సామాజిక ఐక్యతే ఈ దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం

ఆగష్టు 15 సందర్భంగా ప్రత్యేక వ్యాసం 
 
 
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపు ఆగష్టు 15కి 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. అంటే ఈ దేశం విభజింపబడి 66 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ 66 సంవత్సరాల కాలఖండంలో దేశ విభజనకు దారి తీసిన కారణాలు, పరిస్థితులను పునరావృతం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇక్కడి మేధావులు, పాలకులు తీసుకొంటున్నారా? ఈ పరిస్థితులను అధిగమించి ఈ దేశం సామాజికంగా, ఆర్థికంగా శక్తివంతమవుతున్నదా? ఈ దేశ ప్రజలలో జాతీయభావ చైతన్యం శక్తివంతమవుతున్నదా? సమాధానం ప్రశ్నార్ధకమే. దేశంలోని పరిస్థితులలో మార్పు వచ్చిందా అంటే అంతగా రాలేదని అర్థమవుతున్నది. పైగా దేశంలో తీవ్రవాదం, విచ్ఛన్నవాదము పెరుగుతున్నది. 
 
స్వాతంత్ర్య పోరాట సమయంలో తిలక్ నుండి ఉద్యమాన్ని అందిపుచ్చుకొన్న గాంధీజీ ఈ దేశానికి స్వాతంత్ర్యం త్వరగా సంపాదించాలనే తొందరపాటులో అనేక తప్పిదాలు జరిగాయి. అందులో అగ్రస్థానం ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించటం, దానిలో ముస్లింలను కలుపుకొని పోవాలనే వ్యూహం, దానికోసం ముస్లింలను సంతుష్టి పరచటం ప్రారంభించారు గాంధీజీ. మరోప్రక్క ఆనాటి ముస్లిం నాయకత్వం స్వాతంత్ర్య పోరాటం కంటే ప్రత్యేక దేశం సాధించుకోవటం కోసం కావలసిన ప్రయత్నాలు వేగవంతం చేసారు. చివరకు ఆ ఉచ్చులో చిక్కుకొని గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి స్వాతంత్ర్యోద్యమ నాయకులు విభజనకు అంగీకరించారు. దేశం ముక్కలయింది. దాని నుండి ఏమైనా పాఠాలు నేర్చుకొన్నామా? అంటే లేదని చెప్పవలసి వస్తుంది. ఈ దేశంలోని మేధావులు కాని, రాజకీయ నాయకులు గాని ముస్లింల వ్యూహాలను అర్థం చేసుకోకుండా ఆ ఉచ్చులో చిక్కుకొని ఉగ్రవాదానికి ఎట్లా పరోక్షంగా సహకరిస్తున్నారో ఇప్పటి దేశ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశ ప్రజలను మెజార్టీ, మైనార్టీలుగా విభజించారు. మైనార్టీల సంరక్షణ పేరుతో మైనార్టీ ఓట్ బ్యాంక్ లను కొల్లగొట్టాలనే వ్యూహం. అందుకే ఈ దేశంలో సచార్ కమిటీలు, కమ్యూనల్ వాయిలెన్స్ బిల్లు వంటివి పుట్టుకొస్తున్నాయి. 
 
ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రాలు : 
 
భారతదేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా మారిన పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తున్నదో గడచిన 25 సంవత్సరాలకు పైగా ప్రపంచంలో జరుగుతున్న దాడులు చూస్తే మనకు అర్థమవుతున్నది. ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చానే లక్ష్యంకు ప్రత్యక్ష యుద్ధాలలో గెలవటం సాధ్యం కాదు కాబట్టి ప్రజలను పాశవికంగా చంపటానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. ఉగ్రవాదుల దాడుల రుచి ఈ రోజు ప్రపంచమంతటికి తెలుసు. ఎక్కడ ఏ దాడి జరిగినా అందరి పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ పై పడతాయి. భారతదేశంలో ఎక్కడ ఏ దాడి జరిగినా అందరి చూపులు హైదరాబాద్ పై పడతాయి. ఎందుకోసం? ఈ రెండు ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి. అప్పటి నుండి నేటి వరకు జిహాద్ వర్థిల్లుతూనే ఉంది. అది ఈ రోజున అనేక రంగాలకు విస్తరించింది. లవ్ జిహాద్, ఆర్థిక జిహాద్, రాజకీయ జిహాద్ ఇట్లాంటివి అనేకం. 
 
