వివేకానందుడు ఎవరి హృదయాన్ని తడతాడో ఆ హృదయం జాగృతమవుతుంది

వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన నేషనల్ సెమినార్లో వక్తలు 
 
సెమినార్లో ప్రసంగిస్తున్న పూజ్య ప్రవరాజిక అతంద్రప్రాణ మాతాజీ
 
'స్వామి వివేకానంద ఆత్మ జాగరణ కోసం పనిచేసారు. మనమందరం ఆ భగవంతుని సంతానమని ఆయన చెప్పేవారు' అని పూజ్య ప్రవరాజిక అతంద్రప్రాణ మాతాజీ (సహ కార్యదర్శి, శ్రీ రామకృష్ణ శారదా మిషన్, కలకత్తా) ప్రసంగిస్తూ చెప్పారు. "మహిళల అభివృద్ధి-స్వామి వివేకానందుని దృష్టి" అనే అంశంపై జరిగిన జాతీయ సంగోష్టి (నేషనల్ సెమినార్) లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంగోష్టి స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా జి.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి & సైన్స్ ఫర్ ఉమెన్ మరియు స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి సంయుక్తాధ్వర్యంలో 27 సెప్టెంబర్, 2013న నిర్వహింపబడింది.

మాతాజీ ప్రసంగం : 
 
"వివేకానందుడు ఎవరి హృదయాన్ని తడతాడో ఆ హృదయం జాగృతమవుతుంది. 'నేను సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించే సంస్కరణవాదిని కాదు, మూలాలను గుర్తుచేసి వాటిని జాగృతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను, స్త్రీ పురుష భేదం గురించి నేను ఆలోచించను, మనందరం ఆ తల్లి సంతానము' అని వివేకానంద చెప్పేవారు. మనలోని అహంకారం, ఆత్మన్యూనతలను వదిలించుకుంటే అద్భుత విజయాలు సాధించగలమనే వివేకానందుని మాటలను మాతాజీ గుర్తుచేశారు. 
 
 
సెమినార్ ప్రారంభ సమావేశానికి డా.సి.ఉమామహేశ్వరరావు (ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) అధ్యక్షత వహించారు. డా.ఇందిరా పార్థసారథి (స్వాగత సమితి అధ్యక్షులు) స్వాగతం పలికారు. ప్రొ.వసుధాకామత్ (ఉపకులపతి, ఎస్.ఎన్.డి.టి. మహిళా విశ్వవిద్యాలయం, ముంబై) కీలకోపన్యాసం చేశారు. 
 
రోజంతా జరిగిన ఈ జాతీయ సంగోష్టిలో 'హిందూ కుటుంబ వ్యవస్థ' అనే పుస్తకావిష్కరణ, 'మహిళా విద్య - మహిళల భాగస్వామ్యం' అనే అంశంపై సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో మొత్తం 42 మంది ప్రతినిధులు తమ పత్రాలను సమర్పించారు. 
 
ఈ సమావేశంలో వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షురాలు కుమారి నివేదితా భిడే పాల్గొని ప్రసంగించారు. ఈ సంగోష్టిలో ఆంధ్రప్రదేశ్ నుండి 145 మంది ప్రతినిధులు పాల్గొనగా దేశం మొత్తం నుండి 280 మంది పాల్గొన్నారు.