రాష్ట్రపతిని కలిసిన మార్గదర్శక మండలి

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం
 

భారతీయ సంస్కృతికి ఆలవాలమైన సప్తపురాలలో మొదటిది అయిన అయోధ్యలో రామజన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి హిందువులు ఇంకా ఉద్యమించవలసి రావడం విచారకరం. ప్రయాగలో పదివేల మంది సాధుసంతులతో జరిగిన ఒక సమావేశంలో 'అయోధ్యలో రామజన్మభూమి స్థలంలో రామమందిర నిర్మాణానికి పార్లమెంట్ చట్టం చేయాల'ని ఒక ఏకగ్రీవ తీర్మానం చేయబడింది.

మే 30, 2013న స్వామి దయానంద సరస్వతి నాయకత్వంలో మార్గదర్శక మండలి రాష్ట్రపతిని కలిసారు. కేంద్రప్రభుత్వం, ముస్లిం పెద్దలు 1994 సంవత్సరంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేందుకు కట్టుబడి ఉండాలి. అయోధ్యలోని రామజన్మభూమిగా పేర్కొంటున్న స్థలంలో బాబరు కట్టడానికి పూర్వం మందిరం ఉందా? అనే విషయాన్ని నిర్ధారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. "ఒకవేళ అక్కడ గతంలో మందిరం ఉంటే ఆ స్థలాన్ని మేము వదిలిపెడతామ"ని ముస్లిం పెద్దలు చెప్పారు.  ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తామని కేంద్రం చెప్పింది. లక్నో బెంచ్ తీర్పు ద్వారా గతంలో అక్కడ మందిరం ఉందని నిర్ధారించబడింది. దానికి ప్రభుత్వం కాని, ముస్లిం పెద్దలు కాని ఎందుకు స్పందించటం లేదు. ఈ విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొని వెళ్లారు. మందిరాన్ని కూలగొట్టి మసీదు కట్టడం ఇస్లాం మత సూత్రాలకు విరుద్ధం. అయినా ఆ స్థలాన్ని ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు? ఒక దురాక్రమణదారుడి పేరుతో అయోధ్యలో కాని, దేశంలో మరే ఇతర ప్రాంతంలోకాని మసీదు నిర్మాణం చేయరాదని డిమాండ్ చేశారు. 

సోమనాథ మందిర నిర్మాణానికై నాడు కేంద్రం ప్రభుత్వం చూపిన చొరవనే నేడు రామమందిరం నిర్మాణంలో కూడా చూపాలని కోరారు. అన్ని విషయాలు విన్న రాష్ట్రపతి ఆ విషయాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొని వెళతానని చెప్పడం కొసమెరుపు.