భారత్ లో ప్రజాస్వామ్య ప్రారంభ వికాసాలు

ఎన్నికల వేళ - 2014 - భాగం 4
 
 
ఆంగ్లేయుల ఆక్రమణ సమయంలో భారత దేశంలో పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనలో సంస్థానాలు, రాజులు, రాజ్యాలు కొనసాగినప్పటికి స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఆ సంస్థానాలన్నీ పాలనాపరంగా భారత రిపబ్లిక్ లో సంపూర్ణంగా విలీనమైనాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ - పార్టీలు క్రమంగా దేశంలో ప్రారంభం కావడం మొదలైంది.

1885వ సంవత్సరం కాం్రగెసు సంస్థ ప్రారంభమైంది. కాంగ్రెసు వేదికగా అందరూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. తిలక్ నాయకత్వం నుండి స్వాతంత్ర్య దు్యమం ఊపందుకున్నది. అన్ని రకాల సిద్ధాంతాల వాళ్లు కాంగ్రెసు వేదికగా 1920 సంవత్సరం వరకు పాల్గొన్నారు. కాంగ్రెసు సంస్థ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ సంస్థను రాజకీయ పార్టీగా మార్చే ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమైందో, ఆ సమయంలోనే వివిధ సిద్ధాంతాల వాళ్లు దాని నుండి బయటపడటం ప్రారంభించారు. డా.కేశవరావు బలిరామ్ హెడ్గేవారు కూడా 1920 తరువాత కాంగ్రెసు నుండి బయటికి వచ్చి 1925లో ఆర్.ఎస్.ఎస్.ను ప్రారంభించి రాజకీయాలతో సంబంధం లేకుండా పని చేసుకుంటూ వచ్చారు.

పాశ్చాత్య దేశాలలో సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం నినాదంగా ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. రష్యా, చైనాలో మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిస్టు సిద్ధాంతం పాలన ప్రారంభమైంది. ఫ్రాన్స్, రష్యా, చైనాలలో వచ్చిన సాయుధ విప్లవాల ప్రభావం భారతదేశంలోని మేధావులపై పడింది. భారతదేశంలో కూడా సాయుధ విప్లవం సృష్టించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. సోషలిజం ప్రభావంతో సోషలిస్టు గ్రూపులు కూడా ప్రారంభమైనాయి. 1857లో అంతమైన తమ ప్రాబల్యాన్ని తిరిగి సాధించుకొనేందుకు ముస్లిం లీగ్ పార్టీ కూడా ప్రారంభమైంది. హిందూ మహాసభ కూడా ప్రారంభమైంది. మరోప్రక్క నిమ్నవర్గాల ప్రజల ఉన్నతి కోసము డాక్టర్ అంబేడ్కర్ కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. దళిత్ పేరుతో పార్టీలు కూడా ప్రారంభమైనాయి. స్వాతంత్ర్యం సాధించేందుకు వీరంతా ఒకప్రక్క ప్రయత్నిస్తూనే ఇంకొకప్రక్క స్వాతంత్ర్యం తరువాత ఈ సమాజంలో తమ ప్రాబల్యం ఎలా ఉండాలి అనే ప్రయత్నాలు కూడా ప్రారంభం చేసారు. దానితో ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేచింది.

ఈ సంఘర్షణలు జరుగుతున్న సమయంలో ఆర్.ఎస్.ఎస్. హిందుత్వం భారత జాతీయతగా, సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రతిపాదించి ఒక జాతిగా మనం శక్తివంతమవ్వాలని దేశవ్యాప్తంగా పనిచేయడం ప్రారంభించింది. దేశభక్తి, ధర్మనిష్ఠ, సేవాభావం ప్రాతిపదికగా రాజకీయ పార్టీలకు అతీతంగా పనిని ప్రారంభించి మంచి క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన యువకబృందాన్ని నిర్మాణం చేసుకుంటూ పోతున్నది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సాంస్కృతిక జాతీయవాదం మూలసూత్రంగా భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభమైంది. మొత్తం మీద 1920 తరువాత ఒక ప్రక్క కాంగ్రెసు, మరోప్రక్క కమ్యూనిస్టులు, ఇంకొక ప్రక్క సోషలిస్టులు, మరోప్రక్క దళిత సిద్ధాంతకర్తలు, ఇస్లాం మతప్రాబల్యం కోసం ముస్లిం లీగ్ పనిచేయడం ప్రారంభమైంది. దీనితో ఇవన్నీ కలిసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని నిరోధించేందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

