సంభవామి యుగే యుగే

ఏప్రిల్ 11 ఉగాది పండుగ, ఆర్.ఎస్.ఎస్. స్థాపకులు పూజనీయ డాక్టర్జీ జన్మదినం. 

ఆ సందర్భంగా ప్రత్యేక వ్యాసం 


భారతదేశం ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. భూప్రపంచంలో అతి విశిష్టమైన, అతి సుసంపన్నమైన, శక్తివంతమైన దేశం. ఇటువంటి మహోన్నతమైన దేశానికి, దేశ ప్రజలకు కష్టాలు తప్పలేదు. అనాదికాలం నుండి అధర్మం పెచ్చరిల్లడం దుష్టశిక్షణ చేసి, శిష్టరక్షణ మరియు అధర్మ వినాశనం, పున:ప్రతిష్ఠాపన చేయడం కోసం శ్రీ మహావిష్ణువు పది అవతారాలెత్తి మన జాతినుద్ధరించడం మనమెరిగిన చరిత్ర. 

కలియుగంలో గత వెయ్యి సంవత్సరాలలో మనదేశం చెప్పరాని క్లేశాలను అనుభవించినది. స్వాతంత్ర్యం కోల్పోయింది. ఈకాలఖండంలో ఎందరో మహాపురుషులు అవతరించారు. ధర్మరక్షణకు, జాతి పునర్వికాసానికి స్వాతంత్ర్య సాధనకు ఎంతో కృషి చేశారు. కాని కారణం ఏమిటో తెలియదు, ఫలితం మాత్రం శూన్యం. మన హిందూ దేశానికి ఒక వింత సమస్య. మనం శక్తివంతులమే, కాని ఓడిపోయాం. జ్ఙానులమే, కాని అజ్ఙానుల వద్ద పాఠాలు నేర్చకోవలసి వచ్చిన దౌర్భాగ్యం. హిందువులకేమి తక్కువ? ఒక ఆదిశంకరాచార్యులు, ఒక చాణక్యుడు, ఒక ఛత్రపతి శివాజీ అందరూ మనవారే. ఆధునిక కాలంలో ఒక దయానంద సరస్వతి, ఒక వివేకానందుడు, ఒక వినాయక సావర్కరుడు. వీరంతా దేశహితం కోసం, జాతి విమోచనం కోసం అహరహం శ్రమించినవారు. ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, డచ్చి, బుడతకీచులు ఇటువంటి అడ్డమైనవారు ''దొంగలు-దొంగలు ఊళ్ళు పంచుకున్నారు'' అన్నట్లు హిందూ దేశాన్ని పంచుకున్నారు, పరిపాలన సాగించారు. చివరికి అందరినీ త్రోసిరాజని ఆంగ్లేయులు దాదాపుగా మొత్తం భారతావనిని చేజిక్కించుకుని అనైతిక పాలన సాగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మనలను ఓడించి ఆక్రమించిన వారు సంఖ్యాబలంలో మనకంటే ఎన్నోరెట్లు తక్కువగా ఉన్నారు. అంటే అత్యల్ప సంఖ్యాకులు అత్యధిక సంఖ్యాకులను ఓడించి బానిసత్వంలోకి నెట్టారన్నమాట. ఇది తర్కానికి నిలువని మాట. కాని అదే వాస్తవం. ఇరువదవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశ స్థితి ఇది.  

ఈ నేపధ్యంలో... 


