కాలపరీక్షలో నిలబడిన ఆర్.ఎస్.ఎస్.

 
గడచిన 150 సంవత్సరాల కాలఖండంలో దేశంలో ప్రారంభమైన అనేక సంస్థలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని రాజకీయ పార్టీలుగా మారి దేశంలో క్రమంగా బలహీనమవుతున్నాయి. సంఘం మాత్రం 1925 నుండి క్రమంగా వికసిస్తూ దేశమంతా విస్తరించటమే కాకుండా, దేశానికి ఈ రోజున కేంద్రబిందువుగా మారింది. అందరి విశ్వాసం చూరగొంటున్నది. 'హిందుత్వమే భారత జాతీయత' అనే సత్యమే సంఘ వికాసానికి మూలకారణం. సంఘం ప్రారంభించి వచ్చే విజయదశమికి 89 సంవత్సరాలు పూర్తయి 90 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం...

గడచిన 200 సంవత్సరాల భారతదేశ చరిత్రను గమనించినట్లయితే అనేక ఆసక్తికరమైన అంశాలు మనకు కనబడతాయి. ఒకప్రక్క మొగల్ సామ్రాజ్య బలహీనం, రెండవ ప్రక్క ఐరోపాఖండం నుండి అనేక దేశాలవాళ్ళు వ్యాపారానికి భారతదేశానికి రావడం, ఫ్రెంచ్ విప్లవం పాశ్చాత్యదేశాలలో ప్రజాస్వామ్య యుగానికి తెరలేపింది. ప్రజల భాగస్వామ్యంతో పాలనావ్యవస్థ ఏర్పాటు జరిగింది. రాజులు, రాజ్యాల వ్యవస్థకు తెరదించబడింది. ఆంగ్లేయుల ప్రవేశంతో భారత్ లో అనేక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. బ్రిటిష్ వాళ్ళు భారత్ నుండి ఎంతో నేర్చుకొన్నారు. భారతదేశంలో శాశ్వతంగా ఉండాలని ఎన్నో ఎత్తుగడలు వేశారు. ఎన్నో ప్రయాసలు పడ్డారు. భారతీయులు ఎప్పుడు  ఏకాలంలోనైనా స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు ఏకైక స్థానము ఇచ్చారు, ఇస్తారు. ఏ కాలంలోనైనా సత్యం, ధర్మాలదే అంతిమ విజయం. దానిని సాధించేవరకు పోరాటము సాగుతూనే ఉంటుంది. బలిదానాలు చేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని కూడా ఆంగ్లేయులు గ్రహించారు. కాబట్టి ఈ దేశం నుండి గౌరవంగా వెళ్ళిపోయారు. కాని ఈ దేశంలో  క్రొత్త సమస్యలు సృష్టించి వెళ్లారు. భారతదేశము స్వాతంత్ర్యము వచ్చిననాటి నుండి ఆ సమస్యలతో సతమతమవుతూనే ఉన్నది. ఈ సమస్యలు ఈ దేశంలో ఒక సైద్ధాంతిక సంఘర్షణకు తెరలేపాయి.

ఆంగ్లేయులు సృష్టించిన అభూత కల్పనలు  
 1. ఆర్య-ద్రావిడ సిద్ధాంతం ఆంగ్లేయులు సృష్టించిన అభూత కల్పనలలో మౌలికమైనది. ఆర్య-ద్రావిడ సిద్ధాంతం మౌలిక లక్ష్యం 'భారతదేశం ఒక దేశం కాదు, ఇక్కడ ఒక జాతి లేదు' అని నమ్మించడం. 
 2. ఈ దేశం పేరును 'ఇండియా' అని ఉద్దేశ్యపూర్వకంగా పిలవడం ప్రారంభించారు. ఇండియా అని భారత్ లోనే పిలవడం కాదు, ప్రపంచమంతా ప్రచారం చేశారు. పాశ్చాత్య దేశాలలో ఆ పేరే స్థిరపడిపోయింది. 
 3. ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తున్న ఆర్థిక వ్యవస్థను, పాలనా వ్యవస్థను, విద్యావ్యవస్థను దెబ్బకొట్టారు. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగేది. ఆ వ్యవస్థ కుప్పకూల్చి బ్రిటిష్ వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మాణం చేయటం ప్రారంభించారు. వాళ్ళు మార్చని, మార్చలేని వ్యవస్థ ఒక్క గ్రామ వ్యవస్థ మాత్రమే. భౌగోళికంగా కూడా అనేక మార్పులు చేసుకొంటూ వచ్చారు. వీటన్నింటి ప్రభావం ఈ దేశంలోని మేధావులపై పడింది. అట్లాగే రష్యా విప్లవ ప్రభావం కూడా మన మేధావులపై పడసాగింది. దానికి అనుగుణంగా బ్రిటిష్ వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఈ దేశంలో అనేక సంస్థలు ప్రారంభమైనాయి.

