వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతున్న యుపిఎ

విఫలమైన యుపిఎ విదేశాంగ విధానం

 
గత మాసం నవంబర్ 14 నుండి 17వ తేదీ మధ్యకాలంలో శ్రీలంకలోని కొలంబోలో కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రభుత్వాధినేత హోదాలో పాల్గొనవలసి ఉన్నప్పటికి, యుపిఎ భాగస్వామి అయిన తమిళ రాజకీయ పక్షాల ఒత్తిళ్లకు లోనై హాజరు కాలేదు. భారత్ పక్షాన ఖుర్షీద్ ఆలంఖాన్ (విదేశాంగ శాఖ) పాల్గొన్నారు. అంతేకాదు, 2014లో రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమిళుల ఓట్లు చేజారిపోకుండా, తమిళులకు కోపం రాకుండా వారిని సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టింది. నేపాల్, శ్రీలంక వంటి అతి చిన్న దేశాలతో సైతం భారతదేశం సత్సంబంధాలు నిర్వహించలేకపోతోంది. వేల సంవత్సరాలుగా మత, సాంస్కృతిక సంబంధాలు కలిగిన శ్రీలంక, నేపాల్ దేశాలు ఒకప్పుడు భారత్ లో అంతర్భాగం. ఇప్పుడు ఆ దేశాలతో చైనా సంబంధాలు పెరుగుతున్నాయి. బుద్ధిజం పేరుతో శ్రీలంకలోను, మావోయిజం పేరుతో నేపాల్ లోనూ చైనా తన ప్రభావం చూపగలుగుతున్నది. ఈ ప్రమాదాలు తెలిసి కూడా ప్రధాని కొలంబో కామన్వెల్త్ సమావేశాలకు హాజరు కాలేదు.

 
శ్రీలంక ప్రభుత్వం ఎల్.టి.టి.ఇ.తో అంతర్యుద్ధం జరిగిన కాలంలో తమిళుల హక్కులను కాలరాచిందని గత సంవత్సర కాలంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, వివిధ దేశాలు శ్రీలంకపై గుర్రుగా ఉన్నాయి. ఇంగ్లండు ముఖ్యంగా తమిళుల హక్కుల విషయంలో శ్రీలంకకు వ్యతిరేకంగా గళమెత్తింది. అలాంటి ఇంగ్లండ్ దేశం సైతం వారి రాజును ప్రభుత్వాధినేతగా కామన్వెల్త్ సమావేశాలకు పంపగా, పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీలంకతో సత్సంబంధాలకు అవకాశమున్న సమావేశాలను కాలదన్నుకోవటం అనేది మన యుపిఎ పాలకులకే చెల్లింది. ఇది పార్టీ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే.

ఇటువంటి చర్యలతో భారత్ చుట్టుప్రక్కల గల దేశాలు మనకు ప్రక్కలో బల్లెంలా వ్యవహరిస్తున్న చైనా ప్రభావానికి లోనై, మనకు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. ఇది భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు భంగం కలిగించే విషయం.  
 
- పతికి