'అసలు కాదు, నకలు'


అతనో యువరాజు. తనకు తానే అసలు సిసలైన ప్రజాస్వామ్య వాదిగా బిల్డప్ ఇస్తారు. ఎన్.జి.ఓ. కార్యకర్తకు ఎక్కువ, పార్టీ లీడర్ కు తక్కువ అన్నట్లు ఉపదేశాలు వల్లిస్తారు. ఇక ఆయనగారి పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కాబోయే 'దేశ్ కే నేత'గా బాకాలు ఊదుతుంటారు. భాజపా ప్రధాని అభ్యర్థి మోడీకి చెక్ పెట్టేది మా 'షెహజాదా'యే నంటూ నేషనల్ మీడియా డిబేట్లలో అడ్డగోలు వాదనలతో ఉపన్యాసాలు దంచేస్తారు.

ఇంతకీ ఆ 'షెహజాదా' ఎవరో మీకు తెలిసిందనుకుంటాను! ఆయనే కాంగ్రెస్ యువరాజు మిస్టర్ రాహుల్ గాంధీ..! ఇప్పటికే భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలను నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు మోడీ విమర్శలకు ధీటుగా జవాబు చెప్పలేక కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ 'చాయ్ వాలా' దేశ ప్రధాని ఎలా అవుతాడంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమని, ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా రాజులయ్యే అవకాశాలున్నాయని, ఇంకా గుర్తించినట్లు లేరు కాంగ్రెస్ వారు.

ఇంకోవైపు రాబోయే ఎన్నికలలో మోడీని ఎదుర్కొనే సీన్ తమ యువరాజుకు లేదని తెలిసినా.. ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలుకుతున్నారు. మా యువరాజే గొప్పంటూ మోడీకి ధీటుగా ఇస్తున్న పత్రికా ప్రకటనలూ, హోర్డింగ్స్ కూడా భాజపాకు నకలుగానే ఉంటున్నాయి.

రాహుల్ తొలి ప్రచారాస్త్రమే కాంగ్రెస్ పార్టీ నేతలకు షాకిచ్చింది. జనవరి 24న దేశవ్యాప్తంగా అన్ని పత్రికలకు కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన ప్రచార ప్రకటనలో 'మోడీదంతా వ్యక్తి కేంద్రీకృత వ్యవస్థ అనీ, తాము అందరినీ కలుపుకొని వెళతామ'నే అర్థం వచ్చేలా 'నేను కాదు.., మేం' అనే నినాదాన్ని ప్రచురించారు. మోడీకి భలే కౌంటర్ ఇచ్చామనుకున్న ఆనందం కాంగ్రెస్ వారికి కాసేపైనా దక్కలేదు. భాజపా నేతలు వెంటనే కౌంటర్ ఎటాక్ చేసారు.

'నేను కాదు.., మేం' నినాదం నరేంద్రమోడీ మూడేళ్ల క్రిందటే వాడి వదిలేసారని తెలిపారు. 2011లో పార్టీ చింతన్ శిబిరంలో నరేంద్రమోడీ ఈ నినాదాన్ని తీసుకున్న విషయాన్ని ఫోటోలతో సహా బయటపెట్టారు. దీనితో గాబరాబడ్డ యువరాజుగారికి బాకారాయుళ్లు 'తాము కాపీరాయుళ్లం కాము' అని కవరింగ్ ఇచ్చుకునేందుకు నానా తంటాలు పడ్డారు. తమకు ఎవరినీ కాపీ కొట్టవలసిన అవసరం లేదని, నినాదాలు, ఆలోచనలు ఎవరి సొత్తు కాదని చెపుతూ కాపీరైట్ చట్టానికే కొత్త భాష్యం చెప్పారు. 
- నారద