జమ్మూలో కూడా హిందువుల నిర్మూలన యత్నాలా?


గత మాసం ఆగస్టు 9న జమ్మూలోని 'కిస్తవార్' పట్టణంలో రంజాన్ పండుగ రోజున తలెత్తిన స్థానిక వివాదాలు రాజకీయ నాయకుల క్రీనీడలో తీవ్రమై మతకలహాలు చెలరేగి ఇరువురు ప్రాణాలు కోల్పోవడం, 103 దుకాణాలు లూటీకి గురి కావడం జరిగింది. అందులో 98 దుకాణాలు హిందువులకు చెందినవి. 10 రోజుల పాటు నిరవధిక కర్ఫ్యూ విధించడం వల్ల పౌరజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. 

ఈ మత కలహాలకు కారణాలను కాస్త లోతుగా విశ్లేషించినట్లయితే మతకలహాలు జరుగుతున్న సమయంలో కిస్తవార్ నియోజకవర్గ శాసనసభ్యుడు మరియు జమ్మూ కాశ్మీర్ జూనియర్ గృహమంత్రి అయిన 'సజ్జత్ కిచ్లూ' ఆ ప్రాంత పోలీస్ కమిషనర్ మరియు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్లతో కలసి అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు కేవలం 20 మీటర్ల దూరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో 400 మంది పారామిలటరీ దళాల రక్షణ మధ్య ఉన్నారు. కానీ రాష్ట్రప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ సమాచారం అందించి అల్లర్ల నియంత్రణకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పర్యవసానంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతనిని పదవి నుండి తప్పించవలసి వచ్చింది.

ఈ అల్లర్ల నేపథ్యాన్ని, జమ్మూకాశ్మీర్లో గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, 1990 దశకంలో కాశ్మీరు లోయలో కశ్మీరీ పండిట్లను ఒక్కొక్క కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ సాగిన పాకిస్తానీ అనుకూల ముస్లింల ఆక్రమణ కాండను గుర్తు చేసుకోవాలి. ఆ కుటుంబ యజమానిని లక్ష్యం చేసుకొని వారిని అనేక ఇబ్బందులకు గురిచేసి చివరకు కుటుంబ యజమానిని హత్య చేసేవరకు వారి ఆగడాలు సాగాయి. దానితో ఆ కుటుంబం ఆ బాధలను తట్టుకోలేక కశ్మీర్ లోయను వదిలి ఢిల్లీ తదితర ప్రాంతాలకు పారిపోయారు. అలా 2000 సంవత్సరం నాటికి కశ్మీరు లోయలో హిందూ కుటుంబం అనేది లేకుండా వందశాతం పాకిస్తానీ అనుకూల మహమ్మదీయ జనాభాను వృద్ధి చేశారు.   ఆ కారణంగా 2000 సంవత్సరం తరువాత కశ్మీరు లోయలో పాకిస్తానీ అనుకూల రాజకీయ నినాదాలు, తీర్మానాలు ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా సాగుతున్నాయి. 

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం - ఇన్ సెట్లో కిస్టవార్ పట్టణం

అదే ప్రణాళికను జమ్మూలో కూడా హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమలు చేయజూస్తున్నారు. ఆ ప్రణాళికలో భాగమే ఈ కిస్తవార్ సంఘటన. గతంలో జమ్మూలో జరిగిన సంఘటనలను, అమర్ నాథ్ యాత్రాబృందంపై తీవ్రవాద బృందాల దాడిని బూచిగా చూపించి యాత్రా కాలాన్ని కుదించడం వంటి పరిణామాలు దీనిని ఋజువు చేస్తున్నాయి.

ఇన్ని విషయాలు తెలిసికూడా జమ్మూకాశ్మీరు రాజకీయ నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కిస్తవార్ వంటి సంఘటనలు నివారించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం ఒక విధంగా భారత వ్యతిరేకులకు మద్దతిచ్చినట్లే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. కనుక భారతదేశంలోని యావత్ హిందూ సమాజం ఈ సమయంలో జమ్మూలోని హిందువులకు తోడుగా నిలచి, పై సంఘటనలు పునరావృతం కాకుండా చూసే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

- పతికి