ఆ సంస్థలలో పేర్కొనదగినవి 
 
 1. 1885వ సంవత్సరంలో కాంగ్రెసు వేదిక ప్రారంభమైంది. 1885 డిశంబరు 28-31 తేదీలలో మొదటి సమావేశం 72 మంది సభ్యులతో జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షులుగా సురేంద్రనాథ్ బెనర్జీ ఎన్నికైననాటి నుండి కాంగ్రెసు ప్రజాఉద్యమ సంస్థగా రూపుదిద్దుకొంది. 
 2. 1906 సంవత్సరం నవంబరు 30న సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో ముస్లింలీగ్ ఏర్పడింది. 
 3. 1920 అక్టోబరు 17న సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ అనే కమ్యూనిస్టు సంస్థ యం.యన్.రాయ్ నేతృత్వంలో ఏర్పడింది. 
 4. 1914 సంవత్సరంలో అమృతసర్ లో హిందూ మహాసభ ఏర్పడింది. ఆ తరువాత అది హరిద్వార్ కేంద్రంగా పనిచేసింది. ఈ క్రమంలో 1925 విజయదశమి పండుగ రోజున నాగపూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించబడింది.
ఈ సంస్థల నేపథ్యం :
 
కాలక్రమంలో వాటి ప్రభావం దేశంలో ఎలా ఉందో కొంత అర్థం చేసుకోవలసి ఉంది. ఈ సంస్థలలో సంఘం మినహా మిగిలినవన్నీ రాజకీయ సంస్థలుగా మారుతూ వచ్చాయి. హిందూ మహాసభ మినహా మిగతా సంస్థలు సైద్ధాంతికంగా వేరువేరుగా ఉన్నా కొన్ని విషయాలలో మాత్రం అవి ఒకటిగా కనబడతాయి. అవి ఏమిటంటే..
 
1) భారత్ ఒక దేశం కాదు, 2) ఇక్కడ ఒక జాతి అనేది లేదు.
ఇటువంటి ఏక అభిప్రాయాలు ఈ సంస్థలలో కనబడుతుంటాయి.  
 • కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం 'మనం ఇప్పుడిప్పుడే ఒకజాతిగా నిర్మాణమవుతున్నాం' అనే ఆలోచన బ్రిటిష్ వారి ఎత్తుగడలకు అనుగుణంగా ఉండేది. బ్రిటిష్ వారి ఆలోచన ప్రకారం రాజ్యాధికారం కేంద్రంగానే దేశం, జాతి ఏర్పడతాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో ఈ దేశాన్ని బ్రిటిష్ ఇండియాగా పిలిచేవారు.   
 • కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం భారత్ ఒక ఉపఖండం. ఇక్కడ అనేక జాతులున్నాయి. జాతులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయటం వారి జాగృత లక్షణంగా కమ్యూనిస్టులు భావించారు. 
 • ఇక ముస్లిం లీగ్ ఈ దేశంలో రెండే జాతులున్నాయని, ఇవి హిందూ, ముస్లిం జాతులని చెప్పేది. 
 
అలా ఈ దేశాన్ని బలహీనం చేసేందుకు ఆయా సిద్ధాంతాలు కృషి చేసాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఏర్పడింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సిద్ధాంతం ప్రకారం ఇది ఒకజాతి, ఈ దేశం హిందూదేశం. ఈ దేశంలోని హిందువులను సంఘటితం చేయాలనేది సంఘ ఉద్దేశ్యం. గడిచిన 90 సంవత్సరాలుగా సంఘం ఇదేపని చేసుకొంటూ వస్తున్నది. 
 
