మట్టిలో మాణిక్యాలు


కాన్వెంట్లు, కిరస్తానీ మిషనరీ పాఠశాలలు, ఆంగ్లమాధ్యమం, కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే మన పిల్లలను ఉద్ధరిస్తాయనే భ్రమలో మనవారు కొట్టుమిట్టాడుతున్నారు. అదంతా వట్టి భ్రాంతి మాత్రమే అని నిరూపించారు ముగ్గురు పిల్లలు.  

ద అట్లాంటా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ "లర్నేసియమ్ ఓపెన్ ఓకాబ్ కాంటెస్ట్ 2013-14" అనే పేరుతో 30.8.2013 నాడు మాధవపురం "టెక్ మహీంద్ర కళాభవనం"లో ఆంగ్ల పదకోశ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిందరవందరగా ఉండే ఆంగ్ల అక్షరాలతో, సరయిన పదాన్ని వ్రాయడం, ఉచ్ఛరించబడిన ఆంగ్ల పదానికి "స్పెల్లింగు" వ్రాయడం, శూన్యాలను పూరించడం వంటి విభిన్న అంశాలలో ఈ పోటీలు జరిగాయి. గ్లెలెండల్, హావార్డ్, మెరీడియన్, CMR ఇంటర్నేషనల్, DSE వంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి పేద విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చినవారు ఏం పోటీ పడగలరులే! అనుకున్నారు. కాని ఫలితాలు మాత్రం అన్ని భ్రమలనూ పటాపంచలు చేసేశాయి.

మరుజోడి నృసింహులు (5వ తరగతి, అంజయ్యనగర్ ప్రభుత్వ పాఠశాల) టాపర్ గా నిలిచాడు. మమత అనే విద్యార్థిని (8వ తరగతి, గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాల) రెండోస్థానం సాధించగా, అదే పాఠశాలకు చెందిన నరేందర్, సాయిలక్ష్మిలు మూడోస్థానంలో నిలిచారు. మరుజోడి నృసింహులు 50,000 రూపాయల బహుమతిని అందుకున్నాడు.   

మనం ఎంతో గొప్పఅనుకుంటున్న ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు, ఆంగ్ల మాధ్యమాలు గాలికి కొట్టుకుపోయాయి. విజయవంతులైన చిరంజీవులకు లోకహితం జేజేలు పలుకుతోంది. 

- ధర్మపాలుడు