మహారాష్ట్రలోని నాగపురం పట్టణంలో ఒక నిష్ఠాగరిష్ఠుడు బలీరాం శ్రీధర్ హెడ్గేవారు ఒక ఉదయం స్నానాదులు ముగించి సూర్యోదయ వేళ సంధ్యావందనానికై ఉపక్రమించి 'ఓం కేశవాయ స్వాహ' అనబోతుండగా కుటుంబ సభ్యులొకరు పరుగు పరుగున వచ్చి ''అయ్యా! తమకు కుమారుడు జన్మించాడు" అని వార్త అందించారు. కేశవ నామాన్ని జపిస్తుండగా జన్మించిన పుత్రుడు కాబట్టి ఆ బిడ్డకు కేశవరావు అని నామకరణం చేశారు. ఆ వేళ చైత్రశుద్ధ పాడ్యమి (1.4.1889) ఉగాది పర్వదినం. ప్రొద్దు ఎక్కినకొద్దీ భానుడు చండప్రచండం అయినట్లు బాల కేశవుడు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఎదగసాగాడు. హెడ్గేవార్లది పేద కుటుంబం. కేశవుడి అన్నదమ్ములిద్దరూ పౌరోహిత్యం చేసేవారు. కేశవుడిని మాత్రం ఇంగ్లీషు చదువులో పెట్టారు తండ్రి. బాల్యం నుండీ కూడా కేశవుడు తన విశిష్టతని చాటుకుంటూనే పెరిగాడు. ఎదురులేని దేశభక్తి, ఎటువంటి శక్తికి కూడా తలవంచని ధైర్యం. సహజంగా అబ్బిన సంఘటనా చాతుర్యం. చిన్నతనంలోనే తాను చదువుకునే ''నీల్ సిటీ" పాఠశాలలో పాఠశాల ఇన్ స్పెక్టరు పాఠశాలకు వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులనందరినీ సమీకరించి ''వందేమాతరం'' నినాదాన్ని బిగ్గరగా అనిపించి ఆంగ్లేయ అహంకారాన్ని నివ్వెరపోయేటట్లు చేశాడు. ఫలితంగా పాఠశాల నుండి వెళ్లగొట్టబడ్డాడు. అయినా లొంగలేదు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉంటూనే శరీర వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దృఢకాయుడుగా, ఆరోగ్యంగా ఉండేవాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య, బ్రిటిష్ వ్యతిరేకత కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఎట్టి పరిస్థితులలో మాతృదేశ దాస్యశృంఖలాలను ఛేదించాలనే పట్టుదలతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. విప్లవ వీరులతో పనిచేసాడు. కాంగ్రెస్ కార్యకర్తగా ఒక సంవత్సరం జైలు జీవితం కూడా రుచి చూశారు. పదహారు సంవత్సరాల చిరుప్రాయంలోనే బ్రిటిష్ డిటెక్టివ్ లు ఎల్లప్పుడూ కేశవుడిని వెంబడిస్తూ ఉండేవారంటే కేశవరావు దేశభక్తి, కర్తృత్వం ఏమిటో తెలుస్తాయి. అతిపెద్ద హిందూ దేశం అతి చిన్న బ్రిటన్ దేశాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోయింది? గత వంద సంవత్సరాలలో ఎంతో మంది వీరులు ప్రాణతర్పణం చేసి కూడా ఎందుకు దేశాన్ని విముక్తం చేయలేకపోయారు? ఈ ప్రశ్నలు కేశవరావును ఎల్లప్పుడూ వేధించేవి. కలకత్తాలో వైద్యవిద్య అభ్యసించి డాక్టరు పట్టా సాధించి భారతమాతను పట్టిపీడిస్తున్న సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి ఒక ఔషధం, ఒక చికిత్సా విధానం కనిపెట్టాడు కేశవరావు. ఆ తరువాత డాక్టర్జీగా అందరితో ఎంతో ప్రేమతో పిలువబడిన డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ చేసిన నిర్ణయం ఏమిటంటే ''భారతమాత సంతానం హిందువులు. కాబట్టి భారతదేశం హిందువులదే, కనుక ఈ దేశం కోసం హిందువులే పోరాడాలి''. ''హిందువులలో ఐకమత్యం లేదు. జాతీయ భావన లుప్తమయింది. హిందువులలో సంఘటన సాధించాలి. వారి కర్తవ్యం వారికి బోధపడాలి. ఇవన్నీ నెరవేరాలంటే దానికి ఒక ప్రయత్నం కావాలి'' అని డాక్టర్జీ నిర్ణయించారు. ఆ నిర్ణయ ఫలితమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. 1925 విజయదశమి పర్వదినాన డాక్టర్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని (ఆర్.ఎస్.ఎస్.) స్థాపించారు. డాక్టర్జీ చేత స్థాపించబడిన సంఘం గత 87 సంవత్సరాలుగా నిర్విరామ కృషి జరుపుతూ పున:ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. విజయం వైపు అప్రతిహతంగా దూసుకుపోతున్నది.  
- ధర్మపాలుడు