చెప్పులు కుట్టేవాని ఇంట భోజనం...! దళితుని ఇంట మంచినీరు...!

వివేక సూర్యోదయం - ధారావాహికం - 22

నరేంద్రుడు వివేకానందుడైన విధం - భాగం 2

 
 
1889లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ.లో పట్టభద్రుడయ్యాడు. గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలన్నింటినీ ఇష్టంతో చదివేవాడు. ఆంగ్లేయ ప్రొఫెసర్లు కూడా మెచ్చుకునేవారు. పట్టభద్రుడైన తరువాత ప్రాపంచిక జీవనమా, పారమార్థిక సన్యాసమా అన్న విచికిత్సతో చివరకు సన్యాసం వైపు మొగ్గాడు. దేవుణ్ణి చూశారా? అని అందరినీ అడుగుతుండేవాడు. ఎవరూ సంతృప్తికర సమాధానం ఇవ్వలేకపోయారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ ని అడిగాడు. ఆయన చూడలేదన్నాడు. కాని 'నీవు చూడగలవు' అన్నాడు. 
 
దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస భగవంతున్ని జగన్మాత రూపంలో ఆరాధించేవాడని విని 1882 జనవరిలో ఆయన్ను కలిశాడు. దేవుణ్ణి చూశానన్న రామకృష్ణ పరమహంస సాహసం ఆయనకు నచ్చింది. ఫిబ్రవరిలో మళ్ళీ కలిశాడు. రామకృష్ణ పరమహంస తన కుడిపాదాన్ని నరేంద్రునికి తాకించి భగవదనుభూతి కలిగించాడు. రామకృష్ణుని గురువుగా స్వీకరించాడు నరేంద్రుడు. నరేంద్రుడి తండ్రి అకాల మరణంతో వారి ఇంట దారిద్ర్యం తాండవించింది. జగన్మాత ముందు తన దారిద్ర్యం తీర్చమని అర్థించమని రామకృష్ణుడు సలహా ఇచ్చాడు. కాని ప్రతిసారీ కాళీమాత ముందు నిలబడి 'ఓ జననీ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు' అని కోరుకునేవాడు. 
 
1886లో రామకృష్ణ పరమహంస మహాసమాధి పొందాడు. నరేంద్రుడు రామకృష్ణుల ప్రియశిష్యునిగా గుర్తింపు పొందాడు. పరివ్రాజకుడుగా భారత భ్రమణం చేశాడు. 3 సంవత్సరాలపాటు 20,000 కి.మీ. దేశమంతా పర్యటించారు. రాజులతో, పేదలతో ఒకే విధంగా కలసి మెలసి తిరిగాడు. బృందావనానికి వెళ్తూ నరేంద్రుడు చెప్పులు కుట్టేవాని ఇంట భోజనం చేశాడు. ఓ హరిజనునితో కలిసి హుక్కా పీల్చారు. దళితుడి ఇంట మంచినీరు త్రాగారు. ఆళ్వారు సంస్థానంలో కొందరు ముస్లింలతో కలిసి భోజనం చేశారు. పేదప్రజలను దరిద్రనారాయణులన్నాడు. పేదల దైన్యస్థితి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆయన కళ్లల్లో నీరు తిరిగేవి. 
 
1892లో కన్యాకుమారి వెళ్ళారు. కన్యాకుమారి దేవి ఆలయానికి వెళ్ళారు. భక్తి నిండిన హృదయంతో దేవి ముందు మోకరిల్లారు. సముద్రంలో సుదూరంగా పార్వతీదేవి తపస్సు చేసిన పవిత్రశిల కనపడింది. సముద్రాన్ని ఈదుకుని వెళ్ళి శిలపై మూడు రోజులపాటు అహోరాత్రాలు తపోనిష్ఠతో ఉండి దేశసమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి తపించారు. చికాగోలో జరగనున్న విశ్వమత మహాసభల్లో పాల్గొని భారత శంఖారావాన్ని పూరించి భారతీయ ఆత్మను తట్టిలేపాలని నిర్ణయించుకున్నాడు. 
 
భారత పర్యటనలో ఖేత్రీ మహారాజ్ అజిత్ సింగ్ తో పరిచయం కలిగింది. అజిత్ సింగ్ ఆయనకు స్వామి వివేకానంద అని నామకరణం చేశారు. 
 
- హనుమత్ ప్రసాద్