విశ్వాసమంటే ఇదీ...!

యజమాని (ఖననం చేయబడిన) శరీరం వద్దే నిరీక్షిస్తున్న రాము (కుక్క) - ఫోటో హిందూ దినపత్రిక సౌజన్యంతో..
 
'కుక్క విశ్వాసానికి మారు పేరు' అనేది ప్రసిద్ధి. చలన చిత్రాలలో కొన్ని కథలు చూసి అతిశయోక్తి అనుకుంటాం! కాని అటువంటి సంఘటన ఒకటి చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం మరదవాడ గ్రామంలో జరిగింది. కృష్ణమనాయుడు అనే ఒక కర్షకుడు ఒకసారి ఒక దిక్కులేని కుక్కపిల్లను చూసి జాలిపడి ఇంటికి తెచ్చాడు. ఆ క్షణం నుండి 'రాము' అని పలవబడుతున్న ఆ కుక్క తన యజమాని వెంటే తిరుగుతూ ఉండేది. పొలానికి వెళ్లినా, ప్రక్క ఊరికి వెళ్లినా వెంటే ఉండేది. ఆయన పెడితేనే తిండి తినేది. 
 
ఇలా ఉండగా జనవరి 2వ తేదీనాడు కృష్ణమనాయుడు మరణించాడు. రాము కూడా స్మశానానికి వెళ్లింది. అంత్యక్రియలు పూర్తి అయినా కూడా తిరిగి ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోయింది. రాముని వెనక్కు తెచ్చే ప్రయత్నం ఊరివారు చేసినా ఫలితం లేకపోయింది. రెండు దినాల తరువాత కొంతమంది స్మశానానికి వెళ్లి చూస్తే రాము ఇంకా అక్కడే ఉన్నది. యజమాని తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ తిండి తినకుండా వేచి ఉన్నది. రాము విశ్వాసానికి ఊరివారు ఆశ్చర్యపోతున్నారు.
 
- ధర్మపాలుడు