వనవాసుల సేవకుడు బాలాసాహెబ్ దేశ్ పాండే

స్వర్గీయ బాలాసాహెబ్ దేశ్ పాండేజీ శతజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం 
 
 
వన్యప్రాంతాలలోని వనవాసుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు స్వర్గీయ బాలాసాహెబ్ దేశ్ పాండే. జస్పూర్ నగర ప్రాంతంలో ఆనాడు క్రైస్తవ మిషనరీల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. అవి స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజులు. ఆనాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పండిట్ రవిశంకర్ శుక్లా ఒకసారి జస్పూర్ పర్యటనకు వెళితే ఆ ప్రాంతంలోని గిరిజనులు ముఖ్యమంత్రికి నల్లజెండాలతో స్వాగతం చెప్పి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అది చూసి నివ్వెరపోయిన రవిశంకర్ శుక్లాకు స్థానికులు అక్కడ క్రైస్తవ మిషనరీలు సేవ పేరుతో ఆ ప్రాంతాన్ని కబ్జా చేసి అక్కడి గిరిజనులందరినీ మతం మార్చి వారి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు చెప్పారు.

అప్పుడు రవిశంకర్ శుక్లా వెంటనే అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలని నిశ్చయించుకొని ఆనాటి ప్రముఖ గాంధేయవాది అయిన ఠక్కర్ బాప్పాతో ఈ విషయాన్ని చర్చించారు. అప్పటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వితీయ సర్ సంఘ్ చాలక్ అయిన శ్రీ గురూజీ కూడా సమస్యను అర్థం చేసుకొని అప్పటికే సంఘంలో ఒక మంచి కార్యకర్తగా ఉన్న బాలాసాహెబ్ జీని ఆ ప్రాంతానికి వెళ్లి వనవాసుల కొరకు పని చేయమని ప్రోత్సహించారు. ఆ విధంగా బాలాసాహెబ్ జీ జస్పూర్ చేరుకున్నారు. నాటి నుంచి బాలాసాహెబ్ జీకి వనవాసుల సర్వాంగీణ వికాసమే తన జీవన వ్రతంగా మారింది.

  • బాలాసాహెబ్ దేశ్ పాండేగా పిలువబడిన రమాకాంత్ కేశవ్ దేశ్ పాండే ఒక మధ్యతరగతి కుటుంబంలో 26 డిశంబర్ 1913న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. బాలాసాహెబ్ కాశీ హిందూ విద్యాపీఠం నుంచి మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. 1930లో ఈయనకు డాక్టర్జీతో పరిచయం ఏర్పడింది.  అప్పటి చిన్ననాటి నుండే సంఘశాఖలో శిక్షణ పొందారు. సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహించారు.

ఆర్థిక సమస్యల వలన ఉద్యోగంలో చేరినా అక్కడ అధర్మమూ, అవినీతి చూసి వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసారు. విలువల విషయంలో ఆయన జీవితంలో ఏనాడూ రాజీ పడలేదు. ఆ కారణంగా అనేక ఇబ్బందులు ఎదురైనా అన్నిటినీ తట్టుకున్నారు.

జస్పూర్ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో కార్యం కోసం శ్రీ గురూజీ, ముఖ్యమంత్రి శ్రీ రవిశంకర్ శుక్లా ఇద్దరూ బాలాసాహెబ్ జీనే ఎంచుకున్నారు. జస్పూర్ లో ప్రభుత్వ ప్రాంతీయ అధికారిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఠక్కర్ బాప్పాతో జస్పూర్ ప్రాంతంలో ఒక ఏడాది లోపల వంద ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభిస్తానని వాగ్దానం చేసారు. అనుకున్నట్లుగానే అక్కడ ఏడాది లోగా వంద పాఠశాలలు పెట్టి అక్కడి గిరిజనులలో చక్కటి మార్పు తెచ్చారు. అయితే అవి అంత సులభంగా సాధ్యం కాలేదు. అనేక కష్టాలు ఎదురయ్యాయి. అయినా ఓర్పు, సాహసం, పట్టుదలతో అన్నిటినీ సహించి అక్కడి గిరిజనులలో దేశభక్తిని నింపారు. ప్రాంతీయ అధికారిగా బాలాసాహెబ్ ఆ క్షేత్రంలో గిరిజనులను అన్ని విధాలా జాగృత పరిచారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి పథకాలకు సంబంధించి ఫిలిమ్ ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. పర్యాటక వాహనాలు ఏర్పాటు చేసారు. సంచార వైద్యశాలలు ఏర్పాటు చేసారు. వయోజన విద్యకు అవకాశం కల్పించారు.

దురదృష్టవశాత్తు 1951లో ఠక్కర్ బాప్పా మరణించారు. అనంతరం కాంగ్రెస్ పాలకులు క్రైస్తవుల ఓట్ల కోసం వారిని సంతోష పెట్టేందుకు గాను బాలాసాహెబ్ జీని మహారాష్ట్ర ప్రాంతానికి బదిలీ చేసారు.  అది చూసి బాలాసాహెబ్ జీ గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని  అర్థం చేసుకొని వెంటనే తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని గిరిజనుల సేవకే ఇస్తూ 1952లో వనవాసీ కళ్యాణ ఆశ్రమాన్ని అదే జస్పూర్ లో స్థాపించారు. ఈ కార్యంలో ఆయనకు ఆర్.ఎస్.ఎస్. జ్యేష్ఠ కార్యకర్త మెమోభావూ కేల్కర్ సహాయపడ్డారు. అలాగే జస్పూర్ మహారాజు విజయ్ భూషణ్ సింగ్ దేవ్ అండదండలు కూడా లభించాయి.

ఆ తరువాత కళ్యాణాశ్రమం క్రమేపీ దేశమంతటా విస్తరిస్తూ కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి.

ప్రజలలో ముఖ్యంగా గిరిజనులలో భక్తి భావనను పెంచేందుకు కళ్యాణాశ్రమం ఆధ్వర్యంలో విష్ణు మహాయాగం జరిపారు. దానిక్కావలసిన సదుపాయాలన్నీ గిరిజనులే అందచేసారు. ఆ యాగం ఎంతో విజయవంతమైంది. తరువాత 1954లో ప్రయాగ కుంభమేళాకు జస్పూర్ రాజు స్వయంగా వనవాసులను తీసుకుని బయల్దేరారు. ఆ కుంభమేళా సందర్భంగా గిరిజనులంతా చాలా శ్రద్ధగా పాల్గొన్నారు. ఆ అవకాశానికి సంతోషించారు.

ఈ విధంగా వనవాసుల సంక్షేమం కోసమే తన జీవితమంతా వెచ్చిస్తూ వారికే తన సర్వస్వం అంకితం చేసి వారి కోసమే జీవించిన బాలాసాహెబ్ జీ 21 ఏప్రిల్ 1955న కన్నుమూసారు.

ఈనాడు దేశం మొత్తం కళ్యాణాశ్రమం ఇంతగా విస్తరించడానికి తొలినాళ్లలో శ్రీ బాలాసాహెబ్ జీ ఇచ్చిన సమయం, యోజన చాలా బలమైన పునాదులు అయ్యాయి.

వనవాసుల సర్వాంగీణ వికాసమే తన తపస్సుగా మార్చుకున్న ‘వనయోగి’ బాలాసాహెబ్ జీ. వనవాసీ సమాజం ఆయన సేవను ఎన్నటికీ విస్మరించలేని ప్రాత:స్మరణీయుడు శ్రీ బాలాసాహెబ్ దేశ్ పాండే.

- శివల పద్మ