బలహీన ప్రభుత్వాలే అనేక సమస్యలకు కారణం

ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ మా.శ్రీ సురేష్ జోషీ సందేశం 
 
వేదికపై సంఘ ప్రార్థన చేస్తున్న మా.శ్రీ సురేష్ జోషి (కుడివైపు చివర), మా.శ్రీ సుందరమూర్తిగారు (మధ్యన) తదితరులు
 
"సమాజహితం గురించి మాట్లాడటం, పని చేయడం రాజకీయ నాయకులు, కుల సంఘాల పెద్దలు, ధార్మిక నాయకులకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. సర్వ సామాన్య వ్యక్తి యొక్క బాధ్యత కూడా" అని శ్రీ సురేష్ జీ జోషి ఫిబ్రవరి 1న విశాఖపట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. విశాఖపట్టణం జిల్లా గణవేష్ ధారీ స్వయంసేవకుల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ కార్యవాహ శ్రీ సురేష్ జోషి మాట్లాడుతూ "ఈ రోజున దేశంలో స్వయంసేవక్ ఒక శక్తికి కేంద్రం. దేశంలో అవినీతి, బేధభావాలు తొలగిపోవాలంటే దేశంలో ప్రజలందరు దానికోసము పనిచేయాలి. భారతదేశం వేల సంవత్సరాల నుండి కొన్ని విలువల ఆధారంగా వికసిస్తూ వచ్చింది. దానిని ఒక శ్లోకంలో మన పెద్దలు చెప్పారు.

మాతృవత్ సరదారేషు - పరద్రవ్యేషు లోష్టవత్
ఆత్మవత్ సర్వభూతేషు - య:పశ్యతి పండితా:


తన భార్య మినహా అందరి స్త్రీలను తల్లిగా భావించాలి. కాని ఈ రోజున పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనందరికి తెలుసు. ఈ రోజున ఈ దేశంలో మహిళలపై అత్యాచాచాలు పెరిగిపోయాయి. గర్భస్థ ఆడశిశువులను గర్భంలోనే భ్రూణహత్యలు చేస్తున్నారు. వరకట్నం వేధింపులు పెరిగిపోయాయి. ఇతరుల డబ్బు మట్టితో సమానమని భావించే ఈ దేశంలో దోపిడి పెరిగిపోయింది. అవినీతి తాండవిస్తున్నది. అందరిలో ఒకే ఆత్మ ఉన్నది అన్న తత్వజ్ఞానం ఉన్న దేశంలో అంటరానితనం లాంటి వైషమ్యాలు పెరిగాయి. ఈ పరిస్థితులను సమాజం సహిస్తున్నది. ఈ పరిస్థితులలో మార్పు తీసుకొని వచ్చేందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభం నుండి పనిచేస్తున్నది. ఈ రోజున దేశంలో అందరిని కలుపుకొని ఈ పరిస్థితిలో మార్పు తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నది. బలహీన సమాజం ఎప్పుడు తన సమస్యలను పరిష్కరించుకోలేదు. బలహీన సమాజం ద్వారా మంచి ప్రభుత్వం కూడా ఏర్పడదు. బలహీన ప్రభుత్వం అనేక సమస్యలకు కారణమవుతుంది.

స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి మనదేశ పాలకులు దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తమ చేతుల్లోకి తీసుకొన్నారు. దేశం యొక్క ఆర్థిక విధానం ఎట్లా ఉండాలో నిర్ణయించేంది ప్రభుత్వం. ఈ దేశంలో విద్యారంగం ఎట్లా ఉండాలో నిర్ణయించేది ప్రభుత్వం. ఈ దేశంలో వ్యవసాయం ఎట్లా ఉండాలో నిర్ణయించేది కూడా ప్రభుత్వమే. వీటి కారణంగా చాలా సమస్యలొస్తున్నాయి. దానికి తోడు దేశంలో అస్థిర ప్రభుత్వాలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ విషయంలో మార్పు తీసుకొని రావాలి.

మన దేశం చుట్టూ ఉన్న సామ్రాజ్యవాద శక్తులు భారతదేశంలో ఉన్న అస్థిర పరిస్థితులను ఉపయోగించుకొని దేశాన్ని మరింత అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుండి 3.5 కోట్ల మంది బంగ్లా దేశీయులు భారత్ లో చేరి ఇక్కడే ఉంటున్నారు. పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి వచ్చి అరాజకం సృష్టిస్తున్నారు. చైనా మన మార్కెట్ ను ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నది. చైనా భారత్ లోని విద్రోహ శక్తులకు ఆయుధాలు అందించి దేశంలో అస్థిరత పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. తీవ్రవాదుల దాడుల్లో మరణించిన వారి సంఖ్య అమర వీరులను మించి ఉన్నది. చైనా ఉత్పత్తులను వ్యతిరేకించడం ద్వారా మన దేశాన్ని కాపాడుకోవాలి' అని పిలుపునిచ్చారు.