వృత్తి ద్వారా సామాజిక బాధ్యతను స్వీకరించి పని చేస్తున్న పాత్రికేయులు

నారద జయంతి ఉత్సవంలో వక్తల అభిభాషణ 

నారద జయంతి సభలో సన్మానం అందుకుంటున్న శ్రీ వి.ఎస్.ఆర్.శాస్త్రి

భారతీయుడు భారతీయుడుగా జీవించేందుకు, భారతీయ విలువలను కాపాడేందుకు రచనా వ్యాసంగం ద్వారా తనవంతు కృషిని తాను చేస్తున్నానని శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు సమాచార భారతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నారద జయంతి ఉత్సవంలో ప్రసంగిస్తూ చెప్పారు. పాత్రికేయులు నైపుణ్యతను పెంచుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాలని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ ఎ.కిస్మత్ కుమార్ పిలుపునిచ్చారు. తమ వృత్తి ద్వారా సామాజిక బాధ్యతను స్వీకరించి పాత్రికేయులు పని చేస్తున్నారని శ్రీ వి.ఎస్.ఆర్. శాస్త్రి తమ ప్రసంగంలో పాత్రికేయులను కొనియాడారు.

జ్యోతి ప్రజ్వలన చేసి నారద జయంతి సభను ప్రారంభిస్తున్న శ్రీ ఎ.కిస్మత్ కుమార్

జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు భాగ్యనగర్ నారాయణగూడలోని జాగృతి భవన్ లో సమాచార భారతి ఆధ్వర్యంలో, శ్రీ టి.హరిహరశర్మ అధ్యక్షతన నారద జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ప్రపంచంలోనే మొట్టమొదటి పాత్రికేయుడైన నారద మహర్షి యొక్క జయంతి (వైశాఖ బహుళ విదియ) ని పురస్కరించుకుని ఆ రోజున ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా భావించి గడచిన కొద్ది సంవత్సరాలుగా సమాచార భారతి నారద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఆ రోజున పాత్రికేయులను గౌరవించి, వారికి అవార్డులనిచ్చి, సన్మానంతో ఘనంగా సత్కరిస్తున్నది.

అలాగే ఈ సంవత్సరం నారద జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి ఆధ్వర్యంలో జూన్ 1, 2013వ తేదీన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సమాచార భారతి అధ్యక్షులు శ్రీ టి.హరిహరశర్మ అధ్యక్షత వహించగా, శ్రీ ఎ.కిస్మత్ కుమార్ (వీథి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు, అంధ్రప్రదేశ్ ప్రభుత్వము) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులను సన్మానించి, అవార్డుతో సత్కరించడం జరిగింది.

శ్రీ వి.ఎస్.ఆర్.శాస్త్రి (ఎన్.టి.వి.-భక్తి టివి గ్రూప్), శ్రీ టి.హెబ్బార్ నాగేశ్వరరావు (సీనియర్ పాత్రికేయులు) లకు స్వర్గీయ శ్రీ భండారు సదాశివరావు పురస్కారం, శ్రీ ఆకారపు మల్లేశం (ఈనాడు దినపత్రికలో ఛీఫ్ రిపోర్టర్), శ్రీ మెండు శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి దినపత్రికలో డెప్యూటీ ఛీఫ్ రిపోర్టర్) లకు స్వర్గీయ శ్రీ వడ్లమూడి రామ్ మోహన్ రావు పురస్కారమిచ్చి, ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది.

వందేమాతర గీతాలాపన

వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రథమంగా ఇటీవల పరమపదించిన ప్రముఖ సామాజిక కార్యకర్త, వనవాసీ క్షేత్రంలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన శ్రీ దీవి ద్వారకాచార్యులు, రెండు దశాబ్దాలుగా పాత్రికేయుడుగా పని చేస్తూ ఆకస్మికంగా మరణించిన శ్రీ కొమర్రాజు రమణల ఆత్మశాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించడమైనది.

అధ్యక్షోపన్యాసం - శ్రీ టి.హరిహర శర్మ, సమాచార భారతి అధ్యక్షులు

అధ్యక్షోపన్యాసం

సమాచార భారతి అధ్యక్షులు, కార్యక్రమ అధ్యక్షులైన శ్రీ టి.హరిహరశర్మ అధ్యక్షోపన్యాసం చేస్తూ -"సమాచార భారతి గడచిన కొద్ది సంవత్సరాలుగా పత్రికల వారితో సత్సంబంధాలను నిర్వహిస్తున్నది. అలాగే జర్నలిజానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. చిన్న పత్రికలకు నెలకు ఒకసారి న్యూస్ బులెటిన్ ను పంపుతున్నది. గ్రామాలలోని ప్రజలలో జాతీయ భావాలను నింపేందుకు, అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన కలిగించేందుకు 'లోకహితం' అనే మాసపత్రికను నడుపుతున్నది. ఈ పత్రికను వెబ్ సైట్లో కూడా చూడవచ్చును. అలాగే పత్రికా రంగంలో విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న పాత్రికేయులను నారద జయంతి రోజున సన్మానించడం కూడా చేస్తున్నది. సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రజా సంబంధాలు మరియు పాత్రికేయుని పనికై నారదుడిని నియుక్తి చేశారు. నారద మహర్షి సత్యాన్ని ప్రజలకు హితం కలిగే విధంగా చెప్పేవాడు. దుర్మార్గాన్ని అంతం చేసేందుకు కృషి చేసాడు. ఆ మహర్షి జీవితం నుండి ప్రేరణ పొంది నేటి పాత్రికేయులు పని చేయాలి" అని శ్రీ హరిహరశర్మ పిలుపునిచ్చారు.

