హిందూత్వం సంస్కృతా? లేక మతమా? తేల్చనున్న సుప్రీంకోర్టు


కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, 
  మాఘమాసం
 
‘భారతదేశ జాతీయత హిందూత్వమేనా’ అనే అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి విస్తృత చర్చ చేయబోతున్నది. ‘హిందూత్వం అంటే మతతత్వం, సెక్యులరిజం అంటే భారత జాతీయత’ అని కాంగ్రెస్ ఎప్పుడో తీర్మానించింది. అందుకే ఈ దేశానికి చెందిన ప్రతి మహాపురుషుడిని తనకు అనుకూలంగా సెక్యులర్ నాయకుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరైతే హిందూత్వం గురించి మాట్లాడతారో వారందరినీ మతతత్వవాదులుగా పేర్కొంటూ ఉంటుంది. ఈ అంశాలు ప్రధానంగా ఎన్నికల సమయంలోనే వస్తాయి. 
 
ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. హిందూత్వం పేరుతో ఎన్నికలలో పోటీ చేసిన, మాట్లాడిన వారిని మతతత్వవాదులుగా చిత్రీకరించి, ఆ ప్రచారం చట్టవిరుద్ధమైన ప్రచారంగా పరిగణించాలని కోరుతూ ఉంటారు. అందుకే మరోసారి కోర్టుకెక్కారు. 2014 జనవరి 30న ఈ అంశము మళ్ళీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకొచ్చింది. దానికి 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123లో గల సెక్షన్ 3 అంశము ఆధారంగా చర్చించబోతున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటయింది. ‘హిందూత్వం మతతత్వమా? హిందూత్వం గురించి మాట్లాడటమంటే మతాన్ని దుర్వినియోగం చేయటమేనా?’ అనే అంశాన్ని చర్చించబోతున్నది. హిందూత్వం అనేది ఉపఖండంలోని ప్రజల జీవన విధానమని, ఇది ఒక మానసిక స్థితి అని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది. తాను ఇచ్చిన తీర్పుపై మళ్ళీ పున:సమీక్ష చేయబోతున్నది. 
 
ఈసారైనా దేశంలో ఇక ముందు ఎప్పుడూ హిందుత్వంపై చర్చ లేకుండా ‘హిందూత్వం అంటే భారత జాతీయత’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తుందని ఆశిద్దాం. వేచి చూద్దాం.