అభ్యర్థికి కాదు, పార్టీని చూసి ఓటెయ్యండి

ఎన్నికల వేళ - 2014 - భాగం 3
 

గత సంచికల్లో మనం ఓటుహక్కు వినియోగం, నమోదు, ప్రచారంలో ప్రభుత్వాల, రాజకీయ పక్షాల, ప్రచార-ప్రసార మాద్యమాల బాధ్యతలను, గత ఎన్నికలలోని గణాంక వివరాలను చర్చించాము. కాగా ఈ సంచికలో ఓటు హక్కు వినియోగంలో వ్యక్తి బాధ్యతలను పరిశీలిద్దాం.

ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా సందర్భాలలో వారి వారి హక్కులకై పోరాడుతారు, వారి హక్కుల గురించే ఎక్కువగా మాట్లాడుతారు. కాని రాజ్యాంగపరంగా వారు నిర్వర్తించవలసిన విధులు, బాధ్యతలను విస్మరిస్తారు. రాజ్యాంగపరంగా వ్యక్తి నిర్వహించవలసిన బాధ్యతలలో అతి ముఖ్యమైనది రాజ్యాంగం తనకిచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవటం. ఓటుహక్కును వినియోగించడం ఒక ఎత్తు అయితే దానిని సక్రమంగా విచక్షణతో సమాజహితాన్ని, దేశహితాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక ప్రలోభాలకు లోనుకాకుండా స్వతంత్రంగా ఓటుహక్కును వినియోగించుకోవడం రెండవ ఎత్తు.

సాధారణంగా ఎన్నికల ముందు రాజకీయ పక్షాలు రకరకాల వరాలు ప్రకటిస్తూ మానిఫెస్టోల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా నిరక్షరాస్యతను, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఓటర్లకు మద్యాన్ని, డబ్బులను ఇతర తాయిలాలను పంచిపెడుతూ తాత్కాలిక ప్రలోభాలకు గురిచేసి, ఓటుహక్కు యొక్క నిర్దేశిత లక్ష్యాలను విఫలం చేస్తున్నారు.

సమాజంలో ఓటు వినియోగంపై దిగువ తరగతి లేదా నిరక్షరాస్యుల దృక్పథం ఇలా ఉండగా, మధ్యతరగతి ప్రజలు ఇంకోలా నిర్లక్ష్యం చేస్తున్నారు. భారతదేశంలో మధ్యతరగతి వారు తమ కుటుంబ నిర్వహణకు, కుటుంబ సభ్యుల ఉన్నతికి అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. కాని సమాజం పట్ల తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే మనదేశంలో అవినీతి వంటి అనేక జాడ్యాలకు మూలకారణమౌతున్నది. ఉదాహరణకు ఓటు హక్కు వినియోగానికి వస్తే మధ్యతరగతి వ్యక్తులు ప్రతిరోజు కనీసం అరగంట సేపు దినపత్రికను చదువుతారు. అందులోని ప్రభుత్వ నిర్ణయాల గురించి, ప్రభుత్వ పథకాల గురించి, రాజకీయ పక్షాల అక్రమాల గురించి, రాజకీయ నాయకులు అక్రమాల గురించి చదివి, వారిని నిందిస్తూ ఉంటారు. ప్రతీరోజు టి.వి. ఛానెళ్లలో వార్తలను, విశ్లేషణలను గమనిస్తారు. ఈ అంశాలపై కుటుంబ సభ్యులతోనూ, పని స్థలాల్లో తోటి సిబ్బందితో చర్చిస్తారు. అలాగే వివాహాలు వంటి సందర్భాలలో అనేక సందర్భాలలో బంధుమిత్రులు కలిసే చోట్ల ఈ విషయాలే ముచ్చటిస్తూ గంటల తరబడి కాలయాపన చేస్తారు. కాని ఎన్నికల ముందు వారి ఓటుహక్కును, వారి కుటుంబ సభ్యుల ఓటు హక్కును నమోదు చేసుకోవడంలో ఆ ఉత్సాహం చూపించరు. పైగా 'ఆ... మనం ఒక్కరం ఓటు వేయనంత మాత్రాన దేశానికి వచ్చే నష్టమేమీ లేదు' అని నిట్టూర్పు విడుస్తారు. అంతేకాకుండా ఎన్నికల రోజును సెలవు దినంగా ప్రకటించినా, సెలవు రోజును వినోదానికో, ఇతర పనులకో వినియోగించి, ఓటు వేయడానికి బద్ధకించి ఓటు వెయ్యకుండా మానేసిన ప్రబుద్ధులనూ చూస్తున్నాం. ఇదీ ప్రస్తుత భారతదేశంలో మధ్యతరగతి ప్రజల స్పందన.

కనుక, ఎన్నికలను అత్యధికంగా ప్రభావితం చేయగలిగిన మధ్యతరగతి, దిగువ తరగతి ఆదాయ వర్గాల వారు రాజ్యాంగం నిర్దేశించిన వ్యక్తి బాధ్యతలను గుర్తించి, అభ్యర్థులిచ్చే తాత్కాలిక ప్రలోభాలకు లోనుకాకుండా, విచక్షణతో, జాతీయ భావాలు కలిగి, సమాజానికి, దేశానికి హితం చేకూర్చే విధానాలకు మద్దతు తెలిపే రాజకీయ పక్షాలకు ఓటు వెయ్యాలి. తాను ఒక్కడుగా ఓటు వేయడమే కాక, తన కుటుంబ సభ్యులు, పని ప్రదేశంలో సహఉద్యోగులు, బంధుమిత్రులను ఓటు నమోదు కార్యక్రమంలో చైతన్యపరచి, ఓటు హక్కును వినియోగించుకొనేలా చైతన్యపరచడం ప్రతి పౌరుని విధి.

ఓటు వేసేటప్పుడు విచక్షణ పాటించాలి. ఉదాహరణకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి వ్యక్తిగా మంచి అభ్యర్థే కావచ్చు, కానీ, ఆ అభ్యర్థి ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ద్వారా బలపరచబడి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు, ఆ రాజకీయ పక్ష సిద్ధాంతాలకు, మానిఫెస్టోలకు కట్టుబడి పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థి ఎన్నికల తరువాత స్వతంత్రంగా వ్యవహరించలేడు. కనుక ఓటర్లు జాతీయ భావాలు, సిద్ధాంత నిబద్ధత కలిగిన రాజకీయ పక్షాల అభ్యర్థులను గెలిపించినట్లయితే తద్వారా ఏర్పడే కేంద్రప్రభుత్వం ద్వారా దేశంలో మనం ఆశించిన మార్పులను ఆస్వాదించగలం.

ఓటు హక్కును వినియోగించుకోండి!
ఓటు హక్కుపై ఇతరులను చైతన్యపరచండి!
 

- పతికి