ప్రజల దృఢ సంకల్పమే ప్రశ్నలన్నింటికి సమాధానం

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం
 
భాగ్యనగరం మరోసారి రక్తసిక్తమయ్యింది. 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 119 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 21 రాత్రి 7 గంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ వద్ద జరిగిన బాంబు ప్రేలుళ్లు సృష్టించిన భయానక దృశ్యమది. ఉగ్రవాదులు భారత్ లోఅందులోనూ భాగ్యనగరంలో ఎందుకు దాడులు చేస్తున్నారు? అమాయకులైన ప్రజలను ఎందుకు హతమారుస్తు న్నారు? 'ఉగ్రవాదానికి మతం లేదని అనటం చాల సులభం. కాని ఉగ్రవాదులందరూ ఒకే మతానికి చెందిన వారిగా కనబడుతున్నారు. ఏ లక్ష్యం లేకుండా దశాబ్దం పైగా దాడులు చేస్తున్నారు.
 
ఉగ్రవాద మూలాలను ఛేదించకుండా ఉగ్రవాదాన్ని అణచివేయ గలుగుతామా? ప్రపంచంలో అనేక దేశాలు తమ దేశంపై ఉగ్రవాద దాడులను నిరోధించేందుకు విశేష ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఏం చేస్తున్నది? తమ రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవడం కోసం మన పాలకులు కఠిన చర్యలు తీసుకోవటం లేదా? దాడి జరిగిన ప్రతిసారి 4 రోజులు హడావిడిగా విచారణ జరుగుతుంది. ఆ తరువాత మరో దాడి జరిగేవరకు ఏమీ పట్టనట్లు ఊరుకుంటారు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటానికి ఉగ్రవాదం వంటి భయంకర దేశద్రోహకర సమస్యలను పరిష్కరించకుండా అంటీముట్టనట్లు వ్యవహరించటమే ఉపాయంగా మన ప్రభుత్వాలు భావిస్తున్నాయా? అందరూ ఈ విషయాల గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చింది. ప్రజలు ధృఢ సంకల్పంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోనంత వరకు ఇదిలా సాగుతూనే ఉంటుంది.