విశ్వమంతటా ఉన్న హిందువుల రక్షణకు ఆవిర్భవించినదే విశ్వహిందూ పరిషత్

ఆగష్టు 17 నుండి విశ్వహిందూ పరిషత్ స్వర్ణజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం
 
విశ్వహిందూ పరిషత్ ముద్ర (లోగో)
 
వైవిధ్యము సృష్టి యొక్క ప్రత్యేకత. వైవిధ్యంలో ఉన్న ఏకత, ఏకాత్మతను ఆవిష్కరించిన వాళ్ళు మన మహర్షులు. వైవిధ్యము హిందూ సమాజం యొక్క స్వభావము. భౌగోళికంగా, వాతావరణ స్థితులు, భాష, సాంప్రదాయాలు, వృత్తులు, ప్రవృత్తులు, మతాలు, ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలన్నింటిలోను వివిధత మనకు కనబడుతుంది. ఈ వివిధతలో ఏకత, ఏకాత్మతను దర్శించి, ఆ సత్యాన్ని అందరికి అందచేసింది హిందూ సమాజమే. కాబట్టి ఈ దేశం వేల సంవత్సరాల కాలఖండంలో అనేక ఒడుదుడుకులను ఎదుర్కొన్నప్పటికి ఈ దేశం ఈ దేశంగా నిలబడింది. సనాతన ధర్మాన్ని కాపాడుకొంది. 
 
మహాభారత కాలంలో వేదవ్యాసుడు ఈ సమాజం యొక్క ఏకాత్మతా భావాన్ని భగవద్గీత రూపంలో మనకు అందించాడు. ఆ కాలంలో అన్నింటి మధ్య సమన్వయం సాధించారు.  విజ్ఞానాన్ని వర్గీకరించారు. సృష్టి రహస్యాలను మనకు అందించారు. వివిధతలో ఏకతా, ఏకాత్మతా ఈ సృష్టి రహస్యం అని చెప్పారు. ఆ రోజుల్లో ఉన్న వైదిక సంస్కృతి క్రమంగా మతాల రూపంలో ఆవిష్కృతమవటం ప్రారంభమైంది. శివతత్వం, విష్ణుతత్వం, బ్రహ్మతత్వం, శక్తితత్వం మొదలైన అనేక మతాలు, సాంప్రదాయాలు ఆ తదుపరి కాలంలో ఈ దేశంలో క్రమంగా వికసించాయి. ఆ మతాల పరాకాష్టను కూడా ఈ జాతి చవిచూసింది. దాని దుష్పరిణామాలు ఏమిటంటే ఏకత, ఏకాత్మతను విస్మరించటం.

ఆ సమయంలోనే ఆదిశంకరాచార్యుల వారి జననం జరిగింది. శంకరాచార్యల వారు ఆ కాలంనాటి అన్ని తత్వాలను ఆకళింపు చేసుకొని దానిలో ఏకత, ఏకాత్మతను అద్వైత సిద్ధాంత రూపంలో ప్రతిపాదించి దానిని శాస్త్రబద్ధం చేసి మనకు అందించారు.

ఈ అద్వైత సిద్ధాంతము కలియుగంలో పరంపరాగతంగా వస్తున్న ఏకాత్మతను దర్శింపచేసింది. ఆవిష్కరింపచేసింది. ఆ తదుపరి ఈ దేశం మీద జరిగిన అనేక దాడుల నుండి మన సంస్కృతి నిలబడటానికి గట్టి పునాదులను వేసింది. ఆ తదుపరి కాలంలో కూడా అనేక గురు పరంపరలు, సాంప్రదాయాలు దేశంలో వికసించాయి. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్ మొదలైన సంప్రదాయాలు ప్రారంభమైనాయి. వీటిమధ్య సమన్వయం సాధించి ఉంటే స్వాతంత్ర్యోద్యమంలో మన పోరాట పటిమ మరొక విధంగా ఉండేది.

