వినాయక చవితి పూజ ఆరోగ్యప్రదం

 
మనం జరుపుకొనే పండుగలలో ఆచరించే ఆచారాల్లో శాస్త్రీయత ఇమిడి ఉంటుంది. అటువంటి గొప్ప సంస్కృతికి మనం వారసులం. మాతృమూర్తిలా మన శుభం కోరే ప్రకృతిని దోచుకోవడం పాశ్చాత్యుల లక్షణం. అలా కాకుండా ప్రకృతిని పూజించటం మన హైందవ ధర్మంలోని గొప్పతనం. అటువంటి పూజలలో వినాయకచవితి పూజ ఒకటి.
 
వినాయక చవితి పర్వదినాన గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారు చేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు.
 
నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్ని చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి.
 
 
వినాయక చవితి పండుగ సందర్భంగా మనం 21 రకాల పత్రాలను పూజలో వాడుతాం. ఆ పత్రాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఔషధ గుణం ఉన్నది. వాటిని ఇక్కడ తెలుసుకుందాం.
 
 1. మాచీ పత్రం : దీనిద్వారా ఆస్తమా నియంత్రించబడుతుంది.
 2. నేల మునగ : అనేక వ్యాధులు రాకుండా వ్యాధినిరోధక శక్తిని ఇస్తుంది.
 3. మారేడు : కంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
 4. గరిక : చర్మరోగాలు మరియు అజీర్తిని నివారిస్తుంది.
 5. ఉమ్మెత్త : కీళ్ళ రోగాలను నయం చేస్తూ నరాలకు గట్టిదనాన్ని ఇస్తుంది.
 6. రేగు : వీర్యవృద్ధితో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది.
 7. ఉత్తరేణి : కడుపులో పురుగులను, నోటి దుర్వాసనను నివారిస్తుంది.
 8. తులసి : గొంతుకు సంబంధించిన వ్యాధులు, జలుబు, దగ్గు, చర్మరోగాలను పూర్తిగా నివారిస్తుంది.
 9. మామిడి : నోటి పూత, చిగుళ్లబాధ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 10. ఎర్రగన్నేరు : శిరోజాల రక్షణ చేసి, మెదడుకు చల్లదనాన్ని అందిస్తుంది.
 11. దానిమ్మ : రక్తశుద్ధి, రక్తవృద్ధి చేసి రక్తహీనతను నివారిస్తుంది.
 12. సన్నజాజి : తలనొప్పిని నివారిస్తుంది.
 13. రావి : కంటివ్యాధులు, అతిసారం లను నియంత్రిస్తుంది.
 14. జిల్లేడు : పక్షవాతం మరియు కుష్ఠు మొదలైన వ్యాధులను నివారిస్తుంది.
 15. దేవదారు : జ్ఞాపకశక్తి, జ్ఞానవృద్ధికి ఎంతో మేలు చేస్తుంది.
 16. మరుకం : శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తుంది.
 17. వావిలి : పంటినొప్పిని నివారిస్తుంది. బాలింత నొప్పులను తగ్గిస్తుంది.
 18. సీతాఫలం : వీర్యవృద్ధి, రక్తశుద్ధి చేస్తుంది. శరీరంలోని శక్తిని పెంచుతుంది.
 19. జమ్మి : చర్మవ్యాధులను నివారిస్తూ, శరీరానికి సౌష్టవాన్ని ఇస్తుంది.
 20. తెల్లమద్ది : గుండెకు బలాన్ని కలిగించి, శ్వాసవ్యాధులు రాకుండా చూస్తుంది.
 21. విష్ణుకాంతి : జ్ఞాపకశక్తిని పెంచగల ప్రపంచంలోనే ఏకైక మొక్క.
 
ఈ విధంగా మానవ శరీరంలో అనేక రకాల రుగ్మతలకు మూలమందులా పనిచేసే అనేక ఔషధ గుణాలు ఉన్న పత్రాలతో నవరాత్రులు గణనాధుని పూజించటం మన ప్రాచీన సంప్రదాయం. దీనివల్ల రాబోయే వర్షాకాలంలో వచ్చే అనేక రోగాల నుండి మన శరీరాన్ని కాపాడగల ఔషధాలను మనం పొందగలుగుతాం.
 
తిలక్ మహాశయుడు ఈ వినాయక నవరాత్రులను ఒక సామాజిక ఉత్సవంగా తీర్చిదిద్ది హిందూ సమాజంలో భక్తిని, శక్తిని, యుక్తిని నింపేందుకు ప్రయత్నించారు.
 
ప్రతి హిందువు తమ ఇంటిలో గణనాధుని పైన ఇచ్చిన 21 పత్రాలతో నవరాత్రుల పాటు పూజించి, ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, ఆ గణనాధుని ఆశీర్వాదాన్ని పొందగలరు. జై గణేశ్.
 
- అనంత ఆదిత్య