నిరంతర చైనా చొరబాట్లు మరో యుద్ధానికి సంకేతమా !?

 
చైనా ప్రభుత్వ సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ.) గత 2006 సంవత్సరం నుండి సగటున ప్రతి ఏటా కనీసం 50 సార్లు వాస్తవాధీన రేఖను ఉల్లంఘించి భారత సరిహద్దులలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడి మన జవానుల ఆవాసాలను, సాంకేతిక పరికరాలను ధ్వంసం చేయడం, హెచ్చరికలు జారీ చేయడం సర్వసాధారణమైపోయింది. చైనా దుందుడుకు చేష్టలకు ముకుతాడు వేయలేని కేంద్రప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు తన చేతకాని తనాన్ని, అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి చొరబాట్లను బాహ్యప్రపంచానికి, మీడియాకు పొక్కనీయటం లేదు. దేశభద్రతకు సంబంధించి ఇది చాలా గంభీరమైన విషయం. 
 
ఇటీవల గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలు తీవ్రతను తెలియచేస్తున్నా కేంద్రప్రభుత్వం, విదేశాంగశాఖ మాత్రం తీవ్రతను తగ్గించి చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన చైనా సైనికులు 'చుమార్' స్థావరంలో మన భద్రతా దళాలు ఏర్పాటు చేసిన నిఘా కెమెరాను పెకలించి ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని భద్రతా దళాలు వెంటనే పై అధికారుల ద్వారా అంచెలంచెలుగా సైనిక దళాల ప్రధాన కార్యాలయానికి అటునుండి రక్షణ శాఖ కార్యాలయానికి, ప్రధాని కార్యాలయానికి అంది ఉండవచ్చు. ఈ విషయాన్ని అత్యంత తీవ్రమైనదిగా భావించి భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్రమైన నిరసనను తెలియచేసి ఉండాలి. కానీ చేతలుడిగిన యు.పి.ఎ. ప్రభుత్వం దాని సమాచారాన్ని దాచి ఉంచి జూలై 4వ తారీఖున మన విదేశాంగ మంత్రి చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా అధికారుల స్థాయిలో కాని, మంత్రిత్వస్థాయిలో కాని, ఈ విషయమై అభ్యంతరాలు తెలుపలేదు సరికదా ప్రస్తావన కూడా చేయలేదు. ఇటువంటి ఉదార వైఖరిని గమనించిన చైనా ఆర్మీ ప్రధానాధికారి సరిహద్దు విషయంలో భారతదేశాన్ని హెచ్చరించే స్థాయికి చేరుకున్నాడు. 
 
 
ఒకవైపు చైనా ఆర్మీ అధికారుల నుండి సరిహద్దు విషయంలో భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తుండగా మనరక్షణ మంత్రిత్వశాఖ వారు దానిని "స్థానిక సమస్యలు"గా, వాస్తవాధీన రేఖపై సైనికుల అవగాహనా రాహిత్యంగా సమస్యలను చిన్నవి చేసి చూపించి బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సూటి సమాధానాలు చెప్పలేక దాటవేస్తున్నారు. వాస్తవాధీన రేఖపై చైనా సైనికుల అవగాహనా రాహిత్యం అనేది ఆవాస్తవం. 1962 యుద్ధంలో 90 వేల కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించి వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా నిర్ణయించింది చైనాయే. మరి దగ్గర వాస్తవాధీన రేఖకు సంబంధించిన సమాచారం ఉండదా? ఇది ముమ్మాటికి భారత్ ను రెచ్చగొట్టే చర్యగా భావించాలి.

గతంలో 1962 చైనా యుద్ధం నాటి పూర్వపరిణామాలను పరిశీలించినట్లైతే చైనా సైన్యం లడక్ ప్రాంతంలో 1950 నుండి పదే పదే చొరబాట్లను కొనసాగించింది. అప్పుడు కూడా నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానిని "స్థానిక వివాదాలు"గా చిత్రీకరించి నిర్లక్ష్యం చేసిన ఫలితమే 1962  చైనా యుద్ధం. దురాక్రమణ జరపడానికి ఆ స్థానిక వివాదాలనే కారణంగా చూపించింది చైనా. ప్రస్తుతం చుమార్ ప్రాంతంలో చొరబాట్లకు పాల్పడుతున్న చైనా మరోసారి దురాక్రమణకు తెగబడుతున్నదా? ప్రభుత్వం వేగంగా తీవ్రంగా స్పందించాలి. 
 
- పతికి