ఆ రోజుల్లో దేశంలో నిర్మాణమవుతున్న అంతర్యుద్ధ పరిస్థితులను దాటి, దేశ విభజనను ఆపగలిగి ఉండేవారు. కాని సమన్వయం అంతగా జరగలేదు.  ఆ పరిస్థితులను చక్కదిద్దుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇది ఒక జాతీయ ఆవశ్యకత. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ అంశము గురించి కొందరు పెద్దలు ఆలోచించారు. ఆ పెద్దల ఆలోచనల సాకార రూపమే విశ్వహిందూ పరిషత్.

విశ్వహిందూ పరిషత్ ఏ లక్ష్యం కోసం ప్రారంభించబడింది ? 
 
ఇది ప్రజాస్వామ్య యుగం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సంఘటితంగా లేకపోతే నిరంతర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. భారతదేశంలో 1857వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్లపై ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి దారితీసిన ప్రధాన కారణం క్రైస్తవం. 1947లో దేశ విభజనకు ప్రధాన కారణం ఇస్లాం. ఈ రెండు విదేశీ మతాలు సంఘటితమై, కార్పొరేట్ స్థాయిలో ప్రపంచమంతా విస్తరించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను, కుటిల నీతులను ఉపయోగించి ముందుకు పోతున్నాయి. ఇదే సమయంలో హిందూ సమాజంలోని వివిధ మత, సాంప్రదాయాల మధ్య సమన్వయంతో పనిచేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవలసిన అవసరం ఏర్పడింది. అనేక సందర్భాలలో మన సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలలో గళం ఎత్తవలసిన అవసరం ఏర్పడింది. మైనార్టీలుగా ప్రపంచంలో అనేక దేశాలలో హిందువులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడే ఒక ప్రభుత్వేతర వ్యవస్థ అవసరమైంది. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఏర్పడినదే "విశ్వహిందూ పరిషత్". 
 
1964వ సంవత్సరం ఆగష్టు 30వ తేదీ కృష్ణాష్టమి రోజున ముంబాయిలోని స్వామి చిన్మయానంద ఆశ్రమంలో సాందీపని విద్యాలయంలో మొదటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 60 మంది ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు పూజ్య శ్రీ గురూజీ ప్రముఖంగా పాల్గొని సమన్వయం చేశారు. ఆ సమావేశానికి స్వామి చిన్మయానంద, పూజ్యశ్రీ గురూజీ, మాస్టర్ తారాసింగ్, జ్ఞాని భూపేంద్రసింగ్, కె.యం.మున్షీ, సంత్ తుకడోజీ మహరాజ్, స్వామి శంకరానంద, బ్రహ్మచారి దత్తమూర్తి, కె.యన్.మాన్ కర్ విచ్చేశారు. నైరోబీ, ట్రినిడాడ్ దేశాల నుండి ముగ్గురు ప్రతినిధులు వచ్చారు. ఆ సమయంలో ప్రత్యేక కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోయిన ప్రముఖ స్వామీజీలు, పూజ్య శంకరాచార్యులు, వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రముఖులు, తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ సందేశం పంపించారు. ఆ విధంగా ప్రపంచంలోని హిందువుల గురించి విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావం జరిగింది. విశ్వహిందూ పరిషత్ ఈ రోజున భారతదేశంతో పాటు, ప్రపంచంలోని అనేక దేశాలలో హిందువుల కోసం పని చేస్తున్నది. 
 
ఈ సంవత్సరం ఆగష్టు 17వ తేదీ కృష్ణాష్టమి నాటికి విశ్వహిందూ పరిషత్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో స్వర్ణ జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమైనాయి. 
 
ఆగష్టు 17న ముంబాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదేరోజున దేశవ్యాప్తంగా శోభాయాత్రలు జరుగుతాయి. ఈ సంవత్సరమంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ గడిచిన 50 సంవత్సరాలలో సాధించిన విజయాల గురించి లోకహితం పత్రికలో రాబోవు సంచికలలో తెలుసుకొందాము.
 
- రాము