మేల్కొనండి ! గమ్యం చేరేవరకు ఆగకండి !!

పూజనీయ సర్ సంఘచాలక్ మాననీయ మోహన్ జీ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విజయదశమి రోజున ప్రారంభించబడింది. ప్రతి సంవత్సరం ఆ రోజున నాగపూర్ లో జరిగే విజయదశమి ఉత్సవములో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ ప్రసంగిస్తారు. ఈ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ విజయదశమినాడు ప్రస్తుత సర్ సంఘచాలక్ మాననీయ మోహన్ జీ భాగవత్ ప్రసంగించారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని బలహీనపరిచేందుకు జరుగుతున్న కుట్రలను భగ్నం చేసి హిందూ సమాజాన్ని శక్తివంతం చేయాలని, దేశానన్ని ప్రపంచంలో వికాసవంతమైన దేశంగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించుకోవటానికి బహుముఖమైన ప్రజాశక్తిని నిర్మాణం చేసుకోవాలని కూడా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు ఉత్సాహంగా నిర్వహించి తద్వారా వివేకానంద కలలను సాకారం చేసేందుకు మనందరం కృషి చేయాలని చెప్పారు. వారి ఉపన్యాసాన్ని లోకహితం పాఠకులకు అందిస్తున్నాము.

ఈ రోజు స్వర్గీయ సుదర్శన్ జీ వంటి మార్గదర్శకులు మన మనస్సులలో స్మరణకు వస్తూ ఉంటారు. విజయ యాత్రలో అలాంటి మహావీరుల స్మరణలే మనకు ప్రేరణ.

వేదికపై ప్రసంగిస్తున్న పూజ్య సర్ సంఘచాలక్ మా.మోహన్ జీ భాగవత్, ఆసీనులైన ఇతర పెద్దలు, సంఘ అధికారులు

విజయాలకు చిహ్నమైన విజయదశమి పండుగను ఈ రోజు ప్రజలు దేశమంతటా జరుపుకొంటున్నారు. దానవత్వంపై -మానవత్వం, చెడుపై - మంచి సాధించిన విజయాలను స్మరించుకొంటూ చేసుకునే పండుగ విజయదశమి. ఈ రోజున మనమందరం విజయ సంకల్పం చేసుకొని మన మనస్సులలో ఏర్పడే దుర్బల ఆలోచనల సీమలను ఉల్లంఘించి, విజయం వైపు అడుగులు వేయాలి. అదే సీమోల్లంఘన. ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న అనేక జటిల సమస్యల పరిష్కారానికి క్షమత, పరాక్రమం కలిగిన ప్రజాశక్తి యొక్క బహుముఖ ప్రయత్నాలు అవసరము.

అట్లా చేసేందుకు కావలసిన సామర్ధ్యం, పరాక్రమం మనకు ఉన్నాయని 65 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక సార్లు నిరూపించబడింది. వాణిజ్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు, క్రీడలు మొదలైన అన్ని రంగాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించబడిన మన సామర్ధ్యానికి అనేక ఉదాహరణలున్నాయి. శక్తి సామర్ధ్యాలు మనకు ఉన్నప్పటికీ ప్రస్తుత దేశ పరిస్థితుల కారణంగా ప్రజల మనస్సులలో భవిష్యత్తు గురించిన ఆందోళన, నిరాశ కనబడుతున్నది. గత సంవత్సరం దేశంలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ ఆందోళన పెరగటానికి దోహదం చేస్తున్నాయి. సరిహద్దులలోను, అంతర్గాతంగాను కూడా దేశ భద్రత ఆందోళనకరంగానే ఉంది. మన సాయుధ దళాలకు ఆధునికమైన ఆయుధ సామాగ్రిని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి. సరిహద్దులలోని మన సైన్యానికి సామాగ్రిని చేర వేసేందుకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి కమ్యూనికేషన్ వ్యవస్థలోని లోపాలను అధిగమించడానికి జాప్యం లేకుండా సమస్త ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది. అందుకు విరుద్ధంగా మన సైనిక సిబ్బందికి చెందిన చిన్న చిన్న విషయాలను మీడియాలో చర్చల ద్వారా వివాదాస్పదం చేసి వారి మనో స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఉత్సవ ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేస్తున్న పెద్దలు

