రాజకీయాల నుండి నేరచరితులు తప్పుకోవాలి

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయనామ సంవత్సరం, ఆశ్వయుజమాసం

రెండేళ్లు లేదా అంతకుమించి జైలుశిక్ష పడే అవకాశం ఉన్న నేరాలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ప్రజాప్రతినిధుల పాత్ర రుజువైతే వారి పదవిపై వేటు పడుతుందని, వారు ఆ పదవికి అనర్హులు అవుతారని సుప్రీంకోర్టు జూలై 10న తీర్పు ఇవ్వడం జరిగింది. దానిపై సెప్టెంబర్ 24నాడు కేంద్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను ఆమోదించింది. ఎవరైనా ప్రజాప్రతినిధిపై వచ్చిన కోర్టు తీర్పును సవాలు చేస్తూ 90 రోజుల వ్యవధిలో అప్పీలు చేసి స్టే తెచ్చుకుంటే సదరు ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు పడకుండా ఉండే అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ చేసింది. దీనిపై అన్ని పార్టీలు లోపాయికారీగా ఒప్పుకొన్నట్లుగా ఉంది. రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ పై చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ పై లేవనెత్తిన ప్రశ్నలు కేంద్రప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. దానితో కేంద్రం వెనక్కు తగ్గి బిల్లును వెనక్కు తీసుకొంది. ఇదొక మంచి పరిణామం. 

స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల నుండి అవినీతి, అధికారం రెండు అంటకాగి ఉండడం జగమెరిగిన సత్యం. బోఫోర్స్ కుంభకోణం నుండి 2జి స్కామ్ వరకు అనేక కుంభకోణాలు దేశంలో వెలుగు చూసాయి. నేరచరితులు పాలన చేస్తున్నారు. దేశంలో పారదర్శకమైన పాలన ఒక ఎండమావిగా మారుతున్న రోజులివి. ఈ పరిస్థితులలో మార్పు తెచ్చేందుకు ప్రజలు తమ ఓటుహక్కును సక్రమంగా ఉపయోగించుకోవలసిన సమయం ఆసన్నమైంది. నేరస్తులను రాజకీయ బహిష్కరణ చేయాలి. ఈ దిశలో సుప్రీంకోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. దాన్ని అమలు చేయాలి. అక్రమ వ్యాపారులు, నేరచరితులు రాజకీయాల నుండి తప్పుకోవాలనే సంకేతం గడచిన కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఉద్యమాలలో ప్రజాగ్రహం నుండి వ్యక్తమౌతున్నది.