ఆయా సంస్థల ప్రస్తుత పరిస్థితులు  
 
కాంగ్రెస్ స్వాతంత్ర్యం అనంతరం ఒక రాజకీయ పార్టీగా అవతరించి ఈ దేశంలో తిరుగులేని శక్తిగా బలపడింది. దేశమంతా విస్తరించింది. కాని అది ఈ రోజున బలహీనపడుతున్నది. క్రమంగా తన ప్రాభవం కోల్పోతున్నది. అట్లాగే భారత కమ్యూనిస్టు పార్టీ ముక్కలు చెక్కలైంది. దానినుండి ఈ దేశ ప్రజలు చాలా దూరంగా జరిగారు. ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతం పేరుతో దేశాన్ని ముక్కలు చేసింది. ఆ తదుపరి భారత్ లో ముస్లింలీగ్ రద్దయింది. కొన్ని సంవత్సరాల తరువాత ముస్లింలీగ్ పార్టీ కేరళ కేంద్రంగా మళ్ళీ ఏర్పడి దేశంలో పనిచేస్తున్నది. హిందూ మహాసభ కూడా స్వాతంత్ర్యానంతరం బలహీనపడింది.
 
మారుతున్న కాలమాన పరిస్థితులలో మనజాతి పరంపరాగత విషయాలకు వర్తమాన పరిస్థితులకు మధ్య వారధిగా రాజకీయాలకతీతంగా పనిచేస్తున్న ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. అది ఈరోజున క్రమంగా దేశమంతా విస్తరించి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘము - హిందూ సమాజము వేరువేరు కాదు. రాబోవు రోజుల్లో హిందూసమాజం శక్తివంతమై ప్రపంచంలో శాంతిని స్థాపించాలి. సంఘము సమాజం ఒక్కటే. భవిష్యత్తులో హిందూసమాజం తనకు ఏం కావాలో తనే ఆలోచించుకోగలగాలి. అటువంటి సంఘటిత శక్తిగా ఎదగాలి. ఆ దిశలో సంఘము వేగవంతంగా పనిచేస్తున్నది.  
 
విచిత్ర పరిస్థితులలో నేటి సమాజం 
 
ఈమధ్య రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక్ మాననీయ మోహన్ భాగవత్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 'ఈ దేశంలో ఉన్నవారంతా హిందువులే' అన్నారు. మనం అందరం ఒకే జాతీయులం అన్నారు. కొందరు మేధావులు తమ స్వార్థం కోసం దీనిని వివాదాస్పదం చేసారు, చేస్తున్నారు. భారతదేశంలో వివిధ విదేశీ మతాలలోకి మారినవారు ఈదేశంలో తమ గుర్తింపును ఎట్లా నిర్వచించుకోవాలి? ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మారిన హిందువులు తమను ఏరకంగా గుర్తించుకుంటారు? మేము ముస్లింలము, మేము క్రైస్తవులం అని అంటారు. మేము భారతీయులం అంటారా? భారతీయులు అన్నా, హిందువులు అన్నా వేరువేరు అర్థాలు ఏమీ లేవు. ఒకదేశంలో ఇది భారతదేశం. ఒక సంస్కృతిగా జీవన విధంగా దీనిగుర్తింపు హిందుత్వం. ప్రపంచంలో ఇస్లాం క్రైస్తవం పుట్టక పూర్వమే కొన్నివేల సంవత్సరాల నుండి ఈ దేశంలో ఒక గొప్ప నాగరికత వికసించింది. ఒక గొప్ప సంస్కృతి వికసించింది. ఆ నాగరికతలకు, సంస్కృతులకు హిందుత్వంలోనే గుర్తింపు. హిందుత్వం అంటే మతం కాదు. ఈ దేశంలో రాజ్యాంగ నిర్మాణము జరుగుతున్న సమయంలో అనేక ఆసక్తికర చర్చలు జరిగాయి. ఈ దేశంలో బయటిదేశాల నుంచి వచ్చిన మతాలలోకి మారినవారిని రాజ్యాంగం మైనారిటీలుగా గుర్తించింది. మైనారిటీల నిర్వచనం ఏమిటి. అసలు మైనార్టీలు ఎవరు? ఇది చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో అసలైన మైనారిటీలు తమకు మైనారిటీ హక్కులు అవసరం లేదు అని చెబుతూ ఉంటే ఈ దేశంవారే బయటిదేశాల నుండి వచ్చిన మతాలలోకి మారినవారు మేము మైనారిటీలము, మాకు మైనారిటీ హక్కులు కావాలని అడగడం ఒక విచిత్రమైన పరిస్థితి. 
 