కాంగ్రెసులో అంతర్గత కలహాలు - పార్టీల ఆవిర్భావం : ఆ రోజుల్లో కాంగ్రెసులో మూడు వర్గాలు ఉండేవి. రైటిస్టులు, సెంట్రలిస్టులు, లెఫ్టిస్టులు. 1948లో రైటిస్టులు కాంగ్రెసును వదలి సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసుకొన్నారు. దానిలో అనేక చీలికలు వచ్చాయి. 1959లో స్వతంత్ర పార్టీ ఏర్పడింది. 1969లో కాంగ్రెసు పార్టీ రెండుగా చీలిపోయింది. ఇందిరాగాంధీ నాయకత్వంలో మరో కాంగ్రెసు పార్టీ ఏర్పడింది. ఇందిరాగాంధీ నాయకత్వంలోని పార్టీకి సిద్ధాంతం అనేక నినాదాలు ఉండేవి. ఉదాహరణకు గరీభీ మఠావో వంటివి. ఆ రోజు నుండి కాంగ్రెసు సైద్ధాంతిక శూన్యతకు లోనయింది. ఆ శూన్యతను బర్తీ చేసుకోవటానికి సెక్యులరిజం, సోషలిజం తీసుకొన్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో దానిని మన రాజ్యాంగంలో చేర్చారు. అధికారమే పరమావధిగా కాంగ్రెసు సాగుతూ వస్తున్నది. కాంగ్రెసుకు ఆ రోజుల్లో ప్రధాన ప్రత్యర్థి కమ్యూనిస్టులే. ఆ కమ్యూనిస్టులు కూడా రకరకాల చీలికలు పేలికలైనారు. చైనాలాంటి పెద్ద దేశంలో వచ్చిన సాయుధ విప్లవం స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ కూడా నక్సలిజం పుట్టుకొచ్చింది. భాసా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కేరళ, తమిళనాడుల్లో కొద్ది ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం సాగింది. పంజాబులో శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా ప్రారంభమైంది. ఇట్లా దేశంలో కాలక్రమేణా కూటములుగా ఏర్పడటం కూడా ప్రారంభమైంది. సిద్ధాంతాలను గాలికి వదిలేసి వ్యక్తులు కేంద్రంగా, అధికారమే పరమావధిగా ఈ రోజుల్లో పార్టీలు రూపుదిద్దుకొన్నాయి. ప్రాంతీయ పార్టీలు కలిసి స్వతంత్రంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు. ఏర్పాటు చేసే జాతీయ పార్టీలను సరిగా పనిచేయనివ్వని సంకీర్ణ వ్యవస్త వచ్చింది. ఈ రోజున అది కొనసాగుతున్నది. దేశంలో అయోధ్య ఉద్యమ సమయంలో సైద్ధాంతిక ప్రభావం చాలా ఎక్కువగా కనబడింది. ఆ తదుపరి ఆ దృశ్యం మారింది. మళ్ళీ ఈ రోజున కొద్దిగా సైద్ధాంతిక దృక్పథం కనబడుతున్నది. ఈ సమయంలో సామాన్య ప్రజలను జాగీతపరచి దేశంలో ఒక మంచి మార్పును తీసుకురావటానికి సంకల్పం చేయాలి. దేశంలో నడుస్తున్న సైద్ధాంతిక సంఘర్షణలకు త్వరలోనే తెరపడేందుకు కృషి చేయడం మనందరి కర్తవ్యం.
 
- రాము