తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ అవసరార్థమా?

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, శ్రావణ మాసం
 

ఒకప్పుడు భారతదేశంలో 56 రాజ్యాలు ఉండేవి. దేశ రక్షణలో కీలకంగా సామ్రాజ్యాలు ఉండేవి. శాలివాహన, విక్రమార్కుల సామ్రాజ్యాలు చరిత్రలో ఖ్యాతి గడించినవి. ఆ సమయాలలో దేశం శక్తివంతంగా ఉండేది. అభివృద్ధికి, పాలనలో సౌలభ్యం కోసం వికేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండేది. దానితో ప్రజలు వికేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉండేది. దానితో ప్రజలు వికేంద్రీకృతమవుతారు. 

కాలుష్యం లేని మౌలిక సదుపాయాల కొరతలేని పట్టణాలు, పల్లెలు ఆ రోజుల్లో వికసించిన విషయం మన చరిత్ర చెబుతున్న పాఠం. అట్లా దేశంలో ఒకప్పుడు పాలనా వ్యవస్థ ఉండేది. దాని కోసమే అభివృద్ధి మండలాలు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కావాలని కోరేది. మనదేశంలో ప్రజల జీవన విధానం, అవసరాలు గమనించాలి. ఇవి ఏవి ఈనాటి పాలకులకు పట్టవు. నైజాం ప్రభుత్వంలో వందల సంవత్సరాలు నలిగిపోయిన తెలంగాణ ప్రజలు కనీసం చదువుకొనేందుకు, జీవించేందుకు నానా ఇక్కట్లు పడి బ్రతుకుబండి ఈడ్చుకొని వచ్చారు. అందుకే నైజాం నుండి విముక్తమైనప్పుడే తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరినా దానిని అప్పటి కేంద్ర నాయకులు అంగీకరించలేదు. 

స్వాతంత్ర్యానంతరం తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని తెలంగాణ ప్రజలు భావించారు. దానిలో కూడా వివక్షతను ఎదుర్కొన్నారు. ఆ తదుపరి అనేక ఉద్యమాలు జరిగాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు ఇప్పడు ఒప్పుకొంది. 30.7.2013 నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకి పచ్చజెండా ఊపింది. ఈ ప్రకటనలో ఇంకేవైనా రాజకీయ తంత్రాలు ముడిపడి ఉన్నాయా? వేచి చూడాలి. 

ఎందుకంటే తన అవసరార్థం కాంగ్రెస్ ఏ తెర చాపనైనా ఎత్తేందుకు సిద్ధపడుతుంది. గడచిన రెండు సంవత్సరాలకు పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వ (యుపిఏ) గృహమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఆరు నెలల క్రితం వరకు చిన్న రాష్ట్రాల ఎజెండా బిజెపిది అని భావించే కాంగ్రెస్ ఇప్పుడు ఏ అవసరం వచ్చిందని ఇంత త్వరగా తెలంగాణ ప్రకటన నిర్ణయం తీసుకున్నారు? దీనిలో అంతరార్థం ఏమిటి? దేశ సమగ్రత, అభివృద్ధి దృష్ట్యా ఆలోచించిందా? అవసరార్థం తెరచాప లేపిందా? మేము చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం కాదు అనే అభిప్రాయం ప్రజలలో కలిగించటానికా? ఏది ఏమైనా ఇది మంచి పరిణామమే. కాని దానిని కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎట్లా ముందుకు పోనిస్తుందో వేచిచూడాలి.