్తవ ఉగ్రవాదం మొదలైనవి. వీటిని ఎదుర్కోవటానికి సరియైన నిర్ణయాలు కావాలి. చంద్రశేఖర్ ప్రభుత్వం ఉన్న సమయంలో నేను మంత్రిని. ఆ సమయంలో తమిళనాడులో ఎల్.టి.టి.ఇ.ని రద్దు చేయాలని, దాని ఆగడాలను అరికట్టాలని మేము నిర్ణయించాము. దాని కోసం కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దుచేయవలసిన అవసరం వచ్చింది. ఇట్లా చేస్తే తమిళనాడు తగులబడుతుందని చాలామంది హెచ్చరించారు. కాని కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు కనీసం ఒక్క సైకిల్ కూడా తగులబెట్టబడలేదు. రాజ్య నిర్ణయం సరిగా ఉంటే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనవచ్చు.

ఉగ్రవాదులు తయారు కావటానికి పేదరికం కారణమని చాలామంది అంటూ ఉంటారు. ఈ రోజున చూస్తే ఎవరైతే ఉగ్రవాదులుగా మారారో వాళ్లు అంతా మిలియనీర్లు. ఒసామాబిన్ లాడెన్ కోట్లకు పడగలెత్తినవాడు. ఉగ్రవాదులు అనేక మంది ధనవంతులు. ఈ రోజు అరబ్ దేశాలు చాలా సంపన్నంగా ఉన్నాయి. ఆయిల్ అమ్మి డబ్బు సంపాదించారు.  ఆ దేశాలలో పరిశ్రమలు కనబడవు. అరబ్బు దేశాల నుండి హవాలా ద్వారా డబ్బు అనేకమంది చేతులలోకి చేరుతున్నది.

జాతీయ భద్రతకు కాన్సర్ లాగా పట్టుకొన్నది అవినీతి. ఎందుకంటే అనేకమంది మంత్రులకు ముస్లిం దేశాల నుండి హవాలా ద్వారా ముడుపులు అందుతున్నాయి. అందుకే పాకిస్తాన్ మీద, దావూద్ ఇబ్రహీం మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ చర్య తీసుకొన్నా అరబ్ దేశాల నుండి వచ్చే ముడుపుల వివరాలు ఐ.ఎస్.ఐ. ద్వారా పత్రికలకు ఎక్కుతాయి. దానికి భయపడి కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. హవాలా ద్వారా ఈ మంత్రులకు విదేశీ బ్యాంకు ఖాతాల కోసం కావలసిన డాలర్లు అందుతాయి. దీనికి కేంద్రం దుబాయి. దుబాయి ఐ.ఎస్.ఐ.కి కేంద్రం. దుబాయికి వెళ్లి మనం ఏ వ్యాపారం చేయలేము. ఎందుకంటే ఐ.ఎస్.ఐ. అనుమతి ఉండదు కాబట్టి. మన మంత్రులకు బ్యాంకు ఖాతాలలో ఎంత డబ్బు ఉన్నదీ ఐ.ఎస్.ఐ.కి తెలుసు. వాళ్ల జాతకాలు ఐ.ఎస్.ఐ. చేతులలో ఉన్నాయి. కాబట్టి కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. ఇది సరి కావాలంటే అందరికి జాతీయదృష్టి కోణం ఉండాలి. నేను మొదట భారతీయుడిని. ఆ తరువాతే ఆంధ్రులు, తమిళులు అనుకోగలగాలి. ఇది లేని కారణంగానే మన మాజీ ప్రధానిని చంపిన తమిళ ఈలం వాళ్లకి శిక్ష వేయలేకపోతున్నారు. ఈ దేశంలోని అందరం భారతీయులం, హిందువులం. ఆధునిక శాస్త్ర పరిశోధనలో ఈ దేశంలో ఉండే ప్రజలందరి డి.ఎన్.ఎ. ఒకటేనని తేలింది. ఇది మనం గుర్తించాలి.