భగవంతుని పాదాల వద్ద ఆత్మ సమర్పణ చేయండి

వివేక సూర్యోదయం - ధారావాహికం - 17


వివేకానంద స్వామి వ్రాసిన లేఖల నుండి


న్యూయార్క్, 19 నవంబర్, 1894
సాహస పుత్రులారా!

సంఘటనతో ముందుకెళ్లండి. మరింకేదీ ముఖ్యం కాదు. ఈ ప్రేమ, ఖచ్చితత్వము, ఓర్పు ఇవే మీకు కావాలి. జీవితమంటే ప్రగతి. అంటే వ్యాపక దృష్టి, అదే ప్రేమ. ప్రేమయే జీవితం, అదే జీవన సూత్రం. స్వార్థమే మరణం. జీవితమే మంచి చేయగలదు. మరణం వల్ల ఇతరులకు మంచి జరుగదు. 90 శాతం మంది బ్రతికుండీ చచ్చినవాళ్ల క్రిందే లెక్క. కాని ప్రేమించేవాడే జీవిస్తాడు. పేద ప్రజల గురించి ఆలోచించండి. అజ్ఞానులు, అణగారిన వర్గాలు, బడుగు వర్గాలు వంటివారి గురించి ఆలోచించండి. హృదయానుభూతి ఆగేదాకా, మెదడు భ్రమణం పూర్తయ్యేదాకా, మీకు పిచ్చి పట్టేదాకా ఆలోచించండి. అప్పుడు భగవంతుడి పాదాల వద్ద మీ ఆత్మ సమర్పణ చేయండి. అప్పుడు శక్తి వస్తుంది. సహాయం దొరుకుతుంది. అనంతమైన శక్తి వస్తుంది. పోరాడండి, పోరాడండి. ఇదే గత పదేళ్లుగా నా పిలుపు. అంతా చీకటిగా ఉన్నది. పోరాడండి. వెలుగు కిరణం కనిపించినా పోరాడండి. భయపడకండి. ధనము, ప్రతిజ్ఞ, విజ్ఞానము, ఇవేవీ పనిచేయవు. ప్రేమ మాత్రమే లాభిస్తుంది. శీలమే కష్టమైన దారులగుండా వెళ్లేందుకు దారి చూపిస్తున్నది. మన ముందున్న ప్రశ్న ఇది. స్వేచ్ఛ లేకుండా ప్రగతి లేదు. మన పూర్వులు మతభావనలకు స్వేచ్ఛనిచ్చారు. 

మనకో అద్భుతమైన మతముంది. కాని మనం మతం అంటే సంకెళ్లని భయపడుతున్నాం. పాశ్చాత్యులను చూడండి. వాళ్ల మతం చూడండి. వాళ్లకెంత స్వేచ్ఛ ఉందో చూడండి. మనిషికి ఆహారం, దుస్తులు, వివాహం వంటి విషయాలలో ఇంకా దేంట్లోనైనా వేరొకరికి హాని చేయనంత వరకు స్వేచ్ఛ ఉండాలి. భౌతిక నాగరికత గురించి మనం చాలా మూర్ఖంగా మాట్లాడతాం. అందని ద్రాక్ష పుల్లన. భారతదేశంలో ఓ లక్షమంది ఆధ్యాత్మికత నిండిన స్త్రీ పురుషులున్నారు. వీరి ఆధ్యాత్మిక ఆడంబరం కోసం 30 కోట్లమంది బానిసలుగా మాడుతుండాలా? భౌతిక నాగరికత పదిమందికి పనినివ్వాలి. ఆహారమివ్వాలి. అన్నం పెట్టని పరమాత్మను నేను నమ్మను. పేదలకు అన్నం, విద్య ఇవ్వాలి. శుష్క పౌరోహిత్యం తొలగించాలి. స్వేచ్ఛ ఇవ్వనివాడు స్వేచ్ఛ పొందేందుకు అర్హుడు కాదు. ఇంగ్లీషువాడు మనకు అధికారమిచ్చినంత మాత్రాన బానిసత్వం పోతుందా? మతాధిపత్యం తొలగిస్తే స్వేచ్ఛాయుత సమాజం ఆవిష్కరింపబడుతుంది. సమాజాన్ని సమానత్వంతో కలిపిన శంకర, రామానుజ, చైతన్య ప్రభువుల వంటి వారి బోధనల ఆధారంగా మళ్లీ జాగృతం చేయండి.
- హనుమత్ ప్రసాద్