నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్ధతకు పట్టం కట్టిన భారతీయ ఓటర్లు

15వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోది

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశ ప్రజలు ఎంతో విజ్ఞత కలిగినవాళ్లు. ఇందిరాగాంధీని ఎంతో అభిమానించిన ప్రజలే ఆమె ఎమర్జెన్సీ విధిస్తే ఆ తదుపరి ఎన్నికలలో ఇందిరాగాంధీతో సహా కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఇందిరాగాంధీని హత్య చేసిన సమయంలో జరిగిన ఎన్నికలలో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీని గెలిపించారు. ఆ సమయంలో 417 పార్లమెంట్ స్థానాలతో అత్యధిక మెజారిటీని చేకూర్చారు. అదే రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఓడించారు. అప్పటినుంచి భారతదేశంలో సంకీర్ణరాజ్య వ్యవస్థ ప్రారంభమైంది. సంకీర్ణ వ్యవస్థతో పనిలేని విధంగా నిన్నటి 16వ లోక్ సభ ఎన్నికలలో ఒకేపార్టీకి పార్లమెంట్ లో అవసరమైన సంఖ్యాబలాన్నిచ్చి పాలన అప్పగించారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు.  

ఇందిరాగాంధీ సమయంలో భారతదేశంలో పాలనాపరంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజలను ఆకట్టుకొనేందుకు అనేక ప్రజాకర్షక పథకాలు ఆ సమయంలో ప్రారంభించారు. దానితో లబ్ది పొందేందుకు యత్నం చేశారు. రాజీవ్ గాంధీ సమయం నుండి ఆర్థిక కుంభకోణాల పరంపర ప్రారంభమైంది. అవి యుపిఏ-2 పాలనలో పరాకాష్టకు చేరాయి. ప్రజలు చాలా విసిగిపోయారు. ఈ ప్రభుత్వం మారాలని ప్రజలు నిర్ణయించుకొన్నారు. ఈ సారి జరిగిన ఎన్నికలలో విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు చేయబడ్డాయి. యుపిఎ ప్రభుత్వం వచ్చిననాటి నుండి మైనార్టీలను దగ్గర చేసుకొనేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. సచార్ కమిటీ నుంచి కమ్యూనల్ వయొలెన్స్ బిల్ వరకు అనేక ప్రయత్నాలు చేసారు. ఇవన్నీ ప్రజల దృష్టికి వెళ్లాయి. దానితో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకొన్నారు. ఇంకొకప్రక్క ప్రాంతీయ పార్టీలు తమ ప్రాబల్యం పెంచుకొని కేంద్రప్రభుత్వాన్ని తమ అదుపులో ఉంచుకొనే ప్రయత్నాలు జరిగాయి. ఇవి అన్ని కలగలసిన ఈ ప్రభుత్వం మార్పుకు ప్రజలు నిర్ణయం తీసుకొన్నారు. 

నిన్నటి పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్రమోదీ ఒక ప్రముఖమైన పాలనాదక్షుడిగా ప్రజలు గుర్తించారు. నరేంద్రమోదీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షించారు. దేశంలో ప్రముఖ వ్యక్తులు, స్వామీజీలు, అనేక సంస్థలు "దేశంలో మంచి పరిపాలన రావాలి, దానికోసం ప్రజలు అందరూ ఓటు వేయాలి" అనే విషయంలో విశేషంగా ప్రచారం చేశారు. రవిశంకర్ గురూజీ, రాందేవ్ బాబా వంటి ప్రముఖ స్వామీజీలు ప్రయత్నించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక్ మాననీయ మోహన్ భాగవత్ విజయదశమి ఉత్సవ సందర్భంగా నాగపూర్ కార్యక్రమంలో దేశంలో అర్హులైన అందరు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలని, ఓటర్ల జాబితాలో ఉన్న అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 18-25 సంవత్సరాల మధ్య ఉన్నవారు అందులో మొదటిసారి ఓటు వేసినవాళ్లు అందరూ తమ భవిష్యత్తుకు విశ్వాసం కల్పించిన వారికే ఓటు వేయాలని నిర్ణయించుకొన్నారు. దీనికి తోడుగా మోదీ ప్రజలలో విశ్వాసం నిర్మాణం చేసారు. బహుశా ప్రజల ఆకాంక్షలకు మోదీ విశ్వాసం కలిగించారు. దాని కారణంగా మోదీ అత్యధిక మెజార్టీతో గెలిచారు. భారతీయ జనతాపార్టీ కూడా సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. పాలనా పగ్గాలు స్వీకరించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి విజయం ఇదే మొదటిసారి. బిజెపి పార్టీకి 282 సీట్లు వచ్చాయి. ఎన్.డి.ఎ.కు మొత్తం 336 లోక్ సభ స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అటువంటి తిరుగులేని మెజారిటీని ప్రజలు బిజెపికి ప్రజలు కట్టబెట్టారు. 


ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నరేంద్రమోదీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగింది. పార్లమెంట్ ప్రవేశద్వారం దగ్గర మెట్లకు తల వంచి నమస్కరించి, ఎంతో భావోద్వేగంతో పార్లమెంట్ హాల్ లో ప్రవేశించారు నరేంద్రమోదీ. ఈ సందర్భంగా నరేంద్రమోదీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. 
  1. 'మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన శక్తిని చూడండి. ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ నిలబడ్డాడు. ఇది మన ప్రజాస్వామిక శక్తి. మనం కూర్చున్న ఈ చోటు ప్రజాస్వామ్య దేవాలయం. మనం ఈ మందిరంలో కూర్చుని పదవి కోసం కాకుండా పూర్తి పవిత్రతతో 125 కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చటం కోసం పనిచేయాలి.'
  2. 'ఈ ప్రభుత్వం ఎవరి కోసం అంటే నేను ఒక్కటే స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఈ ప్రభుత్వం పేదల కోసం ఆలోచించాలి. పేదల మాటలు వినాలి. పేదల కోసం జీవించాలి, దళితులు, వంచితుల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతుంది. వారికే తొలి ప్రాధాన్యత' అని నరేంద్రమోదీ చెప్పారు. 
ఈసారి జరిగిన ఎన్నికలలో పార్లమెంటుకు 61 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికైన వారిలో 71 మంది 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు. 235 మంది 55 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఉన్నారు. మొత్తం సభ్యులలో 27% మంది వ్యవసాయమే వృత్తిగా ఉన్నవారు ఎన్నికయ్యారు. 

ఈ 16వ పార్లమెంట్ దేశాభివృద్ధికి, ఈ దేశ సార్వభౌమత్వ సంరక్షణకు, ఈ దేశ ప్రజలు ప్రపంచంలో సగర్వంగా తల ఎత్తుకుని తిరిగేవిధంగా ప్రజల కోసం, దేశం కోసం పని చేస్తుందని ఆశిద్దాం.  

- రాము