మార్పు అవసరం


81 కోట్లకు పెరిగిన ఓటర్ల సంఖ్య : 

దేశంలో 1951-52లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17,32,12,343 (పదిహేడు కోట్ల, ముప్ఫై రెండు లక్షల, పన్నెండు వేల మూడువందల నలభై మూడు) కాగా ఫిబ్రవరి 2014న తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 81,45,91,184 కు చేరింది. అంటే అప్పటికీ ఇప్పటికీ ఓటర్ల సంఖ్య దాదాపు ఐదురెట్లు పెరిగింది. ఒక్క మన రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) నే 6,22,85,949 మంది ఓటర్లున్నారు. 2009 ఎన్నికల తర్వాత ఓటుహక్కుపై అవగాహన పెరగడం, రాజకీయ చైతన్యం వల్ల దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 9.76 కోట్లకు పెరిగింది. ఇక ఓటర్ల సంఖ్యను విశ్లేషిస్తే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రధానపార్టీ ప్రాబల్యం అంతగాలేని ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 49.1 శాతం మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1.73% ఉండగా వివిధ రాష్ట్రాలలో 98.47% మంది ఉన్నారు. 


ఈ ఓటు బ్యాంకును సక్రమంగా వినియోగించుకుంటే అందరూ ఆశిస్తున్న 'మార్పు' తథ్యం. కాగా దేశవ్యాప్తంగా ప్రజలు పాలనలో మార్పును కోరుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 'సంకీర్ణ' పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లి ఏదో బలమైన జాతీయ పార్టీ పాలన అవసరమన్న భావం ఓటర్లలో కనిపిస్తోంది. 'చాలమంది వంటగాళ్లు చేరితే వంటకం ప్లాపైపోతోంది' అన్న వాస్తవాన్ని 'రుచి' మరిగిన ఓటర్లు గమనించారు. దీనికి తోడు ఇంతవరకూ అందరూ అతి పెద్ద పార్టీగా భావిస్తున్న కాంగ్రెస్ లో స్పెక్ట్రమ్, బొగ్గుగనుల కుంభకోణం చిచ్చు, రాష్ట్రాల విభజన రాజకీయం పార్టీలో లుకలుకల్ని బజారున పడేశాయి.

మన రాష్ట్రంలో స్వయంగా అధికార పీఠంపై ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరో పార్టీ బావుటాను ఎగరేసాడు. ఈ అవిధేయత చిచ్చు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పరువుకు ఎసరు పెడుతూనే ఉంది. అందువల్ల ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ఇటీవల జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 18% దిగజారింది. ఆ పార్టీతో జట్టుకట్టిన ప్రాంతీయ పార్టీల నాయకులైన ములాయంసింగ్, మాయావతి, నితిష్ కుమార్ లు 'బుర్ర' గోక్కుంటున్నారు.మరోవైపు రానున్న ఎన్నికలలో సంచలనం సృష్టించే అవకాశాలున్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో తన సత్తాను చాటి బలాన్ని పెంచుకుంది.

ఈ ఫలితాలను గమనిస్తే గుజరాత్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్రమోడి నాయకత్వాన ఎన్నికలను ఎదుర్కొనబోతున్న బిజెపి సంచలనం సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు వివిధ సర్వేలు తేటతెల్లం చేసాయి. అంతేకాక బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాకు స్పష్టమైన రూపం ఇచ్చినట్లు మోడి తన ప్రసంగంలో చూచాయగా స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటి పైన ఆయన దృష్టి సారించినట్లు అవగతమవుతోంది. ప్రస్తుత యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అంశాలను కూడా వాటితో చర్చించకుండా సొంత నిర్ణయాలను రుద్దుతోంది. దీనివల్ల రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిన ఫెడరల్ వ్యవస్థకు ముప్పు దాపురించింది. వీటికి ఉదాహరణగా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్.సి.టి.సి.), వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి.) వివాదం వంటివి పేర్కొనవచ్చు. ఈ విషయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫెడరల్ వ్యవస్థకు ముప్పు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో బృందం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల మెరుగునకు 'స్మార్ట్ సిటీ'లను అభివృద్ధి చేస్తామని, పేదలకు అందుబాటులో శాటిలైట్ సిటీలు (కమ్యూనికేషన్ వ్యవస్థలతో) ఏర్పాటుపై దృష్టి పెడతామని మోడి తన ప్రసంగంలో వెల్లడించారు. వ్యవసాయానికి ఊతమిచ్చేలా గిట్టుబాటు ధరలను ఇవ్వడంతోపాటు విద్యుత్ కొరతను అధిగమిస్తామన్నారు. ఇప్పటికే గుజరాత్ విద్యుత్ కొరతను అధిగమించడంతో పాటు అధికోత్పత్తిని సాధిస్తోంది. పల్లె పల్లెలో కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు, ఆరోగ్య కేంద్ర సేవలకు ప్రాధాన్యత కల్పించారు. ఇక దేశంలో విద్యారంగ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల్లో భాగంగా ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

ఇలా దేశంలో విద్య, వైద్య, విద్యుత్ కొరత వంటి సమస్యలు తీరి గ్రామాలు ప్రగతిపథంలోకి పయనిస్తే 'గ్రామీణ భారతి' స్వరూపం మారి నగరాలు, పట్టణాలపై ఒత్తిడి తగ్గడం ఖాయం. ఈ కలలన్నీ వాస్తవరూపం దాల్చాలంటే ప్రతి ఓటరు తన హక్కును వినియోగించుకోవడంతో పాటు 'మార్పు'ను ఆశించాలి. అప్పడు ఇది సాధ్యమవుతుంది.

- మారేమండ