దేశీయోత్పత్తుల ద్వారా జాతీయ భద్రతకు సంబంధిచిన అన్ని అంశాలలోను స్వయం సమృద్ధిని సాధించడం మన విధానంగా ఉండాలి. కాని ఆ విషయమై అంతగా ఆసక్తి కనబడడం లేదు. దేశ భద్రతా విధానం గురించి ఈ అనాసక్తిని, అసమర్ధతను, సమన్వయ లోపాన్ని తొలగించటానికి సత్వర చర్యలు చేపట్టాలి. దేశ సరిహద్దులకు, అందులో భాగమైన ద్వీపాలను సందేహానికి తావు లేని విధంగా రక్షణ ఏర్పాట్లు చేయటానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలి. 

రక్షణ విధానానికి సంబంధించిన విషయాలను ఈ దృష్టితో ఆలోచించాలి. మనదేశ సరిహద్దులు, అంతర్గత రక్షణకు సైనిక దళాలను  పటిష్టం చేయాలి. ఈ దిశలో మన ప్రభుత్వాధినేతలు కొన్నేళ్ళ క్రితం ("తూర్పుకి చూడు") Look East అనే విధానాన్ని ప్రకటించారు. మన దేశానికి ఆగ్నేయంగా ఉన దేశాలన్నీ తమ మౌలిక విలువలు, భారత జాతీయ జీవనపు మౌలిక విలువలు ఒకటేనని అంగీకరిస్తున్నాయి. సాంస్కృతికంగాను, వాణిజ్య పరంగాను మన దేశంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాయి. కనుక ఆ దేశాలతో స్నేహ సంబంధాలను, పరస్పర సహకారాన్ని నెలకొల్పుకోనేందుకు నిర్ణయించుకోవడం సముచితం.  కాని ఈ నిర్ణయం అమల్లో చాలా జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో చైనా మనకు పోటీగా సకల శక్తులతో రంగంలోకి దిగడం ఆందోళన కలిగించే విషయం. చైనా - పాకిస్తాన్ తో చెలిమి చేసి దానికి అణు పరిజ్ఞానాన్ని అందించిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు మన పొరుగు దేశాలైన నేపాల్, మయన్మార్, శ్రీలంకలతో వ్యూహాత్మక సంబంధాలను నెలకొల్పుకోవడంలో చైనా వేగంగా దూసుకుపోవడం వల్ల ఏర్పడే పరిణామాలు ఊహకు అందనివి కావు. అదీగాక ఈ అన్ని దేశాలలోను భారతీయ సంతతికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారి ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా కూడా సాంప్రదాయక మిత్ర దేశాలను మన పక్షాన నిలుపుకునే విధంగా మన విదేశాంగ విధానాలు మలచుకోవడం అత్యవసరం. 

కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా మన ప్రభుత్వపు ప్రోద్బలంతోనే జరిగిన కొన్ని సంఘటనలను గమనిస్తే అసలు మన ప్రభుత్వపు విధానాలు మన దేశపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించబడ్డవేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జమ్మూ-కాశ్మీర్ లో గత దశాబ్దంలో మన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా తీవ్రవాద కార్యకలాపాలు మళ్ళీ తలెత్తుతున్నాయి. 

పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ లోయ భూభాగాలను పూర్తిగా విముక్తి చెయ్యవలసి ఉంది. అభివృద్ధి విషయంలో జమ్మూ లడక్ ప్రాంతాలకు, కాశ్మీర్ లోయకు మధ్య వ్యత్యాసాలకు దారి తీస్తున్న పాలనాపరమైన వివక్షతకు తక్షణమే ముగింపు పలకాలి. దేశంలోని ఇతర  ప్రాంతాలతో సమానంగా ఈ ప్రాంతాలు కూడా ఎదగాలి. కాశ్మీరు లోయ నుంచి వెళ్లగొట్టబడిన హిందువులు సగౌరవంగా తమ స్వస్థలాలకు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడాలి. దేశ విభజన సమయంలో జమ్మూ-కాశ్మీర్ లో ఆశ్రయం పొందిన వారికి పౌరసత్వం ఇవ్వాలి. కాని అట్లా ఇవ్వకపోగా ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. కాశ్మీర్ రాష్ట్రంలోను, కేంద్రంలోనూ పెత్తనం చేస్తున్న ప్రభుత్వాలు అధికార వ్యామోహంతో జాతీయ ప్రయోజనాలను పెడచెవిని పెడుతున్నాయి. విదేశీ శక్తులకు లొంగిపోతున్నాయి. దేశపు తూర్పు ప్రాంతాలలో ఇప్పుడు కనబడుతున్న పరిస్థితులను చూస్తే చారిత్రిక కారణాల వల్ల ఉత్తర భారత ప్రాంతాలలో జాతీయ భావ ప్రేరితమైన హిందువుల సంఖ్య తరిగిపోవడం, తద్వారా ఏర్పడ్డ పరిస్థితుల నుంచి మనం  ఏ మాత్రం పాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది. బెంగాల్, అస్సాం సరిహద్దుల గుండా అక్రమంగా జరుగుతున్న చొరబాట్లు, ఆయుధాలు మాదక ద్రవ్యాల రవాణా గురించి చాలా సంవత్సరాలుగా మనం హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ ముప్పు గురించి మన గూఢచారి సంస్థలు, హైకోర్టులు, సుప్రీంకోర్టు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కాని అటువంటి హెచ్చరికలన్నింటినీ పెడచెవిన పెట్టి అధికార వ్యామోహంతో మన ప్రభుత్వాలు తప్పుడు విధానాలను పాటించడం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. ఈ కారణంగా ఈశాన్య భారతంలో ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అక్రమ చొరబాట్ల కారణంగా జనాభా నిష్పత్తులు మారిపోయి అక్కడి స్థానిక ప్రజలు అల్ప సంఖ్యాకులై పోతున్నారు. అంతే కాకుండా చొరబాటుదారులు ఈ రోజున దేశమంతా కనబడుతున్నారు. మత మార్పిడిల నీడలో అక్కడ రాజుకుంటున్న తీవ్రవాదానికి, వేర్పాటు వాదానికి ఆ ప్రభుత్వాలు తప్పుడు విధానాలు కొత్త ఊపిరులూదుతున్నాయి. 

మరోప్రక్క ఉత్తర సరిహద్దులలో చైనా విస్తరణ కొనసాగుతున్నది. ఈ పరిస్థితులను ఉపయోగించుకొని ప్రపంచంలోని అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మన ఆయుధ శక్తి, సైనిక శక్తి యొక్క సామర్ధ్యం, ఎటువంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తి ఉండటం, ఆత్మ స్థైర్యం మాత్రమే దేశ భద్రతకు హామీ ఇవ్వగలవు. ఆక్రమ చొరబాటుదార్లను గుర్తించి వారి పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలి. వాళ్ళ రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు రద్దు చేసి వాళ్ళను దేశం నుంచి బహిష్కరించే ఏర్పాట్లు జరగాలి. కోర్టుల ఆదేశాలకు అనుగుణంగా జాతీయ పౌరుల రిజిస్టరును తయారు చేయాలి. కాని ఇలా చెయ్యవలసి వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు, అధికారులు బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారులను వదలిపెట్టేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులను బాధలకు గురి చేస్తున్నారు. 

