ఓటు వినియోగం తక్షణ కర్తవ్యం

ఎన్నికల వేళ - 2014 - భాగం 2


గత కొన్ని సంవత్సరాలుగా Super Power స్థానాన్ని సాధిస్తుందనుకున్న మన దేశం ప్రస్తుతం అనైతిక, అసమర్థ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ప్రపంచ ముఖచిత్రంలో అట్టడుగు స్థాయికి పడిపోతోంది. దీనికి కారణం ప్రజాప్రతినిదులను ఎన్నుకునే మన వ్యవస్థ పట్ల ప్రజల నిరాసక్తత, అపనమ్మకం, బాధ్యతారాహిత్యం.

మనం ఒకసారి 2009లో జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిద్దాం. 2009నాటికి భారతదేశ జనాభా 116 కోట్లు. అయితే ఎన్నికలలో ఓటువేసినవారు 42 కోట్లు మంది మాత్రమే. దానిలో ఓటుహక్కు ఉన్నవారు 72 కోట్లు మంది. అంటే మొత్తం జనాభాలో 62%. దీనిని బట్టి దాదాపు 30 కోట్లమంది ఓటు హక్కు కలవారు ఎన్నికల రోజున ఓటింగ్ లో పాల్గొనలేదు. వారంతా సాధారణ ఎన్నికలలో పాల్గొనేందుకు ఇచ్చే సెలవు దినాన్ని తమ హితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికో, లేదా సినిమా చూడడానికో, విహారయాత్రలకో గడిపేసి ఉంటారు. ఇంకొంతమంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి పట్ల నిరాశా నిస్కృహలతోను లేదా 'నా ఒక్క ఓటుతో ఏమౌతుంది?' అన్న భావనతోను ఎన్నికలలో పాల్గొని ఉండరు. మరికొంతమందికి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల మూలంగా ఓటు నమోదు చేయించుకొనకపోయి ఉండవచ్చు.
 
దేశ రాజధాని ఢిల్లీలో 2013 డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓటుహక్కును వినియోగించుకున్న మన మాతృమూర్తులు

తక్కువ శాతం ఓట్లతోనే రాజకీయనాయకులు తామనుకున్నది సులభంగా సాధించుకో గలుగుతున్నారు. 2009 ఎన్నికలలో పోలైన ఓట్లలో భారత జాతీయ కాంగ్రెస్ కు దేశం మొత్తం మీద వచ్చిన ఓట్లు 12 కోట్లు. రెండవ అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 8 కోట్లు. అంటే మొత్తం జనాభాలో 10% (12 కోట్లు) వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ప్రజాస్వామ్యానికి మూలసూత్రమైన "Majority Opinion" ను పరిహాసం చేస్తూ 10% కన్నా తక్కువ ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి.

అంతేకాకుండా క్రింది పట్టికలను గమనిస్తే ప్రస్తుత పార్లమెంట్ లో 380 మంది పార్లమెంట్ సభ్యులు 30% కంటే తక్కువ ఓట్లతో ఎన్నుకోబడ్డారు. ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి కావలసిన 2/3 సభ్యుల సంఖ్య (543-2/3 = 362) కన్నా ఎక్కువ! ఈ పరిస్థితి మారాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు దేశహితం కోసం తప్పనిసరిగా ఓటు వేయాలి.
ప్రస్తుత మన జనాభా 120 కోట్లు. అందులో మొదటిసారి ఓటు హక్కుకు అర్హత సంపాదించినవారు 14 కోట్లు. అంటే 11%. ఇది పెద్దపార్టీలకు వచ్చిన ఓట్లకన్నా ఎక్కువ. కాబట్టి వారంతా దేశహితం కోసం మరియు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేయించుకుని ఎన్నికలలో సరైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.

ఇది మనం గొప్పగా చెప్పుకునే "ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం"లో భావితరం ముందున్న "తక్షణ కర్తవ్యం". దీని ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో సమున్నత స్థానానికి చేర్చుదాం!

ఇంకా ఎక్కువ వివరాలకు www.ceoandhra.nic.in, www.letsvote.in చూడండి.


ఓటు హక్కును వినియోగించుకుంటున్న మన దేశ గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ
ఓటు హక్కును వినియోగించుకుంటున్న మన దేశ గౌరవనీయ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్
ఓటు హక్కును వినియోగించుకుంటున్న మన దేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్

- పి.రాఘవేంద్ర