ఈ రోజున దేశంలో ఇస్లాం, క్రైస్తవంలోకి మారినవారు ఇక్కడి జాతీయులే. వాళు్ళ హిందువులేనని వాళ్ళకు గుర్తు చేయాలి. ఈ పనిని ఎవరూ చేయరు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు అటువంటి విషయాలు చెప్పనివ్వటం లేదు. తీవ్రమైన విద్వేషం, అసహనంతో ఇక్కడ బ్రతుకుతున్నవారు ఈ దేశానికి సంబంధించిన సమస్యలపై ఎలా స్పందిస్తారో ఊహించటం అంత కష్టమైన పనికాదు. ఈమధ్య ఒక వైబ్ సైట్ లో ఒక వార్త వచ్చింది. ఆ వార్తలో మనదేశంలోని ఒక ముస్లిం నాయకుడు 'భారత్ పాకిస్తాన్ పై దాడిచేస్తే ఈ దేశంలో ఉన్న 30 కోట్లమంది ముస్లింలు చూస్తూ ఊరుకోరు అని' అన్నట్లుగా వచ్చింది. ఒకవేళ అలా అని ఉంటే ఆ నాయకుడి ఉద్దేశ్యం ఏమిటి. ఈ విషయం అందరం ఆలోచించాలి.
సంఘ వికాసము
 
సంఘము మూడు లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నది
 
 1. భౌగోళిక విస్తరణ - దేశంలో అతి చిన్న గ్రామము / బస్తీ.  అక్కడి నుండి అఖిల భారత స్థాయి వరకు కార్యకర్తల వ్యవస్థ నిర్మాణం చేయటం, శాఖలను విస్తరింపచేయటం. అంటే దేశమంతా కార్యకర్తల నిర్మాణం జరగటం. అన్ని స్థాయిలలో కార్యకర్తలు ఎక్కడికక్కడ పనిచేసుకొంటూ పోవాలి. దేశమంతా కొన్ని కార్యక్రమాలు ఒకేవిధంగా ఉంటాయి. స్థానికంగా అవసరాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. 
 2. దేశప్రజలందరిలో దేశం గురించి, సంస్కృతి గురించి, ధర్మం గురించి ఒక స్పష్టమైన ఆలోచనను నిర్మాణం చేయటం, మనం హిందువులం అని జ్ఞాపకం చేయటం, సంఘటిత సమాజాన్ని నిర్మాణం చేయటం. 
 3. సమాజంలోని అన్ని రంగాలలో మనం ప్రవేశించి పనిచేసుకొంటూ పోవాలి. అన్ని రంగాలలో జనచైతన్యం నిర్మాణం కావాలి. దేశహితం గురించి ఒకేరకంగా ఆలోచించగలగాలి. ఈ పనిలో సంఘం వేగంగా ముందుకు పోతున్నది.
 
రాజకీయాలకతీతంగా సంఘం నేడు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి, అందరిని తనలో కలుపుకుపోగలిగే వెసులుబాటు, చొరవ ఉన్న సంస్థ. దేశంలో సంపూర్ణమైన పరివర్తనకై కృషి చేస్తున్నది. ఈ పని ఇంకా వేగవంతం కావాలి. 150 సంవత్సరాలకు పూర్వం దేశంలో ప్రారంభమైన సంస్థలలో కాలపరీక్షలో నిలబడి నిలకడగా ముందుకు పోతున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మాత్రమే.
 
- రాము