సమర్పణే జాతికి శ్రీరామరక్ష

శ్రీ గురుపూజ ప్రత్యేకం


 ఆషాఢ పౌర్ణమి వ్యాస మహర్షి యొక్క జన్మదినం. దానినే గురుపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రతి వ్యక్తి, సంస్థ తమ గురువులను మనసారా పూజించి, వారికి తమ శక్తిననుసరించి దక్షిణ సమర్పించుకునే సంప్రదాయం వేదకాలం నుండి మనదేశంలో కొనసాగుతున్నది. 


దేశభక్తికి మారుపేరుగా నిల్చిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో కూడా గురుపౌర్ణమి నాడు ప్రతి స్వయంసేవక్ గురువైన భగవాధ్వజాన్ని పూజించి, తను, మన, ధన పూర్వకంగా సమర్పణ చేయడం అనేది సంఘం ప్రారంభమైనప్పటి నుండి కొనసాగుతున్న సంప్రదాయం. సంఘాన్ని ప్రారంభించిన పరమ పూజనీయ డాక్టర్ జీ స్వయంగా గురువైన భగవాధ్వజాన్ని పూజించి సమర్పణ చేశారు.

సంఘంలో గురుపూజ ఎందుకు?  

సంపూర్ణ వ్యక్తిగా తయారు కావాలంటే ఆ వ్యక్తికి గురువు పట్ల భక్తి, ఎటువంటి స్వార్థం లేకుండా సర్వస్వం సమర్పించగల గుణం కూడా అలవడాలి. అందుకోసమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం గురుపూజా ఉత్సవాన్ని నిర్వహిస్తూ, వ్యక్తిలో సమర్పణ భావాన్ని నింపటానికి ప్రయత్నం చేస్తున్నది.

'సమర్పణ' అంటే ఏమిటి? 


శ్రీరాముడు, లక్ష్మణుడు దశరథ మహారాజు యొక్క ముద్దుల కుమారులు. 12 సంవత్సరాల పసిప్రాయులు. రాజప్రాసాదంలో అన్ని రకాల వసతుల మధ్య పెరుగుతున్న అత్యంత సుకుమారులు. హఠాత్తుగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజుతో "రాజా! అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులకు, ఋషులకు రాక్షసుల ద్వారా ప్రాణాపాయం కలుగుతున్నది. కావున రాక్షస సంహారం చేయవలసి ఉన్నది. దానికోసం రామలక్ష్మణులను నా వెంట అడవులకు పంపించవలసినది" అని కోరతాడు. అందుకు దశరథుడు వశిష్ఠుని సూచన మేరకు ఒప్పుకొని కుమారులైన రామలక్ష్మణులను ఆజ్ఞాపించగా వారు వెంటనే సంసిద్ధులై అడవులకు బయలుదేరతారు. అనేక కష్టాలననుభవిస్తూ కూడా ఆనందంగా గురువు చెప్పిన రాక్షస సంహార కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు.  

పెద్దలు కోరినంత మాత్రాన ఆడుకొంటూ ఆనందంగా గడపవలసిన పసిబాలురు అన్ని కష్టాలను అనుభవించవలసిన అవసరమున్నదా?


సాందీపని మహర్షి శ్రీ కృష్ణునికి విద్య నేర్పిన గురువు. గురుదక్షిణగా, కనబడకుండా పోయిన తన కుమారుడిని తెచ్చి ఇవ్వవలసిందిగా శ్రీ కృష్ణుని కోరతాడు గురువు. అది ప్రాణసంకటమైన పని అని తెలిసికూడా తక్షణం మనసారా అంగీకరించాడు శ్రీకృష్ణుడు. అన్ని లోకాలను గాలించగా చివరకు నడిసముద్రంలో, అత్యంత లోతులో కాళింది అనే సర్పం కడుపులో గురువుగారి కుమారుడు ఉన్నట్లుగా కనిపెడతాడు. ప్రాణాలకు తెగించి కాళిందితో యుద్ధం చేసి, వధించి, కడుపు చీల్చి గురుపుత్రుడిని ప్రాణాలతో తెచ్చి గురువుగారికి ఇచ్చాడు శ్రీకృష్ణుడు.  

కేవలం విద్య నేర్పిన గురువుకు ప్రాణాలకు తెగించి గురుదక్షిణ ఇవ్వవలసిన అవసరం ఏమున్నది?


ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య పట్టాభిషిక్తుడై ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలిస్తున్న రోజులవి. రాజ్యంలో ఎటువంటి కష్టాలు లేవు. కొంతకాలం తరువాత ఒకానొకరోజు గురువైన సమర్థ రామదాసస్వామి వచ్చాడు. స్వామీజికి శివాజీ తన రాజ్యం మొత్తాన్ని ఒక కాగితంపై వ్రాసి సమర్పణ చేశాడు. దానికి సమర్థ రామదాస స్వామి ఎంతో సంతోషించి, "తిరిగి ఈ రాజ్యం మొత్తాన్ని భగవాధ్వజం సాక్షిగా పరిపాలించు" అని శివాజీని ఆదేశించాడు. శివాజీ గురువుగారి ఆదేశంపై తిరిగి రాజ్యభారం స్వీకరించాడు.  

కష్టపడి సంపాదించిన అధికారాన్ని అంత సులభంగా వదులుకొనే నాయకులు నేడు ఎవరైనా కనబడుతున్నారా? అంతటి రాజ్యాన్ని తన వారసులకు కాక 'గురువు' అనే పేరుతో ఎవరో బయటివారికి కట్టబెట్టగలరా?

'సమర్పణ' అంటే ఇది. పైన చెప్పినవన్నీ నిజమైన 'సమర్పణ'కు ప్రత్యక్ష ఉదాహరణలు.

'సమర్పణ' అనే గుణం ఎందుకు అవసరం?  

భామాషాహి

భామాషాహి. ప్రఖర దేశభక్తుడు. దేశం కోసం, తమ రాజు కోసం సర్వస్వం సమర్పణ చేసిన వ్యక్తి. రాణాప్రతాప సింహుడు అక్బరు యొక్క సేనావాహినుల ధాటికి ఎదురు నిలిచి, సైన్యం, సంపద, రాజ్యం అన్నీ కోల్పోయి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. కనీసం తన కుటుంబానికి పట్టెడు అన్నం పెట్టలేని దీనస్థితి. ఆ సమయంలో హిందూ సమాజ ఉన్నతికై, తమ రాజుకు అండగా నిలవటానికి భామాషాహి ముందుకు వచ్చాడు. తాను కష్టపడి విదేశాలలో వ్యాపారం చేసి సంపాదించిన సకల ధనరాశులు, వజ్రవైఢూర్యాలు సర్వస్వం కనీసం వెయ్యి బండ్ల నిండా తెచ్చి తన రాజైన రాణాప్రతాపుడికి సమర్పిస్తాడు. ఆ సంపదతో రాణాప్రతాపుడు తిరిగి సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుని అత్యంత ఉత్సాహంతో అక్బరును ధీటుగా ఎదిరించి కోల్పోయిన కోటలన్నిటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

ఆ రోజున భామాషాహికి 'సమర్పణ' అనే గుణం కరువైనట్లయితే రాణా ప్రతాపుడి విజయం సాధ్యమయ్యేది కాదు, మేవాడు స్వాతంత్ర్యం నిలదొక్కుకునేది కాదు. అక్బరు ఆగడాలకు అడ్డుకట్ట పడేదీ కాదు.

రాణాప్రతాప సింహుడు

నేడు అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏది కోరితే అది తెచ్చి ఇస్తున్నారు. ఆ విధంగా పిల్లలకు 'తీసుకోవడమే' తప్ప 'ఇవ్వడం' అలవాటు చేయని కారణంగా వృద్ధాప్యంలో పిల్లలచే నిరాదరణకు గురై అనేక కష్టనష్టాలననుభవిస్తున్నారు. 'సమర్పణ' అనే గుణం అలవడని కారణంగా నేడు మన దేశంలో అడుగడుగునా అవినీతి ప్రబలిపోయింది. అనేకమంది తగినంత సంపాదన ఉండి కూడా అవినీతికి పాల్పడుతూ తోటి సమాజాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారు. రాజకీయాలలో అవినీతి నిత్యకృత్యమైంది. కుంభకోణాలనేవి ఒక ఫ్యాషన్ గా మారిపోయాయి.

సమర్పణే జాతికి శ్రీరామరక్ష 


'సమర్పణ' అనే గుణం అలవడినట్లయితే సమాజం, దేశం ఎటువంటి ఆపదలో చిక్కుకున్నప్పటికి వెంటనే స్పందించగలుగుతాము. సర్వస్వం అర్పించగలుగుతాము. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్వయంసేవకులలో 'సమర్పణ' భావాన్ని నింపటానికై ప్రయత్నం చేస్తున్నది. అందువలననే సమాజానికి, దేశానికి విపత్తు సంభవించిన అనేక సందర్భాలలో 'మేమున్నాము' అంటూ సంఘ కార్యకర్తలు ముందుకు వచ్చి, తమ సర్వస్వం అర్పిస్తూ జాతీయ పునర్నిర్మాణ కార్యంలో ముందుకు దూసుకుపోతున్నారు. 

- ఆకాష్