దేశంలో మార్పు కోసం కృషి చేద్దాం

ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పిలుపు
 
వేదికపై ప్రసంగిస్తున్న పూజనీయ శ్రీ మోహన్ భాగవత్

గత సంచిక తరువాయి

పూజనీయ సరసంఘచాలక్ మా.మోహన్ జీ భాగవత్ ప్రసంగ పాఠం సంక్షిప్తంగా...

కాలానుగుణమైన స్వదేశీయ వికాస మార్గం

దేశీయ పరంపర, వేలయేళ్ల జీవనానుభవం, పర్యావరణము, వనరులు, సాధారణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ప్రాథమ్యాలు మొదలగు వాటినన్నింటిని మన ఆలోచనా విధానానికి బయట దూరంగా ఉంచటం జరుగుతున్నది. స్వదేశీయ వికాసానికి విదేశీయ వికాసపు కొలమానాలను అనుసరించడం జరుగుచున్నది. విదేశీ అనుకరణ ఉరుకులాట సాగుచున్నది. వోట్ల-నోట్ల స్వార్థం, అహంకారం పరుగులిడుతున్నది. వికాసం పేరుతో వినాశనానికి దారితీసే విధానాలను అనుసరిస్తున్నారు. తత్ఫలితంగా ఎంతటి భయంకర విపత్తులు సంభవిస్తాయో ఉత్తరాంచల్ భయంకర విపత్తును కళ్లారా చూశాం. ఆధునిక సాంకేతికత, ప్రపంచంలో ప్రచారమందున్న ఆర్థిక వ్యవస్థలు, మతవాదము వంటి గుణదోషాలు, మంచి చెడ్డలు సమ్యక్ దృష్టితో ఆలోచించాలి. మనదైన ఆలోచనల ఆధారంగా కాలానుగుణమైన స్వదేశీయ వికాస విధానాన్ని రూపొందించుకోవాలి. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అంతిమ వ్యక్తికి చేరాలి; స్వావలంబన ఉపాధి గుణాత్మకతను సృష్టించే విధానాన్ని అనుసరించాలి. సమాజంలో సమతాయుక్త, శోషణయుక్త, నైతికతాయుక్త వాతావరణం నిర్మాణమయ్యే విధానం రావాలి. ఇటువంటి వికాసక్రమాన్ని మనం సాకారం చేసుకోగలగాలి. ఈ సత్యసమ్మతి విధానాన్ని వ్యతిరేకించడం జాతీయ జీవన స్వాస్థ్యానికి గొడ్డలిపెట్టు వంటిదవుతుంది. అందరమూ వీటిని బాగా ఆలోచించాలి, ఈ ఆలోచనా విధానంపై ప్రతి ఒక్కరం దృఢంగా నిలబడాలి. మన విధానాలన్నీ సవ్యమయిన దిశలో సాగిపోయేలా చూద్దాం.

విద్యారంగము
 

ఈనాటి మన విద్యారంగం పూర్తిగా వ్యాపారమైపోయింది. దీనిలో మౌలికమైన మార్పును తేవటం అత్యవసరం. ఎందుకనగా ఈ విద్యావిధానం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. దీనిలో గుణాత్మకత, సంస్కారక్షమత పూర్తిగా లోపించినవి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం. స్వదేశీయ విద్యారంగాన్ని పూర్తిగా తగ్గించివేసి విదేశీయ విద్యాసంస్థలకు ఎర్రతివాచీ పరచి ఆహ్వానిస్తున్నారు. విద్యారంగాన్ని పూర్తిగా విదేశీయుల చేతిలో పెట్టే విధానం రాజ్యమేలుతున్నది. విద్య దేశాన్ని వైభవోపేతం గావించడానికి నవతరాన్ని సంసిద్ధం చేయాల్ని ఉండగా, దానిని అంతర్జాతీయ వ్యాపార వస్తువుగా, ధనసంపాదనా మార్గంగా ఎంచుకొని ఒక కొంగ్రొత్త మార్కెటును సృష్టిస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు పెనుముప్పును కలిగించి అంధకారంలోకి నెడుతుంది. దీనికి సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా విద్యారంగం దిశాదర్శనములో కనిపించడం లేదు. దేశమంతటా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నవి. దీనికి ప్రధాన కారణము సంస్కారము లోపించడమే కదా! విద్యారంగము దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మన రాబోవు తరాలలో నైతిక విలువలతో కూడిన సంస్కారాలను అందించుటకు విద్య ఒక ప్రముఖ సాధనం.

కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం 
 

దానికంటే ముందు మరింత ప్రాధాన్యం వహించే మరో ప్రముఖ సాధనం మన కుటుంబ వ్యవస్థ. నూతన తరానికి శిశుప్రాయం నుండే చక్కని సంస్కారాల నందించే చక్కని వ్యవస్థ మన హిందూ సమాజంలోని కుటుంబ వ్యవస్థ. మన కుటుంబ వ్యవస్థయే మన సమాజాన్ని కలిపి ఉంచుతున్నది. బలోపేతం గావిస్తున్నది. ఈ మన కుటుంబ వ్యవస్థను చూసి విదేశీయులు అనేకులు అధ్యయనం చేస్తున్నారు. మన కుటుంబ వ్యవస్థను అనుసరించాలని విదేశాలన్నీ కోరుకుంటున్నాయి. ఈ మన ప్రాచీన కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ఆధునికులకు అర్థం కాదు. మన పాలకులు అనావశ్యకమయిన చట్టాలను తెస్తూ మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారు. తత్ఫలితంగా కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ఆత్మీయత - అనుబంధము దెబ్బతింటున్నాయి. వ్యక్తుల మధ్యలో ఉండే అనుబంధాలను కూడా ఆర్థిక వ్యాపార వస్తువుగా మార్చివేస్తున్నారు. చట్టాల వెనుక కుటుంబ వ్యవస్థను పటిష్టపరచడం, అందరూ సంపాదించడం అనే సదుద్దేశ్యాలు ఉండటం మంచిదే కావచ్చు. ఐతే మన ప్రాచీన కుటుంబ వ్యవస్థలోనే చేతనయిన వారందరి చేతికి పని కల్పించడం, చేతగాని వారిని పోషించడమనే వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. దీనివలన యావత్ సమాజంలో సామాజిక భద్రత, సామాజిక ప్రగతి సాధ్యమయినవి. కుటుంబం యొక్క పాత్ర ఈ దృష్ట్యా చాలా కీలకమయినది. అందువలన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం నేడు అత్యవసరం.

యువత పాత్ర

- తరువాయి వచ్చే సంచికలో...