దానమంత కష్టమైన పని మరేదీ లేదు - అందుకే దానం చాలా గొప్పది

వేదవ్యాసుడు
 
ఒకనాడు వ్యాసుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులను చూడడానికై కామ్యకవనానికి వెళ్లాడు. అక్కడ పాండవుల అభివాదన సత్కారాదులను స్వీకరించిన అనంతరం వ్యాసుడు యుధిష్ఠిరునితో సంభాషిస్తూ ఇలా అన్నాడు. -"యుధిష్ఠిరా! తపస్సు చేస్తేనే కాని లోకంలో ఎవరూ మహాసుఖం పొందజాలరు. తపస్సు కంటే గొప్పది మరొకటి లేదు. తపస్సు చేత గొప్ప గొప్ప విషయాలను కూడా సాధించవచ్చు. తపస్సు చేత సాధ్యం కానిది ఏదీ లేదని తెలుసుకో. సత్యము, ఋజుత్వము, క్రోధం లేకపోవడం, దానం, దమం, శమం, అసూయ లేకపోవడం, అహింస, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము ఇవి మానవులను పవిత్రం చేస్తాయి. సమయం వచ్చినప్పుడు సంతోషంగా దానం చేస్తూండాలి. సత్యం పలికేవానికి ఆయుర్దాయం, అనాయాసం, ఋజుత్వం లభిస్తాయి. క్రోధం, అసూయా లేనివాడు సుఖంగా ఉంటాడు.  
 
నాయనా! ఓ మహామతీ! వీరులైన నరులు ప్రియమైన ప్రాణాలను కూడా ధనం కోసం విడవడానికి వెనుదీయకుండా సముద్రాలలో ప్రయాణిస్తారు. అడవులలో తిరుగుతారు. కొందరు వ్యవసాయము, పశుపాలనాదికము చేస్తారు. కొంతమంది ఇతరులకు సేవ చేస్తారు.  
 
ఎంతో శ్రమపడి సంపాదించిన ధనాన్ని ఇతరులకు ఇవ్వడమనేది చాల కష్టమైన పని. ఈ పృథివిలో దానమంత కష్టమైన పని మరేదీ లేదు. అందుచేతనే దానం చాల గొప్పది".