ఎట్టకేలకు నోరు విప్పిన ప్రధాని డా.మన్మోహన్ సింగ్


2014 జనవరి 3వ తేదీనాడు 11 గంటలకు మనదేశ ప్రధాని ఢిల్లీలో పత్రికా విలేకరుల (ప్రెస్ మీట్) సమావేశంలో ప్రసంగించారు. దేశంలో రెండుసార్లు దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న జాబితాలో డా.మన్మోహన్ సింగ్ చేరుతారు. అట్లాగే ప్రజల చేత ఎన్నుకోబడని, ఏ ఎన్నికలలో పోటీ చేయని ప్రధానిగా కూడా మన్మోహన్ సింగ్ కు గుర్తింపు ఉన్నది. ఒక గొప్ప ఆర్థిక మంత్రిగా ఒకప్పుడు పేరు తెచ్చుకొన్న మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశ ఆర్థిక సంకటస్థితిని కూడా చూసారు. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాని వ్యవస్థలో ఏమీ చేయలేని విస్పష్టస్థితి. యూపిఎ ప్రభుత్వ పాలనలో రాజీవ్ గాంధీ సమయంలో బోఫోర్స్ కుంభకోణాలను మించిన కుంభకోణాలు వెలుగుచూసాయి. అవినీతి విశృంఖలంగా వ్యాపించింది. ఈ పరిస్థితులలో తనకు తాను మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్నా అవినీతి కుంభకోణాల కారణంగా ఏమీ చేయలేని సంకట స్థితిలో నిస్సహాయంగా నోరు మెదపలేని ప్రధానిగా కూడా గుర్తింపు పొందారు. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశ్యం బహుశా రాహుల్ గాంధీకి మార్గం సుగమం చేయడం కావచ్చు. పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా కూడా నిర్ణయించి కాంగ్రెసు రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేయటం కోసం కావచ్చు. ఒక మంచి వ్యక్తి, వ్యవస్థను అదుపు చేసే అవకాశం లేని వ్యక్తి ఏమి చేయగలుగుతాడో అది మన్మోహన్ సింగ్ చేసారు. దేశానికి ఏమి మేలు జరిగింది, దానిని తులనాత్మకంగా ఇప్పుడే చెప్పలేము. ఆ చర్చకు ఇది సందర్భం కాదు. మొత్తానికి మన ప్రధానిగారు నోరు విప్పి మాట్లాడారు.

- రాము