దేశంలో మార్పు కోసం కృషి చేద్దాం

ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పిలుపు

వేదికపై ప్రసంగిస్తున్న పూజనీయ శ్రీ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విజయదశమి పండుగనాడు ప్రారంభమైంది. సంఘం ప్రారంభించిన కొద్ది సంవత్సరాల నుండి విజయదశమి పండుగ రోజున సంఘ సర్ సంఘచాలక్ నాగపూర్ విజయదశమి ఉత్సవంలో ప్రసంగించి ప్రధాన సందేశం ఇవ్వటం ఆనవాయితీ. ఆ సమయంలో సంఘ ఆలోచనలను సర్ సంఘచాలకులు స్పష్టంగా చెబుతారు.

ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీనాడు నాగపూర్ లో జరిగిన విజయదశమి ఉత్సవంలో పూజ్య సర్ సంఘచాలక్ మాననీయ మోహన్ జీ భాగవత్ మాట్లాడారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతున్నదని, మన రూపాయి పతనం దిశలో ప్రయాణిస్తున్నదని చెప్పారు. దేశానికి మౌలికమైన ఉత్సాదన రంగాన్ని విదేశీయుల చేతులలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మన దేశ సంపదకు మూలం కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగం, చిల్లర వ్యాపార రంగం. వీటన్నింటిలోకి నేరుగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ మన కేంద్ర ప్రభుత్వం ఆత్మహత్యా సదృశమైన ఆర్థిక నీతిని అవలంబిస్తున్నదని,  దానితో పేద ప్రజలను మరింత సమస్యలలోకి నెట్టాలనేది ప్రభుత్వ సంకల్పంగా ఉన్నట్లున్నదని పూజనీయ మోహన్ జీ ఆందోళన వ్యక్తం చేశారు. 

పూజనీయ మోహన్ జీ సందేశం క్లుప్తంగా...

"వికాసం పేరుతో వినాశనానికి దారితీసే విధానాలు అనుసరిస్తే జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయో ఉత్తరాంచల్ లో జరిగిన భయంకర విపత్తు తెలియచేస్తున్నది. ఆ విపత్తును మనం కళ్లారా చూశాము. మనదైన విధానాలను అనుసరించి దేశ సమగ్ర వికాసానికి ప్రతి ఒక్కరు దృఢంగా నిలబడాలి, మన విధానాలన్ని సవ్యమైన దిశలో సాగిపోయేలా చూడాలి.

విద్యారంగం, కుటుంబ వ్యవస్థ కాపాడుకోవాలి

నేడు మన విద్యారంగం పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. విద్యారంగంలో మౌలికమైన మార్పులు తీసుకురావాలి. విద్యారంగాన్ని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలి. విద్యారంగంలోకి కూడా విదేశీయులను ఆహ్వానించటం ఎంతో గర్హించదగిన విషయం. విద్యను కూడా విదేశీ వ్యాపారులకు అప్పటించే ప్రయత్నం జరుగుతున్నది. దేశ ఉజ్వల భవిష్యత్ లో భాగస్వామ్యం కావలసిన యువతరం ఇలా విదేశీ విద్యకు దాసులైతే సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దాని నివారణకు నైతిక విలువలతో కూడిన విద్యావిధానం అందించబడాలి. అది సక్రమంగా ఉండాలంటే మన కుటుంబ వ్యవస్థ దానికి మూలం. అది చక్కగా కాపాడబడాలి.

వేదికపై సంఘ ప్రార్థన చేస్తున్న శ్రీ మోహన్ భాగవత్, ఇతర పెద్దలు

మన పాలకులు అనావశ్యకమైన చట్టాలు తెస్తూ మన కుటుంబ వ్యవస్థను బలహీనం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. దానితో కుటుంబాలలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి. వ్యక్తుల సంబంధాలు కూడా ఆర్థిక దృష్టితో చూడటం శోచనీయం. మన సమాజంలో సామాజిక భ్రదతకు సామాజిక ప్రగతికి ఆధారం మన కుటుంబ వ్యవస్థ. దానిని కాపాడుకోవటానికి మనం కృతనిశ్చయులం కావాలి.

దేశ సరిహద్దులు భద్రంగా లేవు

దేశ సరిహద్దులు భద్రంగా లేవు. సరిహద్దు సంక్షోభానికి ఒక ప్రక్క చైనా, మరో ప్రక్క పాకిస్తాన్ కారణాలు. సరిహద్దులలో చైనా సైన్యాన్ని దింపుతున్నది. భారత భద్రతకు సవాలు విసురుతున్నది. పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల చొరబాట్లు పెరుగుతున్నాయి. సరిహద్దులలో ఈ మధ్యకాలంలో కాల్పులు సర్వసాధారణమైపోయాయి. దొంగచాటుగా మన సైనికులపై దాడిచేసి చంపివేస్తున్నారు. దీనిపై ఎంతైతే కఠిన చర్యలు తీసుకోవాలో అంత తీసుకోకపోవటం మన సైనికులను నిరుత్సాహపరుస్తున్నది.

శారీరిక ప్రదర్శనలు చేస్తున్న స్వయంసేవకులు

ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి దిగజారుతున్నది. ఓటుబ్యాంకు రాజకీయాలు తీవ్రవాదాన్ని, మత విద్వేషాన్ని, అక్రమ చొరబాట్లను పెంచి పోషిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలలో ఈశాన్య రాష్ట్రాలలో సరియైన అభివృద్ధి లేదు. దానిపై దృష్టి సారించాలి. ఒకప్పుడు మనదేశంలో భాగమైన నేపాల్, టిబెట్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో మూల నివాసులు మన భారతీయులు. వారి సంరక్షణ బాధ్యత మన ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి ఆ దేశాలతో పటిష్టమైన సంబంధాలు మన దేశానికి ఉండాలి.  కాని మన ప్రభుత్వం పూర్తి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది" అని అంటూ మోహన్ జీ తమ ప్రసంగాన్ని ముగించారు.