దేశం విభజనకు గురయింది. కాని మళ్ళీ ఏకమయ్యే అవకాశముంది...!

ఖండిత భారతం

1947 ఆగష్టు 14 రాత్రి 12 గంటలకు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. కాని అఖండ భారతదేశం ముక్కలయింది. 

రాత్రికి రాత్రి పాకిస్తాన్ ఏర్పడింది. పరాయి దేశమయిపోయింది. దిక్కుతోచని కోట్లాది హిందువులు కట్టుబట్టలతో ప్రాణాలరచేత పట్టుకుని ఖండిత భారతమాత ఒడిలో వచ్చిపడ్డారు. పశ్చిమ పంజాబు, తూర్పు బెంగాలు విభజనలో పాకిస్తాన్ కు వెళ్లాయి. పోరాడి సాధించుకోవలసిన స్వాతంత్ర్యం బేరాలాడి సాధించారు మన నాయకులు. 'నన్ను ఖండించండి, తరువాత దేశాన్ని ముక్కలు చేయండి' అన్న గాంధీ మాటలు నీటిమూటలయ్యాయి. దేశ విభజన ఒక పిచ్చివాగుడు అన్నాడు నెహ్రూ. కాని ఆయనే 1947 జూన్ 3న విభజన ప్రణాళిక మీద సంతకం చేశాడు.  

'ఇండియా డివైడెడ్' పుస్తకంలో శ్రీ రాజేంద్ర ప్రసాద్ దేశాన్ని విభజించటం అనేక సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రక్షణ పరమైన సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇదొక ఆచరణయోగ్యం కాని నిర్ణయమన్నారు. 'భారత విభజనను నేను ఎన్నటికీ మరువను, కంఠంలో ప్రాణం ఉండగా ఈ కళంకాన్ని మనం తుడిచివేయాలి' అన్నారు ఆర్.ఎస్.ఎస్. ద్వితీయ సరసంఘచాలక్ శ్రీ గురూజీ.  

లార్డ్ మౌంట్ బాటన్ కు ముందున్న లార్డ్ వేవెల్, బ్రిటిషు పార్లమెంటులో లేబరు పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీ కూడా దేశ విభజన ప్రతిపాదనను వ్యతిరేకించారు. యోగి అరవిందుడు ఆయన జన్మదినం ఆగష్టు 15నాడు 'విభజన ఒక శాశ్వత సత్యం కాదు' అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంతం నింపుకున్న అచ్చుత్ మీనన్, సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా విభజనను వ్యతిరేకించారు. ఇంకా ఆచార్య కృపలానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్, వీరసావర్కర్ వంటివారు విభజనను వ్యతిరేకించారు. 
 
1947కు ముందటి భారత్

ప్రహ్లాదపురి - ముల్తన్ గా, లవుడి పట్టణం - లాహోర్ గా మారాయి. పాణిని జన్మభూమి, వేదాలు పుట్టిన సింధునది, తక్షశిల, హరప్పా, మొహంజదారోలు పాకిస్తాన్ వశమయ్యాయి. సహజ వనరులైన చమురు, బొగ్గు, ఇనుము, నదీజలాలు, విద్యుత్తు, అసమతుల్యమైపోయాయి. రెండు దేశాలు స్వయంసమృద్ధి కోల్పోయాయి. రెండు దేశాలూ రక్షణ వ్యయాన్ని ఏఏటికాయేడు పెంచుకొంటూ పోతున్నాయి. 

వ్యాపారం పేరున వచ్చిన బ్రిటిషు వారు రాజకీయాధిపత్యం కోసం చేసిన ప్రయత్నంలో దేశ ప్రజలను విభజించి పాలించారు. సూఫీ మతగురువులు, శివాజీ, గురునానక్, అక్బర్, స్వాతంత్ర్యోద్యమ కాలంలో హకీం అజ్మల్ ఖాన్ వంటివారు హిందూ-ముస్లిం సఖ్యతకు చేసిన ప్రయత్నాలు ఏనాడూ ఫలించలేదు. 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీలక్ష్మీబాయి, తాంతియాతోపే, బహదూర్ షా కలిసి పనిచేశారు. దురదృష్టవశాత్తూ ఈ పోరాటం విఫలమయింది. సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిషు వారి దమననీతికి భయపడి ముస్లింలను రెచ్చగొట్టాడు. కాంగ్రెసును హిందూపార్టీ అన్నాడు. ముస్లింలను కాంగ్రెసు నుండి దూరంగా ఉంచేవాడు. 1893 అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అందులో తయారయిన మౌలానా మహమ్మద్ అలీ, షౌకత్ అలీ ముస్లిం వేర్పాటువాదాన్ని పెంచి పోషించారు. 