ఈ పరిస్థితులలో ఒక విషయాన్ని మన ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మాతృ భూమి, పితృభూమి, పుణ్యభూమి కేవలం భారత్ ఒక్కటే. మనవైన భూభాగాల్లో ఎక్కడెక్కడ హిందువులు అల్ప సంఖ్యాకులై, ప్రభావవంతంగా లేకపోతున్నారో అక్కడ ఆ భూభాగాల పేర్లు మార్చబడుతున్నాయి. కొన్ని భూభాగాలు ఇప్పటికే దేశం నుండి విడిపోయినాయి. ఆ భూభాగాలలోని హిందువులు అక్కడి వారిచే పీడింపబడి ఆ ప్రదేశాలు వదిలిపెట్ట వలసిన పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు వెళ్లేందుకు ప్రపంచంలో ఇంకొక దేశం లేదు. కాబట్టి ప్రపంచంలోని ఆయా దేశాలలో భద్రత లేని హిందువులు భారత్ కు తిరిగి వచ్చినట్లయితే వారిని విదేశీయులుగా భావించరాదు. సింధ్ ప్రాంతం నుండి, బంగ్లాదేశ్ నుండి ఆశ్రయం కోసం వచ్చిన హిందువులను ఆదరించాలి. వారికి మన స్నేహహస్తం అందించాలి. ఈ రకంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రజలకు, ఈ దేశ ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల రక్షణ బాధ్యత స్వీకరించేందుకు ఈ దేశ ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఈ క్రమంలో ఇక్కడ ఇంకొక విషయంలో కూడా మనకు స్పష్టమైన వైఖరి ఉండాలి. అక్రమ చొరబాటుదారులు తమ మతం వారనే కారణంతో ఈ దేశంలోని కొన్ని వర్గాల వాళ్ళు వాళ్లకు ఆశ్రయం ఇవ్వటం ఈ రోజున కూడా స్పష్టంగానే కనబడుతున్నది. ఇది ఎంతో  విచారించ తగిన అంశం. దేశ హితానికి భంగం కలిగించే రీతిలో సాగుతున్న మన పాలకుల ఇటువంటి విధానాల వల్ల నిర్మాణమవుతున్న దుష్ప్రభావం కారణంగా దేశద్రోహ శక్తులు బలపడుతున్నాయి. ప్రపంచంలోని సమస్త హిందువులకు తమది అని చెప్పుకోదగ్గ మాతృభూమి భారత దేశమొక్కటే అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కనుక ఎక్కడి నుంచి వచ్చిన హిందువునైనా అతన్ని శరణార్థిగానో, పరాయివాడుగానో భావించరాదు.  ప్రపంచంలో ఉన్న హిందువులందరి ప్రయోజనాలను కాపాడడం తన కర్తవ్యంగా మన ప్రభుత్వాలు భావించాలి.  

అక్రమ చొరబాటుదార్లు తమ మతం వారన్న కారణంతో ఈ దేశంలోని కొన్ని వర్గాల వాళ్ళు వారి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థిస్తున్నారు. చదువు కొరకో, ఉద్యోగాల కొరకో దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న ఈశాన్య భారత ప్రజలను కూడా వారి కొరకు బెదిరించిన సందర్భం ఈ మధ్య చూసాము. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో అమర్ జవాన్ జ్యోతిని సైతం అపవిత్రం చేసిన సంఘటన ఈ దేశంలో జాతి వ్యతిరేకుల ఉనికిని తెలియచేస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల కారణంగా అటువంటి దుష్టశక్తులు చెలరేగి శాంతి భద్రతల సమస్యను సృష్టించే స్థాయికి రావడం సిగ్గుచేటైన విషయం.  