ముఖ్య అతిథి సందేశం - శ్రీ ఎ.కిస్మత్ కుమార్, వీథి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్

ముఖ్య అతిథి సందేశం

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎ.కిస్మత్ కుమార్ మాట్లాడుతూ -"నారద జయంతి సందర్భంగా పాత్రికేయులను సన్మానించే కార్యక్రమాన్ని సమాచార భారతి ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. పాత్రికేయులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి, అందరితో కలసి ఉండాలి. క్రమశిక్షణ, అంకితభావం, కొంత లౌక్యం కూడా నేర్చుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పాత్రికేయులు బియ్యంలో రాళ్లు ఏరేవారయితే ప్రజా సంబంధాల వాళ్లు (పి.ఆర్.ఓ.లు) రాళ్ల నుండి రత్నాలను ఏరేవాళ్లు. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు కంప్యూటర్స్, ఇంటర్ నెట్ లు వచ్చాయి. ఆ నైపుణ్యం మనకు కావాలి. సకారాత్మకంగా ఆలోచిస్తూ పనిచేస్తూ విజయం సాధించాలి. మాకు అన్నీ తెలుసు అని కాకుండా మంచి విషయాలు అందరి దగ్గర నుండి నేర్చుకోవాలి. రాయటం మాత్రమే కాదు, మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడటం కూడా రావాలి. వివరాలు రాబట్టడానికి సరియైన ప్రశ్నలు కావాలి.

ఒక ఉదాహరణ : ఒకసారి లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరి మధ్య తమ ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారనే ప్రశ్న ఉదయించింది. ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చాడు. నారదుడిని మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారని ఇద్దరూ ప్రశ్నించారు. నారదుడు చిక్కుల్లో పడకుండా తెలివిగా సమాధానం చెప్పాడు. వాళ్లిద్దరిని గడప వైపు నడవమన్నాడు. తిరిగి ఇద్దరినీ లోపలికి రమ్మన్నాడు. అప్పుడు 'లక్ష్మీదేవి గడప దగ్గరి నుండి లోపలికి వస్తుంటే అందంగా ఉన్నదని, జ్యేష్ఠాదేవి గడప దాటి బయటకు వెళ్తూ ఉంటే అందంగా ఉన్నద'ని చెప్పి వాళ్ల తగవును తీర్చాడు", అని చెపుతూ శ్రీ కిస్మత్ కుమార్ తమ ప్రసంగాన్ని ముగించారు.

పాత్రికేయులకు పురస్కార ప్రదానం - సన్మాన సత్కారం

శ్రీ వి.ఎస్.ఆర్.శాస్త్రి గారికి పురస్కార ప్రదానం
శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు గారికి పురస్కార ప్రదానం

అనంతరం ముఖ్య అతిథి శ్రీ కిస్మత్ కుమార్ చేతుల మీదుగా శ్రీ వి.ఎస్.ఆర్.శాస్త్రి (ఎన్.టి.వి.-భక్తి టి.వి గ్రూప్), శ్రీ తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు (ప్రముఖ పాత్రికేయులు) లకు స్వర్గీయ భండారు సదాశివరావు స్మారక పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. అనంతరం సన్మానం జరిగింది.

శ్రీ ఆకారపు మల్లేశం గారికి పురస్కార ప్రదానం
శ్రీ మెండు శ్రీనివాస్ గారికి పురస్కార ప్రదానం

అలాగే సమాచార భారతి అధ్యక్షులు శ్రీ టి.హరిహరశర్మ చేతుల మీదుగా శ్రీ ఆకారపు మల్లేశం (ఈనాడు దినప్రతిక ఛీఫ్ రిపోర్టర్), శ్రీ మెండు శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి దినప్రతిక డెప్యూటి ఛీఫ్ రిపోర్టర్) లకు స్వర్గీయ శ్రీ వడ్లమూడి రామ్ మోహన్ రావు స్మారక పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. అనంతరం సన్మానం జరిగింది.

అనంతరం సన్మాన గ్రహీతలైన శ్రీ వి.ఎస్.ఆర్.శాస్త్రి, శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు, శ్రీ ఆకారపు మల్లేశం, శ్రీ మెండు శ్రీనివాస్ లు తమ సంతోషాన్ని సభతో పంచుకున్నారు.

సమాచార భారతి కమిటీ సభ్యులైన శ్రీ వేదుల నరసింహం వందన సమర్పణ చేయగా, జాతీయ గీతమైన జనగణమన ఆలాపనతోనూ, మధ్యాహ్న విందుతోను కార్యక్రమం ముగిసింది.

Photo Gallery