యూపీ అసలు ముఖ్యమంత్రి ఎవరు?


అది దేశంలో అతి పెద్ద రాష్ట్రం. అంతేకాదు హిందువుల పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉన్నది కూడా అక్కడే. అయితే ఇప్పుడా రాష్ట్రానికి ఓ యువనేత సి.ఎం. ఆయనగారి తండ్రిగారు కేంద్రంలో యూపీఏ సర్కార్ కు ఆప్షన్ల మీద ఆక్సిజన్ అందిస్తున్న నేత. ఇంకొక విషయం. ఆ పెద్దాయన అసలు పేరు కంటే నేతాజీ పేరుతోనే ఆ రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. అలాంటి ఆ రాష్ట్రంలో పవర్ ఫుల్ ఎవరు? అంటే వెంటనే వచ్చే సమాధానం ఈ ఇద్దరు తండ్రీ కొడుకులేనని. అయితే ఈ ఇద్దరు నేతల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడించే సుప్రీం నేత ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరు ఉన్నారు. అసలైన మొఘలాయి సంస్కృతికి తానే సిసలైన వారసుడనని గర్వంగా చెప్పుకొంటూంటారు. ఇంతకీ ఆ సుప్రీం నేత ఎవరో తెలుసా? యూపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఆజంఖాన్.

విశ్వహిందూ పరిషత్ ఉత్తరప్రదేశ్ లో చౌరాసి కోసి పరిక్రమ యాత్ర తలపెట్టినప్పుడు మొదటయూపీ సిఎం అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ లను కలిసి యాత్రలకు రక్షణ, అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ భేటీలో చాలామంది సాధువులు కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో తనను కలిసిన విహెచ్పి నేతలతో తాను సిఎంగా ఉన్న సమయంలో అమాయకులైన కరసేవకులపై కాల్పులు జరిపిన ఘటనపై సైతం ములాయం విచారం వ్యక్తం చేశారు.

ములాయం నోట ఈ మాటలు రాగానే తన మొఘలిస్తాన్ స్వప్నం భగ్నమైనట్లు అరిచాడు ఆజంఖాన్. సమాజ్ వాదీ అధినేత, యూపీ సిఎం, వి.హెచ్.పి. నేతలు, సాధువులు కలవడంపై ఆగ్రహించాడు. ఈ కలయిక తమ ముస్లిం సమాజంలో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని, దీంతో ముస్లింలు సమాజ్ వాదీ పార్టీ వదలి మరో పార్టీని వెతుక్కోవలసి వస్తుందని బహిరంగంగానే ప్రకటనలు గుప్పించాడు. దీంతో ముస్లిం-యాదవ్ ఓటుబ్యాంకు బీటలువారుతుందనే భయంతో చివరకు ఆజంఖాన్ కు దాసోహమయ్యారు. సాక్షాత్తు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ సొంత పార్టీ అధినేత, సి.ఎం.లపై విమర్శలు గుప్పించిన ఆజంను మందలించే దమ్ము సమాజ్ వాదీ పార్టీలో ఎవరికీ లేకపోయింది. ఈ తర్వాత ఆగష్టు 25న వి.హెచ్.పి. చౌరాసీ కోసి పరిక్రమ యాత్రను అడ్డుకోవడమే కాక అక్రమ అరెస్టులు, సాధువులపై పోలీసుల దమనకాండ అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. అంతేకాదు, యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వి.హెచ్.పి. అగ్రనేత అశోక్ జీ సింఘాల్ ను లక్నో ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసింది యూపీ సర్కార్. ముందస్తు జాగ్రత్త పేరుతో ప్రవీణ్ తొగాడియా, మాజీ ఎంపి రామ్ విలాస్ వేదాంతిలను అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య, ఫైజాబాద్ జిల్లలలో భారీగా పోలీసులను మోహరించారు. అంతేకాదు, అయోధ్య పరిసర ప్రాంతాలలో దాదాపు 17 వందల మంది సాధువులను, వి.హెచ్.పి. కార్యకర్తలను అరెస్టు చేసి తాత్కాలిక జైళ్లకు తరలించారు. అటు పరిక్రమ యాత్ర జరిగే ఆరు జిల్లల్లోనూ 144వ సెక్షన్ విధించారు. ఇటు హిందూ సానుభూతిపరుల ఇళ్లను సోదాల పేరుతో భయభ్రాంతులకు గురి చేశారు.

మరోవైపు పోలీసులు ఇన్ని నిర్బంధాలు కొనసాగించినా రామజన్మభూమి న్యాస్ కమిటీ చైర్మన్ మహంత్ నృత్యగోపాల్ దాస్ పరిక్రమ యాత్రను అయోధ్యలోని మణిరాం చవానీ అఖాడా నుండి ప్రారంభించారు. అయితే యాత్ర కొద్దిదూరం వెళ్లిందో లేదో పోలీసులు దానిని అడ్డుకున్నారు. యాత్రను అడ్డుకోవడంపై మహంత్ గోపాల్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒకటి, రెండు రోజులు జరిగే యాత్ర కాదని, ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు.

పార్లమెంటును కుదిపేసిన పరిక్రమ యాత్ర

సాధువుల అరెస్టు అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోను బిజెపి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రను అడ్డుకోవడంపై మండిపడ్డారు. యూపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ సభ్యులతో సైతం సభలో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికైనా ముస్లిం ఓట్ బ్యాంకు రాజకీయాలకు సమాజ్ వాదీ పార్టీ స్వస్తి పలకాలని హితవు పలికారు.

దేశవ్యాప్తంగా నిరసనలు 

వి.హెచ్.పి. యాత్రను అడ్డుకోవడంపై ఆ మరుసటి రోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, లక్నోలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించి హిందూ యాత్రలపై యూపీ సర్కార్ తీరును ఎండగట్టారు. యూపీలో కుల సమీకరణలతో, రాజకీయ పార్టీల ఓటుబ్యాంకులుగా మారిన హిందువులలో మళ్లీ ఈ యాత్రతో తామంతా ఒక్కటేనన్న భావన కలిగింది. అందరిలో చైతన్యం నిండింది. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ ముస్లిం సంతుష్టీకరణ విధానం, ఆజంఖాన్, ముస్లిం ముల్లాల చేతిలో యూపీ సిఎం, ములాయం సింగ్ ఎలా కీలుబొమ్మలుగా మారారో మరోసారి బహిర్గతమయింది.  

- నారద