అభివృద్ధి అంటే ఇదీ...!


భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వచ్చినా అభివృద్ధి అనేది పెద్దగా జరగలేదనే చెప్పాలి. 1998లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం వాజపేయి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి భారతదేశంలో అభివృద్ధి అనేది పరుగులెత్తిందనేది కూడా సత్యం.

1998 నుంచి 2004 వరకు గల ఈ 7 సంవత్సరాలలో వాజపేయి ప్రభుత్వం అనేక విజయాలను ప్రజలకు అందించింది. ఆర్థిక, రక్షణ, సామాజిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించింది. అంతకుముందు కాంగ్రెస్ 51 సంవత్సరాల పాలనలో చేయలేని అభివృద్ధి ఎన్.డి.ఎ. ప్రభుత్వం కేవలం 7 సంవత్సరాలలో చేసి చూపించింది.

ఆర్థిక రంగం : ఎన్.డి.ఎ. ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగం ఉరకలెత్తింది. విదేశీమారక నిల్వలు పెరిగాయి. జిడిపి బాగా పెరిగింది. ఎటు చూసినా నూతన పరిశ్రమలు, కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. 51 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 29 వేల కిలోమీటర్ల మేర మాత్రమే జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే 7 సంవత్సరాల ఎన్.డి.ఏ. ప్రభుత్వ హయాంలో అదనంగా మరో 23 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అవీ 4లైన్, 6లైన్ హైవేలు.

గ్రామ సడక్ : ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద దేశవ్యాప్తంగా ప్రతి మారుమూల గ్రామం నుంచి దగ్గరలోని పెద్ద గ్రామం లేక పట్టణానికి రోడ్లను నిర్మించారు. దీనితో ప్రతి రైతు తాను పండించిన పంటను లాభసాటి ధరకు దగ్గరలోని పట్టణంలో స్వేచ్ఛగా అమ్ముకోవడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా రైతు జీవనస్థాయి మెరుగుపడింది. దానితో దేశ ఆర్థిక స్థాయి కూడా పెరుగుదల వైపు పరుగులెత్తింది.


సమాచార - సేవల రంగం : సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఫోన్ కోసం దరఖాస్తు పెడితే కనెక్షన్ ఇవ్వడానికి ఆరు నెలలు పట్టే దుస్థితి నుంచి టెలిఫోన్ కంపెనీ నుంచి వ్యక్తి మన ఇంటికి వచ్చి అప్పటికప్పుడు కనెక్షన్ ఇచ్చే స్థాయికి వ్యవస్థ ఎదిగింది. సెల్ ఫోన్ రావడం భారతదేశ ఆర్థిక అభవృద్ధిలో సంచలనాత్మక మార్పు. శాటిలైట్స్ ప్రయోగాలతో అనేక ప్రైవేట్ టివి చానెల్స్ రావడానికి అవకాశం ఏర్పడింది. దీనితో సమాచార ప్రసారం వేగవంతమయింది. దీనివల్ల అవినీతి తగ్గకపోయినా అవినీతికి, అన్యాయానికి పాల్పడినవారికి తప్పక శిక్షలు పడే పరిస్థితి వచ్చింది. లైవ్ టివి సంచలనాత్మక ప్రయోగం.

ఇంటింటికి గ్యాస్ పథకం క్రింద ఎన్.డి.ఏ. ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ లను సరళీకరించింది. దరఖాస్తు చేసుకొన్న 2 లేక 3 రోజులలో గ్యాస్ కనెక్షన్ మన ఇంటికి చేరే విధంగా వ్యవస్థ తీర్చిదిద్దబడింది.

