వంట గ్యాస్, కిరోసిన్ ధర ఇక పెరగదు

 • గృహిణులకు శుభవార్త
 • చైనా సరిహద్దు పొడవునా రాడార్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ
 • ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం
 • తొలి రెండు నెలల్లో కేంద్రప్రభుత్వం తీసుకొన్న సాహస నిర్ణయాలు
 
వంట గ్యాస్ సిలిండర్
 
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన గత 60 రోజుల నుండి భూటాన్ పర్యటనలో మినహా ఎక్కడా ప్రచార సాధనాలలో కనపడకుండా నిశ్శబ్ద విప్లవంలా తన పరిపాలనా దక్షతను చాటుతున్నారు. నిర్ణయాలపై గాని, ప్రభుత్వ పథకాలపై గాని ఎక్కడా హంగూ, ఆర్భాటం లేకుండా తన పరిపాలనా ముద్రను నిశ్శబ్దంగా అమలు పరుస్తున్నారు.

ఎన్.డి.ఎ. ప్రభుత్వ అధికారం చేపట్టి 60 రోజులైన సందర్భంగా రక్షణ, విదేశాంగ విధానాలకు మౌలిక వసతులు, ఆర్థిక చేయూతల విషయమై పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కీలక నిర్ణయాలు ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకపోవడం గమనార్హం. అటువంటి పలు నిర్ణయాలను లోకహితం పాఠకులకు అందిస్తున్నది.
 
చైనా - భారత్ సరిహద్దు

 • చైనా-భారత సరిహద్దుల వెంట ఫాస్ట్ ట్రాక్ రహదారుల నిర్మాణం, వ్యూహాత్మక స్థానాలలో అదనంగా మరో 50 సైనిక పోస్టుల ఏర్పాటు.
 • 4100 కి.మీ. గల భారత-చైనా సరిహద్దు వెంబడి ప్రతి 100 కి.మీ. ఒక రాడార్ వ్యవస్థ, ఒక టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు జరిగింది.

2012 నుండి చైనా సైన్యం, రాజకీయ నాయకులు అరుణాచల్ ప్రదేశ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినప్పటికి గత యు.పి.ఎ. ప్రభుత్వ ఎటువంటి ప్రతిఘటన చర్యను తీసుకోలేకపోయింది. ప్రస్తుత ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకున్న పై మూడు నిర్ణయాలు రక్షణ రంగంలోని సైనికులలో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే కాక, అరుణాచల్ ప్రదేశ్ పై చైనాకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది. ఇది గత దశాబ్ద కాలంగా యావత్ భారత ప్రజలు ఎదురుచూస్తోన్న సాహసోపేత చర్య.

ఎన్.డి.ఎ. ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని సాహసోపేత చర్యలు :
 
భారత ప్రధాని నరేంద్రమోది

 • అండమాన్-నికోబార్ దీవులలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతి. ఇది హిందూ మహాసముద్రంలో భారతదేశానికి రక్షణపరంగా వ్యూహాత్మక స్థావరం.
 • వంటగ్యాస్, కిరోసిన్ ధరలను ఇక పెంచరాదని నిర్ణయం. అలాగే సంవత్సరానికి ఇచ్చే 12 సిలిండర్లలో ఎలాంటి మార్పు లేదు. ఇది సగటు భారతీయ గృహిణులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
 • ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ ఆసుపత్రులలో సమానంగా ఎక్స్ర్-రే, ఎం.ఆర్.వై., సి.టి.స్కాన్, వంటి వ్యాధి నిర్ణారణ పరీక్షల యంత్రాల సదుపాయం. దీనిద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి, మధ్య తరగతి వారికి నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.
 • మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి కల్పనా (MG-NREGS) హామీ పథకం క్రింద ఒక లక్ష కి.మీ. పొడవు గల జాతీయ రహదారుల వెంట 200 కోట్ల మొక్కలు నాటడం, వాటిని పెంచడం. ఈ ఉపాధి పథకాన్ని గ్రామీణ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి నిర్ణయం.
 • దీనివల్ల గ్రామాలలో 30 లక్షలమంది నిరుద్యోగులకు పనికల్పన-ఉపాధి, రాగల 10 సంవత్సరాలలో రహదారుల వెంట చెట్ల పెంపకం వల్ల పర్యావరణంలో గుణాత్మక మార్పు ప్రారంభమై సకాలానికి వర్షాలు పడటం జరుగుతుంది. తద్వారా పంటలు చక్కగా పండి, గ్రామాలు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది.
 • గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయ పనులకు కూలీల కొరత తగ్గి, రైతుకు ధర గిట్టుబాటు అవుతుంది.
 • రాజకీయ నాయకుల, అధికారుల విదేశీ ప్రయాణాలపై నిషేధం. కేవలం శాస్త్రవేత్తలు, శాస్త్ర సాంకేతిక నిపుణులకు మాత్రమే విదేశాలలో జరుగుతున్న సదస్సులకు హాజరయ్యేందుకు అనుమతి. దీనితో గత 60 ఏళ్ళుగా ప్రభుత్వ సొమ్ముతో విదేశీ యాత్రల పేరుతో జరిగిన వృథా ఖర్చులకు కళ్ళెం పడుతుంది.

ఇవి నిజంగా సాహసోపేత నిర్ణయాలే. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వం తీసుకోవాలి అని అనుకున్నవే. కాని ఏ ప్రభుత్వమూ ఇంతటి సామసం చేయలేకపోయింది. అటువంటి కఠిన నిర్ణయాలు నరేంద్రమోది ప్రభుత్వం కేవలం రెండు నెలల వ్యవధిలో తీసుకొని పూర్తి ఆదేశాలు జారీ చేయగలిగింది. సెభాష్ మోదీ...

- పతికి