పాక్, బంగ్లాదేశ్ లలోని హిందువుల రక్షణకు భారత్ పూనుకోవాలి

కలియుగాబ్ది 5115 , శ్రీ విజయ నామ సంవత్సరం, చైత్ర మాసం
  
1947 ఆగస్టు 14 అర్థరాత్రి మత ప్రాతిపదికన భారతదేశ విభజన జరిగింది. అప్పటి నుండి పాకిస్తాన్ లో హిందువులు పరిస్థితి నానాటికి దయనీయంగా దిగజారిపోతున్నది. 1972లో భారతదేశ దయాదాక్షిణ్యాలతో విమోచనం పొందిన బంగ్లాదేశ్ లో కూడా హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రెండు దేశాలలో హిందువుల భద్రత, గౌరవము, హక్కులు సర్వం కోల్పోయి అత్యంత దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇంత జరుగుతున్నా ఆ దేశాల ప్రభుత్వ వ్యవస్థలేవీ హిందువుల హక్కుల విషయంలో పట్టించుకోవటం లేదు. ఈ అకృత్యాలకు తట్టుకోలేక వారంతా భారత్ కు వచ్చేస్తున్నారు. ఇలా వచ్చే శరణార్థులకు భారత్ లో కూడా నిలువ నీడ లేకుండా పోతున్నది.

వాస్తవానికి 1950 'నెహ్రూ - లియాఖత్ అలీ' ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ ను నిలదీయక చోద్యం చూస్తోంది భారత ప్రభుత్వం.

స్వాతంత్ర్యానంతరం ఎక్కువకాలం ప్రభుత్వం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విధానంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనార్టీ హిందువుల రక్షణ విషయంలో స్పష్టత లేదు. అది ఆయా దేశాల ఆంతరంగిక వ్యవహారమని, మనం జోక్యం చేసుకోలేమని కర్తవ్య విముఖతను చూపిస్తున్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనార్టీ హిందువుల రక్షణ అనేది వాస్తవానికి లక్షలాది హిందువుల ఉనికికి సంబంధించిన సమస్య. కనుక ఇది ఆయా దేశాల ఆంతరంగిక సమస్యగా భావించడానికి వీలు లేదు.

కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీల (హిందువుల) పరిస్థితి దీనాతిదీనంగా మారి మెజారిటీ మతస్తుల హింసా, దౌర్జన్యాలకు గురౌతుండగా అంతర్జాతీయ స్థాయిలోని మానవ హక్కుల సంస్థ ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ గాని, ఐక్యరాజ్యసమితిలో గాని, భారతదేశంలోని రాజకీయ పక్షాలు గాని వీరి హక్కులపై స్పందించక పోవడం విచాకరం.

కాగా ఇటీవల శ్రీలంకలోని తమిళుల అణచివేతలో శ్రీలంక ప్రభుత్వ సైన్యాలు మానవ హక్కులను ఉల్లంఘించాయని, అంతర్జాతీయ యుద్ధ నిబంధనలను అతిక్రమించాయని ఐక్యరాజ్యసమితిలోని శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ అంశంపై అమెరికా సత్య శీలతను శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు ఒకరిని మించి ఒకరు శ్రీలంకలోని తమిళుల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. శ్రీలంక తమిళుల హక్కుల గురించి మాట్లాడే తమిళనాడు రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్ లలోని మైనారిటీలైన హిందువుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు?

ఇటీవలి కాలం నాటి శ్రీలంక తమిళుల హక్కులకై అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెచ్చి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా కాని, ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ గాని, భారతదేశంలోని ఏ రాజకీయ పక్షం గాని, మానవ హక్కుల సంఘాలు కాని పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని హిందువుల దీనావస్థను, వారి హక్కులను ప్రస్తావించకోవడం విచారకరం.

కనుక ఇకనైనా భారత ప్రభుత్వం తక్షణం స్పందించి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీల భద్రత, హక్కుల విషయంలో లియాఖత్ అలీ ఒప్పందం అమలు విషయమై ఐక్యరాజ్యసమితిలో ఒత్తిడి తెచ్చి పాక్, బంగ్లాలలో అల్పసంఖ్యాక హిందువుల రక్షణకు సిద్ధం కావాలి.