1905 అక్టోబరు 16న బ్రిటిషు ప్రభుత్వం బెంగాలు విభజనను ప్రకటించింది. ఆ రోజు రక్షాబంధన్. 50,000 మంది దేశభక్త ప్రజలు కలకత్తాలో పవిత్ర గంగానదిలో స్నానం చేసి సమైక్య బెంగాల్ కై ప్రతిజ్ఞ తీసుకున్నారు. లాల్, బాల్, పాల్ నాయకత్వంలో ఉద్యమం ఉధృతమైంది. 1911లో బెంగాల్ విభజన రద్దయింది. కాని సర్వ సామాన్య ముస్లిం ప్రజానీకంలో వేర్పాటు బీజం నాటబడింది. 

1905 డిసెంబర్ 30 ఆగాఖాన్ నాయకత్వంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. తరువాత జిన్నా దీనికి నాయకత్వం వహించాడు. క్రమంగా కాంగ్రెసు కూడా ముస్లింలకు అనుకూలంగా స్వరం పెంచింది. బ్రిటిషు వాళ్ళు, కాంగ్రెసు వాళ్ళు కలిసి హిందువులపై యుద్ధం ప్రారంభించారు. ముస్లింలను కలుపుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా గోహత్యను కూడా సమర్ధించింది. 

1927 లో సమైక్య బొంబాయి రాష్ట్రం నుండి సింధు వేరు పడేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. అది ముస్లిం ఆధిక్య రాష్ట్రం. ముస్లింలంతా సంబరాలు చేసుకున్నారు. 1943లో సింధ్ రాష్ట్రంలో పాకిస్తాన్ ఏర్పాటు విషయమై అసెంబ్లీలో తీర్మానం చేశారు. 1945 సాధారణ ఎన్నికల్లో ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలలో 86.8% ఓట్లు లభించాయి. కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ముస్లింలు ఓడిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిషు వాళ్ళు అలసిపోయారు. ముస్లింలీగు ఒత్తిడికి కాంగ్రెసు తలవంచింది. విభజన జరిగిపోయింది. 

మహాత్మా గాంధీజీ - లార్డ్ మౌంట్ బాటన్

స్వాతంత్ర్యానంతరం 67 సంవత్సరాల తరువాత నేడు దశాబ్దాల పాటు కాంగ్రెసు అవలంబించిన ముస్లిం సంతుష్టీకరణ విధానానికి బ్రేకు పడింది. శ్రీ నరేంద్రమోది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి సాధించిన హిందూ ముస్లిం సఖ్యత నేడు ప్రధానిగా జాతీయ స్థాయిలో సాకారమయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను పిలవడంతో ఈ ప్రక్రియ మొదలయింది. సార్క్ దేశాలన్నీ ఒకప్పటి అఖండ భారతంలో ఉన్న దేశాలు. సార్క్ దేశాల ఆర్థిక సామాజిక ఉన్నతి, సాంస్కృతిక ఏకత్వాన్ని కూడా సాధించేందుకు కావాల్సినంత కృషి జరగాల్సి ఉంది. ఇందులో భారత్ పెద్దన్న పాత్రను పోషిస్తుంది. 

పాకిస్తాన్ కు భారత్ పెద్దరికం చేయడం ఇష్టం ఉండదు. కాని నేడు తప్పదు. వారు రగిల్చిన తీవ్రవాదజ్వాల పాకిస్తాన్ సామాన్య ముస్లింలను దహించివేస్తుంటే, కక్షలు మాని, అభివృద్ధి, నిర్మాణాత్మక దృక్పథంతో అడుగులు వేస్తున్న భారత్ కు సహకరించాల్సిన అవసరం ఇప్పుడు పాక్ కు చాలా ఉంది. అన్ని సార్క్ దేశాలకు ఒక కామన్ కరెన్సీ, అన్ని సార్క్ దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్యం, పరస్పర మతసహనం, సాంస్కృతిక సహకారం వంటి అంశాల ప్రాతిపదికగా అఖండ భారతం కోసం ప్రయత్నం జరిగితే ఆ స్వప్నం సాకారమవుతుంది.

దేశం ముక్కలవడంతో ముస్లిం ప్రాంతంలోని హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక్కసారిగా భారత్ కు వలస వచ్చారు. ఈ ఫోటోలో రైలులో పైన కూడా ప్రాణాలకు తెగించి, బతుకు జీవుడా అంటూ గుంపులుగా గుంపులుగా వస్తున్న హిందువులు

దేశ విభజన అనంతరం పాకిస్తాన్ నుండి వచ్చే శరణార్ధుల కోసం భారత్ లో ఏర్పాటు చేసిన శిబిరాలు - తల పట్టుకొని కూర్చున్న ఒక శరణార్ధి

- హనుమత్ ప్రసాద్