తరుణ్ తేజ్ పాల్... జర్నలిస్టు ముసుగులో ఉన్న ఓ కామ పిశాచి

 
భారతదేశంలో 'స్టింగ్ ఆపరేషన్' లకు అతను పెట్టింది పేరు. అంతేకాదు, సంచలనాత్మక కథనాలను సైతం వెలువరించడంలో అతనికి అతనే సాటి. మరికొందరైతే దేశంలో పరిశోధనాత్మక జర్నలిజానికి కొత్త ఊపు తెచ్చిందే ఆయనగారంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎవరో తెలిసిందనుకుంటా.... ఆయనే సంచలనాత్మక వార్తల పత్రిక 'తెహల్కా' వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్. "తెహల్కా అంటే తరుణ్ - తరుణ్ అంటేనే తెహల్కా". ఇవీ ఇంతకాలం దేశంలో ఈయనగారి బాకారాయుళ్లు చేస్తూ వచ్చిన ప్రచారం.

అయితే ఇప్పుడు ఇతగాడి గురించిన వార్తే మీడియాకు పెద్ద సంచలనమైపోయింది. అదేమిటంటే 'తరుణ్ తేజ్ పాల్ ఓ కామ పిశాచి' అనేది. అంతేకాదు, ఈ వార్తే నేషనల్ మీడియాలో వారం రోజుల పాటు సంచలనాత్మక కథనాలకు కేంద్రబిందువైంది.
 
 
అసలు విషయంలోకి వెళితే - తెహల్కా పత్రిక గోవాలో "థింక్' ఫెస్టివల్" అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అదే పత్రికలో పనిచేస్తున్న ఒక మహిళా జర్నలిస్టు కూడా హాజరయ్యారు. ఇక్కడే తేజ్ పాల్ పైశాచిక మదోన్మత్త చేష్టలు బయటపడ్డాయి. ఇంతకాలం తన సంచలనాత్మక కథనాలతో నీతిసూత్రాలు వల్లించిన ఈయనగారు కామపిశాచిగా సరికొత్త అవతారం ఎత్తారు. తన సంస్థలోనే పనిచేస్తున్న, దాదాపు తన కూతురు వయసున్న ఓ మహిళా జర్నలిస్టుపై హోటల్ గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇ-మెయిల్ ద్వారా పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. దానితో బాధితురాలికి జరిగిన అన్యాయానికి ఓ 'సారీ' చెప్పేసి.. తాను పత్రిక ఎడిటర్ బాధ్యతల నుండి ఆరు నెలలు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు తేజ్ పాల్.

అటు ఈ ఘటన గోవాలో జరగడంతో అక్కడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దీంతో ఖంగుతిన్న తేజ్ పాల్ పోలీసులకు సహకరిస్తానంటూనే బాధితురాలి తల్లి వద్దకు తన కూతురు 'తియా'ను పంపి కేసును నీరుగార్చేందుకు యత్నించాడు. మరోవైపు అరెస్టును తప్పించుకునేందుకు తాను తాగిన మత్తులో బాధితురాలితో జరిపిన సంభాషణలను తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే ఈ దారుణం జరిగిందని ఢిల్లీ హైకోర్టులో వాదించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పైగా ఇదంతా గోవాలోని బిజెపి ప్రభుత్వం తనమీద సాగిస్తున్న కక్షసాధింపు చర్య అని ప్రకటించి సంఘటనకు రాజకీయ రంగు పులిమే యత్నం కూడా చేశాడు. అటు మహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ఎప్పుడూ ముందుండే వామపక్ష, కాంగ్రెస్ మహిళా సంఘాలు బాధితురాలి పక్షాన పోరాడడానికి ఎందుకో వెనకడుగు వేశాయి. తరుణ్ తేజ్ పాల్ ను కఠినంగా శిక్షించాలంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నాయి.

తనపై దుష్కార్యానికి పాల్పడిన తెహల్కా అధిపతితో ధైర్యంగా పోరాడుతున్న బాధితురాలి పక్షాన అండగా నిలిచేందుకు మనం అందరం ముందుకు రావాలి. 
 
- నారద