విశాల దృష్టికి అన్ని మతాలు ఒక్కటే

ప్రపంచ మతమహాసభలో స్వామి వివేకానంద 


"ప్రపంచంలో ప్రాచీనతమమైన సన్యాసి సంప్రదాయపు ప్రతినిధిగా నేనీనాడు మీకు కృతజ్ఞతలు తెల్పడానికి మీ ఎదుట నిలిచియున్నాను. ఏ ధర్మము ప్రపంచములోని సర్వమతాలను గౌరవించడము, అన్నిటి యెడల సహిష్ణుతా భావాన్ని కలిగి ఉండడము అనే రెండు ప్రముఖ సిద్ధాంతాలను బోధించినదో, ఆ ధర్మము యొక్క ప్రతినిధిని నేను. ఏ ధర్మము యూదుల మీద అత్యాచారము జరిగినప్పుడు వారికి ఆశ్రయమిచ్చినదో, ఏ ధర్మము పార్శీలను తన పొరుగువారిని చేసుకున్నదో, ఏ ధర్మము ప్రపంచములోని సకల ధర్మములు కూడా పవిత్రములని సదా బోధిస్తూ వచ్చిందో, ఆ ధర్మంలో జన్మించి నేను ధన్యుడనయ్యాను. సర్వధర్మములకు జనని, జన్మభూమి హిందూ ధర్మము కావడమే దీనికి కారణము. 

ఈ సుందర ప్రపంచములో ఇన్ని కష్టాలకు మూలకారణము మూఢమత దురభిమానము. కాని విశాలదృష్టికి అన్ని ధర్మాలు ఒకటే. అన్నిటి చరమ లక్ష్యము ఒకటే. ఈ ఉదాత్త తత్వాన్ని నేటి ప్రాత:కాల ఘంటా నినాదములాగా సమస్త విశ్వంలో ప్రతిధ్వనింపచేయడానికే మనమంతా ఇక్కడ సమావేశమైనాము. అందువలననే నేటి ఈ మతమహాసభ అటువంటి మతదురభిమానపు కూకటివేళ్లను తెగనరికే వజ్రాఘాతం".