స్వాతంత్ర్య పోరాటంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించటం హిమాలయమంత తప్పు. ఆ తప్పుని సరిచేసుకోకపోగా మరింత పెంచుకొంటూ పోతున్న పాలకుల వైనం చూసి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు చిక్కుకొన్నారు. ఈ పరిస్థితులు దేశంలో శాంతియుత వాతావరణం నిలబడనీయటం లేదు. ఈ దేశ జాతీయవాదాన్ని శక్తివంతం కానివ్వటం లేదు. ఈ దేశ బీద, బలహీన వర్గాల ప్రజలను శక్తివంతం కానివ్వటం లేదు. ఈ దేశంలో కొన్నివందల సంవత్సరాలు వివక్షతకు గురియైన ప్రజల ఎదుగుదలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు కూడా తూట్లు పొడిచి ఈ దేశంలో మతతత్వ శక్తులను శక్తివంతం చేయటానికే ప్రయత్నిస్తున్నారు పాలకులు. దళితులకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లలో మతం మారిన దళితులకూ ఇవ్వాలని చూస్తున్నారు. ఇవన్నీ దళితుల ప్రయోజనాలు, హక్కులకు తూట్లు పొడవటానికే అనేది అక్షరసత్యం. అంటే సామాజికంగా ఈ దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నారు? అందూ ఆలోచించాలి. 
 
సామాజికాభివృద్ధి : 
 
సామాజిక రంగంలో భారత్ ఘోరంగా వెనుకబడింది. ఈ దేశంలోని అన్ని సామాజిక విభాగాల మధ్య సామరస్యం, సమాన ఎదుగుదల, సామాజికంగా సంరక్షణ, సమగ్ర అభివృద్ధి మొదలైనవి లేకుండా దేశం ఎలా శక్తివంతమవుతుంది? దేశం అభివృద్ధి చెందలేదా అంటే చెందుతున్నది అని స్పష్టంగా చెప్పవచ్చు. కాని అభివృద్ధితో బీదరికం పోటీపడి పెరుగుతున్నది. సామాజిక సమతుల్యత, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి ఇంకా చాలా దూరంలో ఉన్నాం అనేది ఉత్తర భారతంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లలో పరిస్థితులు గమనిస్తే అర్థమవుతుంది. దళిత క్రైస్తవులు, దళిత, ముస్లింలు అనే మాటలతో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలోఅసమానత పెరుగుతున్నది. దేశానికి ప్రధానులను అందించిన ఉత్తరప్రదేశ్ దేశానికి కురుక్షేత్రంగా ఎందుకు మారుతున్నది? కాబట్టి ఈ దేశ పరిస్థితులలో మార్పు తేవటానికి శక్తివంతమైన జాతీయ భావాలు కలిగిన నాయకత్వం అవసరం. అందరినీ కలుపుకుని పోతూ ఈ దేశాన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో పటిష్టం చేయాలి. ఈ దేశ రాజకీయాలను సక్రమంగా నడిపించాలి. అప్పుడే దేశంలో పరిస్థితులు మారతాయి. ఆ దిశలో దేశాన్ని నడిపించటానికి మనమందరం స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మనం హిందువులుగా గర్విద్దాం, హిందువులుగా జీవిద్దాం, మన సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రభావంతో ప్రపంచంలో శాంతిని స్థాపించటానికి దోహదపడదాము. అందుకే ఈ రోజున మనం దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్లటానికి "మనం అందరం హిందువులం, బంధువులం - అందరు సంఘటితంగా ఉందామ"ని సంకల్పం తీసుకొందాం. స్వాతంత్ర్య పోరాటంలో అరవింద, వివేకానంద మొదలైన మహాపురుషులు కలలుకన్న భారతాన్ని సాకారం చేసుకొందాం. భారతదేశ ఆధ్యాత్మిక చింతన సామాజిక ఐక్యతకు ప్రేరణ, సామాజిక ఐక్యతే ఈ దేశ సమగ్ర అభివృద్ధికి ఆధారం. 
 
- రాము