హిందూ శక్తి జాగరణే విశ్వకళ్యాణానికి మూలం

ఘోష్ తరంగ్ సార్వజనిక సభలో సంఘ సర్ కార్యవాహ మాననీయ శ్రీ భయ్యాజీ జోషి సందేశం


సార్వజనిక సభ వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు. వేదికపై ఆసీనులైన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాననీయ శ్రీ భయ్యాజీ జోషి, శ్రీ ప్యాటా వెంకటేశ్వరరావు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంత 'ఘోష్ తరంగ్' పేరుతో ఫిబ్రవరి 8,9,10 తేదీలలో శారదా ధామంలో జరిగింది. ఈ శిబిరం శిబిరార్థులకు గొప్ప అనుభూతిని కలిగించింది. సందర్శకులకు ఆనందంతోపాటు ఉత్తేజాన్ని కలిగించింది. సంఘ స్వయంసేవకులలో అనుభూతిని, సంస్కారాన్ని కలిగించే ఉద్దేశంతో ఘోష్ ప్రారంభించబడింది. భారతీయ సంగీత రచనల ఆధారంగా సంఘ ఘోష్ రచనలు, వాయిద్యాలు, వాదన రూపొందించబడినవి. భారతీయ సంగీతం వ్యక్తిలో జాతీయ సమైక్యతా స్వరాలు పలికించడానికి అద్భుత సాధనం. వివేకానంద స్వామి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ శిబిరం నిర్వహించడం మరింత వన్నెను తెచ్చిపెట్టింది.

సంఘకార్యం జగత్కళ్యాణ కార్యం : ముఖ్య అతిథి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి

శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి

'ఈ ఘోష్ తరంగ్ దృశ్యాలు అత్యద్భుతం, అపాత మధురం. ఇలాంటి ప్రదర్శన దృశ్యాలు నేను చాలా చూశాను. బయటివాటికంటే ఇది చాలా ఉన్నతమైనది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న స్వయంసేవకులు వృత్తి కళాకారులు కారు, వారికి అదే జీవితమూ కాదు, జీవనోపాధి కాదరు. వీరంతా వివిధ వృత్తులు, ప్రవృత్తులకు సంబంధించినవారు. ఈనాడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆలోచన భారతదేశాన్నే కాక అఖిల విశ్వపథాన్నే మార్చింది. వ్యక్తి సమాజముల అనుసంధానం జరగాలి. వ్యక్తి జీవితం సమాజార్పితం కావాలి. ఇది సంఘ చింతన, ఇదే భారతీయత, ఇదే మానవీయత, జాతీయత, అంతర్జాతీయత, విశ్వజనీనత. సంఘ కార్యం జగత్కళ్యాణ కార్యం. స్వయంసేవకుల సాధన భారతమాత ఆరాధన. నా బాల్యం సంఘంలోనే వికసించింది. ఎందరెందరో సంఘ పెద్దలు, మహనీయులందరిని స్మరిస్తూ, శిరసువంచి ధ్వజప్రణామ్ చేస్తూ ప్రణామ్ చేస్తూ ప్రసంగం ముగిస్తున్నాను.

ప్రధాన వక్త భయ్యాజీ జోషి మార్గదర్శనం :

శ్రీ భయ్యాజీ జోషి
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్ కార్యవాహ శ్రీ సురేష్ జోషి (భయ్యాజీగా అందరిచేత ఆత్మీయంగా పిలువబడతారు) మూడు రోజుల పాటు శిబిరంలో ఉండి మార్గదర్శనం చేశారు. సార్వజనిక ఉత్సవంలో ప్రధాన వక్తగా వారు ప్రసంగించారు. వారి ప్రసంగం సంక్షిప్తంగా...

సజ్జనశక్తి జాగరణ : 
మన సమాజంలో వివిధ జీవన రంగాల సమష్టి కృషి ద్వారా జీవన మూల్యాలు పరిరక్షించబడాల్సి ఉంది. దానికి సజ్జనశక్తి జాగరణ, సజ్జన శక్తి సంఘటన అత్యవసరం. ఇక్కడ ఎందరో కళాతపస్వులైన, విశ్వవిఖ్యాతులైన సాధకులు ఆసీనులయ్యారు. వీరంతా సంస్కారయుతమైన సమాజాన్ని కోరుకుంటున్నారు. దానికోసం భారతీయ విలువలతో కూడిన విద్య రావాలి. అప్పుడే దేశోత్థానం, దేశోద్ధరణ జరుగుతుంది. సజ్జనశక్తి జాగరణ సంఘటన ద్వారానే సాధ్యం. స్వామి వివేకానంద చెప్పినట్లు 'గర్వసే కహో హమ్ హిందూ హై' అని ప్రతిధ్వనించాలి. హిందూ శక్తి దేశోన్నతి కోసం, విశ్వోన్నతి కోసం. మన చింతన శ్రేష్ఠమైన చింతన. విశ్వకళ్యాణం దీనికి మూలం. ఎవరో కొందరి ద్వరా మాత్రమే కాదు, అనేకమంది మహనీయుల అనేక రకాల కార్యాల సమష్టి కృషి ఆధారంగానే ఇది సాధ్యం. అందుకే ఆ దిశలో మనందరం కృషి చేద్దాం.