దేశ ప్రజలలో జాతీయ భావనను పెంపొందించడం అటుంచి ఓట్ల కక్కుర్తితో మతతత్వం పైన, వేర్పాటువాదం పైన సానుభూతితో హిందూ సమాజాన్ని అవమానపరచి బలహీన పరచటానికి మరింత అధికంగా మోసపూరితమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన గౌరవనీయులైన ధర్మాచార్యులను అపఖ్యాతిపాలు చేయటానికి, వారిపై అపనిందలను మోపి ప్రచారం చేస్తున్నారు. వనవాసులకు సేవలందిస్తున్న స్వామి లక్ష్మణానందను ముందస్తు పథకంతో హత్య చేసారు. అసలు హంతకులు ఈ రోజుకి కూడా నిర్బంధింపబడలేదు. హిందూ దేవాలయాల ఆస్తులను, నిధులను దుర్వినియోగం చేయడం కొనసాగుతూనే ఉంది. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వంటి ఆలయాల నిధుల విషయంలో వివాదాలు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రసారాలు సాగుతున్నాయి. హిందూ సమాజాన్ని అపఖ్యాతి పరచి అవమానకరమైన చట్టాలను తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రజాస్వామ్యం గురించి సెక్యులరిజం గురించి, రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పుకునే వారే మత ప్రేరిత రిజర్వేషన్లు ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్పసంఖ్యాక మతస్తులకు ఈ దేశపు సంపదపై మొదటి హక్కు ఉందన్న వాదాన్ని కూడా వినిపిస్తున్నారు. లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడి కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఈ విధంగా అన్ని వైపుల నుండి హిందూ సమాజంపై దాడి చెయ్యడానికి రాజకీయ సమీకరణలు సాగుతున్నాయి. జాతీయ విలువలను పాటిస్తూ ఈ దేశంలో నివసిస్తున్న హిందూ సమాజానికి సహజంగానే ఇక్కడి నాయకత్వం తమకు ప్రాతినిథ్యం వహించి తమ ప్రయోజనాల గురించి, ఆకాంక్షల గురించి శ్రద్ధ వహిస్తోందా? అన్న అనుమానం కలుగుతోంది. రామజన్మ భూమి ప్రక్కన ముస్లింలకు పెద్ద కట్టడం నిర్మించటం కొరకై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణకు ప్రయత్నం చేస్తున్నట్లుగా, దానికయ్యే ఖర్చును ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

రామజన్మభూమి ఆలయ వ్యవహారం న్యాయస్థానం ముందు ఉన్నది. ఈ స్థితిలో అటువంటి బాధ్యతారహితమైన పని సరికాదు. అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబరు 30న ఇచ్చిన తీర్పును అనుసరించి ఆ స్థలంలో భవ్యమైన రామమందిర నిర్మాణానికి పార్లమెంటులో చట్టం చేసి, ఆ స్థలాన్ని రామజన్మభూమిన్యాస్ కు ఇవ్వాలి. ముస్లింల కోసం నిర్మించబడే ఏ కట్టడమైనా అయోధ్య సాంస్కృతిక సరిహద్దుల అవతలే ఉండాలి. సామరస్య పూర్వకంగా వివాద పరిష్కారానికి ఇదే ఏకైక ఉపాయం.  దేశంలో ఈ రోజున అటువంటి వాతావరణం నిర్మాణం చేయటానికి ప్రయత్నం చేయటం లేదు. పైగా దేశ ప్రజలలో ఉన్న సామరస్య వాతావరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహారాలు సాగుతున్నాయి. 

రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను పెద్ద స్థాయిలో అనుమతించడం వల్ల కలుగుతున్న అనుభవాలు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రోత్సాహకరంగా లేవు. కనుక రిటైల్ రంగంలో, ఇన్సూరెన్సు రంగంలో, పెన్షన్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రవేశ పెట్టడం వల్ల ఏ లాభం కలుగకపోగా స్థానికులైన చిన్న వ్యాపారులకు హాని, వ్యవసాయ దారులకు తక్కువ ధరలు, వినియోగ దారులకు ధరల పెరుగుదల ఏర్పడుతుంది.

