బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ లలో పీడించబడుతున్న హిందువుల సమస్యలను పరిష్కరించాలి

ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం 2013 మార్చి 15,16,17 తేదీలలో జైపూర్ లో జరిగినవి. ఈ సమావేశాలలో అఖిల భారత ప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానం

జైపూర్ లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో వేదికపై ఆసీనులైన పరమ పూజనీయ సర్ సంఘచాలక్ మా.మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ మా.భయ్యాజీ జోషి
పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లలోని హిందువులపై జరుగుచున్న నిరంతర దాడులు, అత్యాచారాల పరిణామంగా అక్కడి హిందువులు అధిక సంఖ్యలో ఎడతెగకుండా భారత్ కు శరణార్థులుగా రావటంపై అఖిల భారత ప్రతినిధి సభ తీవ్ర బాధను, విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. శరణార్థులుగా వస్తున్న నిస్సహాయ హిందువులు తమ జన్మస్థలాలలోను, భారత్ లో కూడా అత్యంత దయనీయమైన జీవితం గడపవలసిన పరిస్థితులు రావటం సిగ్గుచేటైన విషయం.

బంగ్లాదేశ్ లో ఈ మధ్య హిందువులు, బౌద్ధులపై, వారి ప్రార్థనా స్థలాలపై హిందూ విరోధులుగా, భారత్ విరోధులుగా పేరు పొందిన జమాయితే ఇస్లామీతో సహా మత విద్వేష సంస్థల ద్వారా జరుపబడిన దాడులను అఖిల భారత ప్రతినిధి సభ తీవ్రంగా ఖండిస్తున్నది. బంగ్లాదేశ్ లో ఈ దాడుల పరంపర కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నది. ఎటువంటి కారణాలు లేకుండా బంగ్లాదేశ్ లోని హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం ఆక్రమణ దాడులలో సమిధలుగా మారుతున్నారు. ఈ పాశవిక ఉన్మత్త దాడులను భరించలేక వేలాది మంది హిందువులు తమ మాన ప్రాణాలను కాపాడుకోవటానికి పారిపోయి భారత్ లో తలదాచుకొంటున్నారు. అటువంటి బంగ్లాదేశ్ హిందువులు, చక్మాలు పశ్చిమ బెంగాల్, అస్సాంలలో కొన్ని దశాబ్దాలుగా శరణార్థులుగా జీవిస్తున్నారు. బంగ్లాదేశ్ లో హింస ప్రజ్వరిల్లినప్పుడల్లా మరికొంతమంది క్రొత్తగా వచ్చి వాళ్లతో చేరుతున్నారు.

బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్న హిందువుల విషయాన్ని కూడా దేశ ప్రజలందరి దృష్టికి అఖిల భారత ప్రతినిధి సభ తీసుకొని వస్తున్నది. మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల నివేదికల ప్రకారము పాకిస్తాన్ లో ఉన్న హిందువులు పేదరికంతో, అభద్రతతో, మానవ హక్కులు కోల్పోయి దయనీయమైన జీవితం గడుపుతున్నారు. పాకిస్తాన్ లోని సిక్కులు, హిందువులపై దాడులు ఒకరకంగా చెప్పాలంటే ప్రతినిత్యం జరుగుతున్నాయి. బలవంతపు మతం మార్పిడులు, బలాత్కారాలు, ఎత్తుకపోవడం, బలవంతపు వివాహాలు, హత్యలు, ప్రార్థనా మందిరాల విధ్వంసం అక్కడి హిందువుల జీవితాలలో అంతర్భాగంగా మారిపోయాయి. పాకిస్తాన్ లోని ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా అక్కడి హిందువులను ఆదుకోవడానికి ముందుకు రాకపోవటం వల్ల అక్కడి హిందువులు భారత్ కు శరణార్థులుగా రావటం ఒక తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. 'పాకిస్తాన్ లో ఉండే హిందువులు ఏదో తప్పు చేస్తున్న కారణంగా ముస్లింల దాడులకు గురి కావడంలేదు, వారిపై జరిగే దాడులు 1947 దేశ విభజన నాటి దాడులకు కొనసాగింపే' అని భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు, మేధావులకు, సామాజిక రంగంలో పనిచేసే నాయకులకు అఖిల భారత ప్రతినిధి సభ గుర్తు చేస్తున్నది.

1947 నాడు జరిగిన వివేకహీనమైన, దు:ఖకరమైన భారతదేశ విభజనను ఆనాటి రాజకీయ నాయకత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న నిరపరాధులైన హిందువులపై రుద్దింది. ఒకే రాత్రిలో ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న హిందువుల మాతృభూమి వాళ్లది కాకుండా పరాయిదై పోయింది. ఆనాటి రాజకీయ నాయకుల అవ్యవహారం, దేశ విభజన నిర్ణయాలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని హిందువులు మూల్యం చెల్లిస్తున్నారు.

పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల పౌరులుగా ఉన్న హిందువులు, అక్కడి నుండి భారత్ కు శరణార్థులుగా వచ్చిన హిందువులకు సంబంధించిన అన్ని విషయాలను భారత ప్రభుత్వం పునర్ విచారణ చేయాలని అఖిల భారత ప్రతినిధి సభ పిలుపునిస్తున్నది. ఈ సమస్య ఆయా దేశాల అంతర్గత సమస్య అని చెప్పి భారత ప్రభుత్వం తప్పించుకోలేదు. 1950 సంవత్సరం నెహ్రూ-లియాఖత్ ఒప్పందంలో రెండు దేశాలలోని మైనార్టీలకు పూర్తి రక్షణ, పౌరసత్వపు హక్కులు కల్పించాలని స్పష్టంగా చెప్పబడింది. భారతదేశంలో ఉన్న మైనారిటీలకు పూర్తి రక్షణ, రాజ్యంగ హక్కులు మాత్రమే కాక వాళ్లను సంతృప్తి పరచటానికి ప్రత్యేక సౌకర్యాలు, హక్కులు కూడా భారత ప్రభుత్వం కల్పిస్తున్నది. భారతదేశంలోని మైనారిటీలు వాళ్ల జనాభా,  ఆర్థిక విషయాలు, విద్యా విషయాలు, సామాజిక గౌరవం విషయాలలో ఒక మంచిస్థాయిలో ఉన్నారు. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న హిందూ మైనారిటీల పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న హిందువుల జనాభా కుంచించుకు పోవటం, నిరంతర దాడులు, అత్యాచారాలు, దారిద్ర్యం పెరగడం, మానవ హక్కుల నిరాకరణ మొదలైన కారణాలతో రక్షణ కోసం భారత్ కు శరణార్థులుగా వలసలు రావటం నిత్యకృత్యమై పోయింది.

దేశ విభజన సమయంలో హిందువుల జనాభా తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో 28%, పశ్చిమ పాకిస్తాన్ (పాకిస్తాన్) లో 11%  ఉండేది. నాడు భారత్ లో ముస్లింలు 8% ఉన్నారు. ఈ రోజున అక్కడి హిందువుల సంఖ్య తగ్గిపోయింది. బంగ్లాదేశ్ లో హిందువులు 10%, పాకిస్తాన్ లో హిందూ మైనార్టీలు 2% మాత్రమే మిగిలారు. అదే భారత్ లో ముస్లిం మైనారిటీలు 8% నుండి 14% కి పెరిగారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు దేశ విభజన సమయంలో చేసుకొన్న నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆయా దేశాలను నిలదీయటం మన ప్రభుత్వం యొక్క విస్మరించలేని కర్తవ్యమని అఖిల భారత ప్రతినిధి సభ పూర్తిగా, స్పష్టంగా అభిప్రాయపడుతున్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీలుగా ఉన్న లక్షలాదిమంది జాడ లేకపోవటం ఆయా దేశాల అంతర్గత సార్వభౌమత్వ విషయమని ఉపేక్షించ వీల్లేదు. ఆ దేశాల నుండి రక్షణ కోసం భారత్ కు పారిపోయి వస్తున్న హిందూ శరణార్థుల విషయమై పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను బోనులో నిలబెట్టవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది. భారతదేశం నుండి అభద్రతతో ఒక్క వ్యక్తి కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు పారిపోలేదు. కాని అదే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల నుండి లక్షలాది మంది శరణార్థులుగా భారత్ కు చేరుకొంటున్నారు. ఈ హృదయ విదారకర దృశ్యాలను చూసి ప్రతినిధి సభ చలించిపోతున్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉండే హిందువుల విషయంలో ఒక క్రొత్త విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో అనేక దేశాలలో ఉండే హిందువుల పరిస్థితులకు  - పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉండే హిందువుల పరిస్థితులకు పోలికే లేదు. ఎన్నో దుర్భర పరిస్థితులను ఆ రెండు దేశాలలో మాత్రమే ఎదుర్కొంటున్నారు.

భారత ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు చేపట్టాలి 
  1. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న మైనారిటీలైన హిందువుల రక్షణకై అక్కడి ప్రభుత్వాలపై వత్తిడి తేవాలి.
  2. జాతీయ శరణార్థి, పునరావాస విధానాలను రూపొందించి ఆ రెండు దేశాల నుండి వస్తున్న హిందువులు గౌరవప్రద జీవనాన్ని గడపడానికి కావలసిన ఏర్పాట్లు భారత ప్రభుత్వము చేయాలి. సంపూర్ణ భద్రతతో, గౌరవంగా తమ దేశాలకు తిరిగి వెళ్లే పరిస్థితులు నిర్మాణమయ్యే వరకు ఈ వ్యవస్థ కొనసాగాలి.
  3. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల నుండి అక్కడి హిందువులు శరణార్థులుగా భారత్ కు వస్తున్నందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి నష్టపరిహారాన్ని డిమాండ్ చేయాలి.
  4. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉన్న హిందువులు మరియు ఇతర మైనారిటీలు రక్షణతో, గౌరవప్రదమైన జీవనం గడపడం కోసం ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంఘాలు తమ అధికారాలను సక్రమంగా ఉపయోగించేందుకు డిమాండ్ చేయాలి.
శరణార్థులుగా వస్తున్నవారు కేవలం హిందువులయినందువలననే భారత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత ప్రతినిధి సభ ప్రకటించవలసి వస్తున్నది. మన ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని, ఉదాసీన వైఖరిని నిలదీయటానికి దేశ ప్రజలందరు ముందుకు రావాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అమానుష కృత్యాలకు గురవుతున్న హిందువుల యొక్క మరియు అక్కడి బాధలకు తట్టుకోలేక శరణార్థులుగా భారత్ కు వస్తున్న హిందువుల యొక్క భద్రత, హక్కులు కాపాడటానికి యావత్ దేశం వారి వెనుక నిలబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అఖిల భారత ప్రతినిధి సభ పిలుపునిస్తున్నది.

పాల్గొన్న ప్రతినిధులు