కేజ్రీవాల్ అవతార పురుషుడా...!కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, 

  ఫాల్గుణ మాసం
 
ఆమ్-ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ రాజకీయాలకు కొత్త. రాజ్యాంగం మీద భక్తి కూడా తక్కువే. ఉద్యమాలంటే ఆయనకు క్రేజ్ (ఇష్టం) ఎక్కువే. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన ఢిల్లీ పోలీసుల వైఖరికి నిరసనగా 33 గంటల పాటు దీక్ష చేశాడు. 
అన్నా హజారేతో కలిసి నిర్మించిన అవినీతి వ్యతిరేకోద్యమాన్ని, నిర్భయ ఘటన సమయంలో వచ్చిన మహిళా సంఘటనోద్యమ బలాన్ని తనకనుకూలంగా మార్చుకున్నాడు కేజ్రీవాల్. పాలించమని ఢిల్లీ పీఠం మీద కూర్చోబెడితే ప్రతిఘటించడమే ఆయన తన ఎజెండాగా పెట్టుకున్నాడు. పోలీసులను, మీడియాను, ఇతర రాజకీయపార్టీ నేతలను, పారిశ్రామిక వేత్తలను, పాలనాయంత్రాంగాన్ని - ఇలా అందరినీ వ్యతిరేకించడమే ఆయన పద్ధతి. అధికార కాంగ్రెసు చేవచచ్చి చేష్టలుడిగి కూర్చున్న సమయంలో తమ ఉద్యమాన్ని 'అద్దె' కిచ్చింది. 
కానీ కేజ్రీవాల్ జన సామాన్యాన్ని జబర్దస్తీ స్వామ్యంగా మార్చాలనుకున్నాడు. మొదటిసారిగా ప్రభుత్వాన్నేర్పరచిన కేజ్రీవాల్ నిదానంగా సంయమనంతో తమ పార్టీ స్థిరపడేందుకు ప్రయత్నించాల్సింది పోయి, పోలీసులతో, అధికార యంత్రాంగంతో సహకరించుకునే ధోరణి కనబరచాల్సిందిపోయి, సంచలనాలు సృష్టించాలనుకోవడమే ఆయన్ను 'క్రేజీబాయ్' చేస్తోంది. సమస్యల పరిష్కారం రాత్రికి రాత్రి చేసేయాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. ఐ.ఆర్.ఎస్. చదివిన కేజ్రీవాల్ కు ఆ మాత్రం విషయాలు తెలియవనుకోవాలా? 
లోక్ సభ ఎన్నికలకు పరుగెత్తుతున్న కేజ్రీవాల్ 'గెలుపు'ని నిలుపుకునేలా లేడు. మావోయిస్టు భావాలతో ప్రేరితుడైన కేజ్రీవాల్ భారత్ లో బ్రతికి బట్టకట్టాలంటే వ్యతిరేకాత్మక ధోరణి వీడాలి. వ్యవస్థలను, వ్యక్తులను, సంస్థలను గౌరవించడం నేర్చుకోవాలి. తాను మాత్రమే అవతార పురుషుడనని, మిగిలిన వాళ్లంతా రాక్షసులని భావించడం మానుకోవాలి. తన 'భారతమాతాకీ జయ్' నినాదం వెనుక వివాదాలు లేకుండా చూసుకోవాలి.