సెక్యులర్ రాజకీయాలు పరాకాష్టకు చేరుతున్నాయా?

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయనామ సంవత్సరం, భాద్రపదమాసం

లౌకికవాదం (సెక్యులరిజం) అనే పదానికి డిక్షనరీలో ఉన్న అర్థం అన్ని మతాలనూ సమానంగా చూడటం. కాని భారత రాజకీయాలు ఆ అర్థాన్ని 'ఓట్లకోసం వేసే గాలం' గా మార్చివేశాయి. దానికోసం మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను సంతృప్తిపరుస్తున్నాయి. ఈ దేశంలో నిజమైన మైనార్టీల సంరక్షకులము మేమే అని నిరూపించుకొనేందుకు ఈ దేశంలోని రాజకీయ పార్టీలు పోటీలు పడుతున్నాయి. ఈ పోటీలో అగ్రభాగాన ఉన్నది కాంగ్రెసు. ఆ తదుపరి మిగిలిన వారు. వారిలో పెద్ద పోటీదారులు ములాయం, లల్లూ, ఆ తదుపరి నితీష్. ఇట్లా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. పాత రికార్డులను బద్దలు కొట్టే తాజా ఉదాహరణ ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది.  

ఈ మధ్య భారతీయ నిఘాసంస్థ కరడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను అదుపులోకి తీసుకొన్నది. ఈయన ఇండియన్ ముజాహిదీన్ సంస్థను స్థాపించి విజయవంతంగా అనేక బాంబులు పేల్చిన కరుడుగట్టిన ఉగ్రవాది. అతనిని అదుపులోకి తీసుకొన్న ఆరు రోజుల తరువాత అతనిపై మొదటి సమాచారపత్రం (FIR) తయారు చేయాలని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) బీహార్ పోలీసులకు విన్నవించుకొంది. బుద్ధగయ ప్రేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ పాత్ర ఉన్నది, బీహార్ లోని దర్బాంగ ప్రాంతంలో ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలు చాలా చురుకుగా ఉన్నాయి కూడా. బీహారు పోలీసులు రంగప్రవేశం చేయకుండానే బీహార్ ముఖ్యమంత్రి రంగప్రవేశం చేసి బీహారులో కేసు ఫైల్ చేయటానికి తన అయిష్టతను వెల్లడించారు. బీహారులో 16% మంది ముస్లింలు ఉన్నారు. మొదటి కేసు ఇక్కడ ఫైలు చేస్తే తనకు చాలా ప్రమాదం, తనకు ఈ అంశం వచ్చే ఎన్నికలలో తీవ్రప్రభావం చూపిస్తుందని వీర సెక్యులర్ ముఖ్యమంత్రి వణికిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థనను మన్నించిన IB వాళ్లు నేరుగా ప్రవేశించి కేసు నమోదు చేసుకొన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది, అంతర్జాతీయ నేరగాడు అయిన యాసిన్ భత్కల్ ముస్లిం మతస్తుడు కాబట్టి అతనిపై ఇక్కడ కేసు పెడితే ఇక్కడి ముస్లింలకు ఆగ్రహం కలుగుతుంది. అటువంటి పని నేను చేయనని చెప్పారు. ఇదీ మన సెక్యులర్ నాయకుల ఆలోచన తీరు.

మరో ఉదాహరణ. మహారాష్ట్రలో ఛాయాచిత్ర విలేఖరిపై జరిగిన అత్యాచార ఘటనలో అందరూ ముస్లింలే ఉన్నారని తొలుత సమాచారం అందింది. దానితో ఆ కేసులో ముందుకు వెళ్లటానికి మహారాష్ట్ర ప్రభుత్వం చిగురుటాకు లాగా కంపించిపోయింది. కేసు పరిశీలన మరింత లోతుగా చేసి అత్యాచార ఘటనలో ఒక హిందువు కూడా ఉన్నాడని గుర్తించారు. గుర్తించారో లేక ఒక హిందువును ఇరికించారో తెలియదు. హిందువు గుర్తింపబడిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకొని కేసు నమోదు చేయించి, వేగంగా ముందుకు కదిలింది.

ఈ మధ్య కాలంలో దేశంలో ఒక క్రొత్త నిఘా విభాగం ఏర్పాటు చేసి వాళ్లకు చాలా పెద్ద మైక్రో భూతద్దాలు ఇచ్చి హిందూ ఉగ్రవాదులను గుర్తించేందుకు ఏర్పాటు చేయబడింది. చూడబోతే 'ఇది హిందూ ఉగ్రవాదుల సంస్థ పని' అని ఏదో పేరున గాలివార్త పేల్చినా ఆశ్చర్యం లేదు.

ఇవీ మన దేశ సెక్యులర్ రాజకీయ నాయకుల ఆలోచనలు. కేవలం ముస్లిం ఉగ్రవాదులు కాదు, హిందూ ఉగ్రవాదులు కూడా ఉన్నారని నిరూపించే ఒక దశవర్ష ప్రణాళికతో చురుగ్గా పనిచేస్తున్నారు. రాబోయే రోజులలో ఎన్ని విచిత్రాలు చేయబోతున్నారో వేచి చూడాలి.