ఘోష్ ప్రదర్శన నిర్వహిస్తున్న స్వయంసేవకులు

మరో వైపున అభివృద్ధి పేరుతో జాతీయ వనరుల దోపిడీ, జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చెయ్యడం జరిగిపోతున్నది. సమాజంలో సంపద కొందరి చేతుల్లోనే ఎక్కువగా ఉంటున్నది. దానిని ఆర్ధిక వృద్ధిగా పరిగణనలోకి తీసుకొని మన మేధావులు దేశం శీఘ్రగతిన అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు భ్రమలు కలిగిస్తున్నారు. ఆ అభివృద్ధి కూడా 5 శాతం నుంచి 9 శాతం లోపే ఉంది. దేశమంతా ధరల పెరుగుదలతో వణికిపోతుంది. ఇటువంటి దిక్కుమాలిన చట్టాలను ఎవరితోనూ సంప్రదించకుండా అనాలోచితంగా ఎందుకు ప్రవేశ పెడుతున్నారో దేవుడికే తెలియాలి. ఇటువంటి చెత్త సంస్కరణలు కాక మనకు నిజమైన సంస్కరణలు కావాలి. ఎన్నికల వ్యవస్థలోను, పన్నుల విధానంలోనూ, అంతర్గత ఆడిటింగ్ లోనూ, నేరచట్టంలోను కావలసిన మంచి చట్టాల కొరకు చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నారు లేదా అణగ ద్రొక్కుతున్నారు. 

ప్రస్తుత ప్రపంచంలో అనుసరించబడుతున్న అభివృద్ధి ప్రణాళిక, దాని దిశ ఆలోచనా రాహిత్యంతో కూడుకొని ఉన్నాయి. ఇది సంపన్న బహుళ జాతి సంస్థల ఉద్దేశాలకు, ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయబడుతున్నాయి. మనం మన ఆర్ధిక ప్రణాళికను సమగ్రమైన సత్ఫలదాయకమైన అభివృద్ధిని పొందలేము. మనకు దిగ్భ్రాంతిని కలిగించే అవినీతి వ్యవహారాలు ఒకదాని వెనుక ఇంకొకటి వెల్లడి అవుతూనే ఉన్నాయి. అవినీతిని అంతం చేయాలని నల్లదనాన్ని వెనుకకు తీసుకు రావాలని కోరుతూ  చిన్న పెద్ద ఉద్యమాలు చాలా జరిగాయి. చాలామంది స్వయంసేవకులు కూడా వాటిల్లో పాల్గొన్నారు. అదే సమయంలో శీల రాహిత్యం వల్ల అవినీతి వృద్ధి చెందుతోంది. ప్రారంభం నుండి సంఘం వ్యక్తులలో శీల ర్మాణానికి తనవంతు కృషి కొనసాగుతూనే ఉంది. ప్రజల నిరాశకు, అసహనానికి చోటివ్వకుండా వ్యవస్థను మార్చే అవసరాన్ని గుర్తించాలి. లేకపోతే మధ్యపూర్వ దేశాలలో (అరబ్బు దేశాలు) తలెత్తిన పరిణామాలు ఇక్కడా తలెత్తే అవకాశం ఉంది. ఆక్కడి పరిస్థితులను మతతత్వ వాదులు, విదేశీ శక్తులు తమ స్వార్ధానికి వినియోగించు కొంటున్నారు. రాజకీయేతరమైన, చట్టబద్ధమైన విస్తృతమైన సామాజిక ఒత్తిడే అవినీతి అంతం కావడానికి ఏకైక మార్గం. అందుకే విద్యా వ్యవస్తలోను, పాలనా వ్యవస్థలోను, ఎన్నికల వ్యవస్థలోను పెద్ద ఎత్తున సంస్కరణలు జరగాలి. విస్తృతమైన చర్చల ద్వారా, ప్రజాభిప్రాయం ద్వారా మన వ్యవస్థలో రావలసిన స్పష్టమైన, మోలికమైన, దీర్ఘకాలికమైన మార్పుల గురించి మనం ఆలోచించాలి.

