అపర భగీరథ ప్రయత్నం గంగానది శుద్ధి

గంగానది

ఆనాడు భగీరథుడు గంగను దివి నుండి భువికి తీసుకొని రాగా ఈనాటి అపర భగీరథుడు (నరేంద్రమోది) గంగాశుద్ధి కార్యక్రమాన్ని అకుంఠిత దీక్షతో చేపట్టాడు.

గంగానది పౌరాణిక నేపథ్యం : కపిల మహర్షి ఆగ్రహానికి గురై భస్మమైన తన 60వేల మంది తాతలకు పుణ్యగతులు కలిగించడానికి సగర వంశంలో జన్మించిన భగీరథుడు గంగను దివి నుండి భువికి తేవడానికి శివుని గురించి తపస్సు చేస్తాడు. పరమశివుని అనుగ్రహంతో దివి నుండి భువికి వచ్చిన గంగాజలాలతో భగీరథుడు తన తాతలకు పుణ్యగతులు కలిగించాడు.

పరమ శివుని జటాజూటంలోకి అతి వేగంగా దిగుతున్న గంగాదేవి, నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్న భగీరథుడు

ఈ విధంగా పౌరాణిక, ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన 'గంగ' భారతీయులకు సనాతన కాలం నుండి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, జీవనంలో భాగమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే గంగ భారతీయుల జీవనాడి.

గంగ హిమాలయాలలో గంగోత్రి వద్ద ప్రారంభమై దేవప్రయాగ వద్ద అలకానంద ఉపనదితో కలిసి ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా 2,525  కి.మీ. ప్రయాణించి కోల్ కత వద్ద గంగాసాగర్ లో (బంగాళఖాతం) కలుస్తున్నది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గంగ దేశంలోని 40 శాతం మందికి త్రాగునీరు అందిస్తున్నది. 50 కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిని కలిగిస్తున్నది. అటువంటి గంగలోనికి నిత్యం 270 కోట్ల లీటర్ల కాలుష్య జలం చేరుతూ గంగ పవిత్రతకు భంగం కలిగిస్తున్నది.

గంగా తీరంలో ఉన్న 50 పట్టణాలలో 36 పట్టణాలను ప్రథమశ్రేణి పట్టణాలుగా గుర్తించారు. గంగానదిలో చేరుతున్న కాలుష్యంలో 90 శాతం ఈ 36 పట్టణాల ద్వారా వస్తున్నది. మిగతా 10 శాతం ద్వితీయశ్రేణిగా గుర్తించిన మిగిలిన 14 పట్టణాల నుండి వస్తున్నది. గంగ కాలుష్యం అత్యధిక దూరం ప్రయాణించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనిదే. ఈ మార్గంలో వారణిశి, అలహాబాద్, కాన్పూర్ పట్టణాల నుండి 70 కోట్ల లీటర్లు, బీహార్ లోని పాట్నా నుండి 25 కోట్ల లీటర్లు, కోల్ కత నుండి 61 కోట్ల లీటర్లు కాలుష్య జలాలు గంగానదిలోకి వదలబడుతున్నాయి. ఈ మొత్తం కాలుష్య జలాలలో 40 శాతం జలాలు మాత్రమే శుద్ధి చేయబడుతున్నాయి.

గంగానదీ తీర పట్టణాలు, నగరాలే కాక గంగ ఉపనదులైన రామగంగ, కాళీనదుల ద్వారా ఆయా తీరపట్టణాలైన కాశీపూర్, మొరాదాబాద్, మీరట్, ముజఫర్ నగర్, మోదీనగర్, బులంద్ షహర్, కనోజ్ ల నుండి కాలుష్యం మరియు వ్యర్థాలు గంగానదిలో కలుస్తున్నాయి. దీనితో యుగయుగాలుగా స్నాన, దాన, తర్పణాలతో పానయోగ్యంగా ఉన్న గంగనీరు నేడు త్రాగడానికి గాని, స్నానానికి గాని యోగ్యంగా లేదని అంతర్జాతీయ కాలుష్య మండళ్ళు ఘోషిస్తున్నాయి. ఇంతటి ఘోరస్థితికి కారణం మనమే. మనమే మన చారిత్రక ఔన్నత్యాన్ని మంటగలుపుతున్నాము. గత 60 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యులే.

ఇన్నాళ్ళకు అపర భగీరథుడి వలె శ్రీ నరేంద్రమోది అకుంఠిత దీక్షతో ఎన్నికలలో తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొనేందుకు గంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ దేశానికి మహద్భాగ్యం. గంగను శుభ్రం చేయడమే కాక, ఆ నదిని ఆధ్యాత్మిక, పర్యాటక, రవాణా, విద్యుచ్ఛక్తి, వ్యవసాయం మొదలైనవాటి వృద్ధి కొరకు ఎలా ఉపయోగించుకోవచ్చనే విషయాలపై అద్యయనం కొరకు నాలుగు శాఖల మంత్రులు, కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పరచారు.

ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏదీ విజయవంతం కాజాలదు. కాబట్టి దీనిపై ప్రజలను చైతన్యపరచాలి. లేదంటే మళ్ళీ మళ్ళీ నది కాలుష్యానికి గురవుతూనే ఉంటుంది. ఈ దేశ పౌరులమైన మనం మనదేశ సంపదను కాపాడుకొనే ప్రయత్నం చేసినప్పుడే మన ప్రభుత్వాల కృషి విజయవంతమవుతుంది. గంగానది శుద్ధి కార్యక్రమంలో శ్రీ నరేంద్రమోది విజయం సాధించి తీరాలని మనం కోరుకుందాం. 

- పతికి