అతిపెద్ద సంచలనం కంప్యూటర్ : కంప్యూటర్ అంతకుముందే భారతదేశంలో అడుగు పెట్టినా కంప్యూటర్ అభివృద్ధికి బాటలు పరిచినది ఎన్.డి.ఏ. ప్రభుత్వం. ఆర్థిక సరళీకరణను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఔట్ సోర్సింగ్ వర్క్ పెరిగి ఇక్కడ ఉద్యోగాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. జీతాలు అంతకుముందెన్నడూ లేనంతగా, దాదాపు దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసేంతగా పెరిగాయి. నేడు అనేక రకాల ప్రయాణాలలో ముందే సీటు రిజర్వు చేసుకొనే సౌకర్యం నుంచి బ్యాంకింగ్, షాపింగ్ పేమెంట్ ల వరకు కంప్యూటర్ మన నిత్యజీవితంలో ఒక భాగమైంది.

విద్యారంగంలో అనేక కొత్త కోర్సులు, అనేక రకాల ఉపాధి కల్పనకు నెలవైంది. దీనంతటికి కారణం ఎన్.డి.ఏ. ప్రభుత్వ ముందుచూపు మాత్రమేనని చెప్పవచ్చు.

రక్షణ రంగం : స్వతంత్ర భారత చరిత్రలో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన మొదటి ప్రభుత్వం ఎన్.డి.ఏ. ప్రభుత్వమని చెప్పవచ్చు. దేశరక్షణకు అవసరమైన క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణం, వాటి ప్రయోగాలకు కావలసిన పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ప్రభుత్వం రక్షణ రంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. రక్షణ రంగంలో భాగంగా దేశానికి అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ వరకు గల సరిహద్దుకు కంచె నిర్మాణాన్ని చేపట్టి గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. నాటి ఎన్.డి.ఏ. ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఈనాటి అగ్ని, నాగ్, ఆకాశ్ వంటి వేల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల నిర్మాణానికి మూలకారణం.

వ్యాపారం : ఆర్థిక సరళీకరణను సమర్థవంతంగా అమలు చేసి అంతర్జాతీయంగా అనేక దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని వ్యాపార రంగాన్ని కొత్తపుంతలు తొక్కించింది. దీనితో దేశ ఆర్థిక వృద్ధి పరుగులెత్తింది.


కార్గిల్ యుద్ధ విజయం : ఎన్.డి.ఏ. ప్రభుత్వ హయాంలో మనదేశం పొందిన అతిపెద్ద విజయం కార్గిల్ యుద్ధ విజయం. భారత సైన్యం యుద్ధరంగంలో విజయాలు సాధిస్తుంటే భారత ప్రభుత్వం దౌత్య విజయాలు సాధించింది. కార్గిల్ విజయం వాజపేయి ప్రభుత్వ పరువును, సమర్ధతను ప్రపంచవ్యాప్తంగా చాటింది. తరువాతి ఎన్నికలలో విజయఢంకాలు మోగించింది.

అణుపాటవ పరీక్షలను పరీశిలిస్తున్న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, ప్రముఖ రక్షణ రంగ నిపుణులు, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ (సర్కిల్ లో ఉన్నవారు)

అణుపాటవ పరీక్షలు : మరో అతిపెద్ద విజయం 'బుద్ధుడు మళ్ళీ నవ్వాడు' అనే పేరుతో జరిగిన అణుపాటవ పరీక్షలు. ఆ విషయాన్ని నిరంతరం ప్రపంచం మొత్తాన్ని జల్లెడపట్టే అమెరికా నిఘా ఉపగ్రహాలు (శాటిలైట్స్) కూడా కనిపెట్టలేకపోయాయి. అంత పకడ్బందీగా నిగూఢంగా పని పూర్తి చేసింది భారత ప్రభుత్వం. రాజస్తాన్ లోని పోఖ్రాన్ లో జరిగిన ఈ పరీక్షలతో భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన 52 ఏళ్ళ తరువాత అణుపాటవ సామర్థ్యం ఉన్న దేశాల సరసన చేరింది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు ఆ పరీక్షలతో తల ఎత్తుకొని తిరగడం ప్రారంభించారు.

- ఆకాశ్