సామాజిక జీవితంలో వినాశకరమైన విధానాలను గుడ్డిగా అనుసరించడం వల్ల ఏర్పడ్డ విషఫలితాలు ఇప్పుడు మనకు కళ్ళముందు కనిపిస్తున్నాయి. కుల వైషమ్యాలు, వెనుకబడిన వర్గాల అణచివేత స్త్రీలపై వేధింపులు, మానభంగాలు, స్త్రీ భ్రూణహత్యలు, ఆత్మహత్యలు, కుటుంబాల విచ్ఛిన్నత, ఒంటరితనంతో కుంగుబాట్లు ఇప్పుడు అధికమయ్యాయి. వీటిని సరిచేసే బాధ్యతను మనం రాజకీయాలకు, ప్రభుత్వాలకు వదలివేసి కూర్చుంటే కుదరదు. మన ఇళ్ళ నుంచి సమాజం వరకు అన్ని స్థాయిలలో మనం స్వచ్ఛతకు, చట్టబద్ధతకు, క్రమశిక్షణకు, నిజాయితీకి నిదర్శనాలుగా కనబడవలసిన అవసరం ఉంది. ప్రతి సంస్కరణ మన జీవన దృక్పథం నుంచే ఆరంభమౌతుంది. కేవలం ఉద్యమాల వల్ల ఏమీ జరుగదు. 1922 సంవత్సరంలో వచ్చిన ఒక యంగ్ ఇండియా సంచికలో గాంధీజీ ఆరు సామాజిక పాపాలను పేర్కొన్నారు. అవి, 1. నీతి నియమాలు లేని రాజకీయం, 2. శ్రమ లేని జీవితం, 3. అంతరాత్మ శుద్ధిలేని సుఖభోగాలు, 4. శీల రహితమైన విజ్ఞానం, 5. మానవత్వం లేని వాణిజ్యం, 6. త్యాగం లేని ఆరాధన. ఇది మన ఈనాటి సమాజ పరిస్థితి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు సమాజంలోని సద్గుణ శక్తులు పనిచేస్తూ తమతో పాటు సమాజాన్ని నడిపించాలి. 

ఉత్సవంలో పాల్గొని ప్రసంగాన్ని శ్రద్ధగా వింటున్న స్వయంసేవకులు

భారత జీతీయ పునర్జీవనానికి పథ నిర్దేశం చేసిన మహనీయులలో స్వామి వివేకానంద ప్రముఖులు. రాబోయే రోజుల్లో ఆయన 150వ జన్మదిన వేడుకలు ఆరంభం కానున్నాయి. ఆయన సందేశాన్ని ఆచరణలోకి తేవడం మన బాధ్యత. నిర్భీతితో, ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో, శీల స్వచ్ఛతతో, మన ధార్మిక భారతాన్ని జాగృతం చేయాలి. ఈ సుగుణాలను కలిగిన వ్యక్తులను నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం పని. మీరందరూ ఈ పనిలో చురుకుగా పాల్గొనాలి. మన నిరంతర తపస్సుకు, కృషికి ఆకర్షితమైన సమాజం మనతో కలిసి వస్తుంది. అప్పుడు అడ్డంకులను దాటుకొని సాగరాన్ని చేరే గంగా నది వలె మన జాతి వైభవ గమ్యానికి చెరువౌతుంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి చేరుకొంటాయి. వివేకానందుడు చెప్పినట్లుగా మనం మేల్కొందాం, గమ్యం చేరే వరకు ఆగవద్దు. ఉత్తిష్టత! జాగ్రత!!, ప్రాప్యవరాన్నిబోధత!!!

భారత్ మాతాకీ జై