కాశ్మీర్ పాలకులు ఎటువైపు మొగ్గుతున్నారు?

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం,
  భాద్రపద మాసం

 
స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి ఈ రోజు వరకు కాశ్మీర్ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నది. పాకిస్తాన్ మనదేశ సరిహద్దులలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నది. గతంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. కాశ్మీర్ లో అనేక వేర్పాటువాద సంస్థలు పని చేస్తున్నాయి. అక్కడి రాజకీయ నాయకులు, పాలకులు కాశ్మీర్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకూడదని కోరుకుంటారేమో ! 370 ఆర్టికల్ ను అడ్డం పెట్టుకొని పదేపదే తమ ప్రత్యేకతలను చాటుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కాశ్మీర్ లో కొంత భూభాగం ఇప్పటికి పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది. దానిని అడ్డం పెట్టుకొని భారత్-పాకిస్తాన్ చర్చలలో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని అంటూంటారు. కాశ్మీర్ లో ఉన్న వేర్పాటువాదులకు కాశ్మీర్ ను ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ లోనైనా కలపాలి, లేదా ఇస్లామిక్ దేశంగానైనా మలచాలనేది లక్ష్యమేమో..! 
 
బహుశ: కాశ్మీర్ పాలకులకు కూడా అవే ఆలోచనలున్నాయేమో! అందుకే ఎప్పటికప్పుడు తమ గుర్తింపును ఇస్లాంలోనే చూపించుకుంటున్నారు. కాని ఈ దేశంలో చూపించుకోవడం లేదు. దానికి తాజా ఉదాహరణ ఏమిటంటే, పాకిస్తాన్ తో ఆగిన చర్చల గురించి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ -'భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు జరపాలి' అంటున్నాడు. సరిహద్దులలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ ఉంటే దానికి భారతకేంద్ర ప్రభుత్వం ఆగ్రహించి పాకిస్తాన్ తో ద్వైపాక్షిక చర్చలను జరపటానికి తిరస్కరించింది. ప్రస్తుత కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన అసెంబ్లీలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు జరపాలని తీర్మానం కూడా చేయించాడు. ఇది తన పరిధులను ఉల్లంఘించడమే. ఇదంతా దేనికోసం అంటే తమ ఇస్లాం గుర్తింపును కేంద్రానికి గుర్తుచేయటం కోసమేనని అనిపిస్తున్నది.