విపత్తులో కూడా కాంగ్రెస్ రాజకీయం

పై ఫోటో : కేవలం ఏరియల్ సర్వే జరిపి వెళ్లిపోయిన ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియాగాంధీ. క్రింది ఫోటో : ఉత్తరాఖండ్ లో వరద పీడిత ప్రాంతంలోకి వచ్చి బాధితులను పరామర్శిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి
 
గత నెల జూన్ 17 వ తేదీ ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి కురిసి ఉధృతంగా వరదలు వచ్చి కేదారనాథ్ లో విపరీతమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది. కాంగ్రెస్ వారు భావి ప్రధానిగా కలలు గంటున్న యువనాయకుడు రాహుల్ గాంధీ ఆ సమయంలో భారతదేశంలో లేరు. వారు స్పెయిన్ లో తన జన్మదినోత్సవాలను మిత్రుల మధ్య జరుపుకొంటున్నారు. వరద నష్టం తీవ్రత పత్రికల ద్వారా బాహ్యప్రపంచానికి తెలిసిన తరువాత కూడా కాంగ్రెస్ నాయకత్వం గానీ, వారి యువ నాయకుడు గాని సరిగా స్పందించలేదు. ప్రధాని, సోనియా ఇద్దరూ విమానంలో సర్వే జరిపి సైన్యానికి, ప్రభుత్వ ఏజన్సీలకు, అధికారులకు సహాయ చర్యల బాధ్యతలను అప్పగించి ఆ తరువాత సహాయక చర్యల అమలు గురించి పెద్దగా పట్టించుకోలేదు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారిని గమ్యస్థానాలకు చేర్చడం వంటి అనేక సహాయక చర్యలు జరగడం లేదని మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన తరువాతే కేంద్రం అప్రమత్తమైంది. 
 
రాహుల్ గాంధీ తన జన్మదినోత్సవాన్ని విదేశాలలో జరుపుకొన్నారు. కాని కాంగ్రెస్ వందిమాగధులు మాత్రం ఇక్కడ కేకులు కోసి, స్వీట్లు, చీరలు, దుప్పట్లు పంచి నాయకులను మెప్పించడానికి ఆల్బమ్ లలో ఫోటోలు దాచుకున్నారు. కాని వారికి వరదలలో చిక్కుకుని, చేతిలో చిల్లిగవ్వ కూడా లేక కట్టుబట్టలతో ఎ.పి. భవన్ లో ఉన్న మన రాష్ట్రానికి చెందిన వారికి అన్నపానీయాలు ఇవ్వాలన్న కనీస ధ్యాసే లేకపోయింది. 
 
అయితే అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సకాలంలో స్పందించి వరదలలో చిక్కుకున్న వారి వారి రాష్ట్రాలకు చెందిన ప్రజలకు అన్ని సహాయాలు అందించి, వారిని అక్కడి నుండి రైళ్ల ద్వారా, విమానాల ద్వారా వారి స్వంత రాష్ట్రాలకు చేరడానికి కావలసిన ఏర్పాట్లు గావించారు. కాని కాంగ్రెస్ నాయకులు వరద సహాయక చర్యలను సైతం రాజకీయం చేసి మోడీపై ఆంగ్ల మీడియాలో అసత్య ప్రచారం చేయించారు. అలాగే బాధితుల కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన విమానాల రవాణా విషయంలో కాంగ్రెస్ వారు అడ్డంకులు కల్పించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. వరద సహాయక చర్యల్లో సైతం రాజకీయాలు నెరపి, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఏహ్యభావం కలిగించారు. 
 
- పతికి